SubWays: అరుదైన సూపర్‌ సబ్‌వే మెట్రో స్టేషన్స్‌! 

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన సబ్‌వే రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉండటం గమనార్హం. కొన్ని సబ్‌వే మెట్రో స్టేషన్లను ఎప్పుడో మూసివేయగా.. మరికొన్నింటిని కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికార యంత్రాంగం తెరవడం లేదు.

Published : 13 Nov 2021 14:40 IST

నగరాలకు వన్నెతెచ్చినా.. నిరుపయోగంగానే!

ఇంటర్నెట్‌ డెస్క్:  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన సబ్‌వే రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉండటం గమనార్హం. కొన్ని సబ్‌వే మెట్రో స్టేషన్లను ఎప్పుడో మూసివేయగా.. మరికొన్నింటిని కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికార యంత్రాంగం తెరవడం లేదు. నగరాలకు వన్నె తెచ్చేలా ఉన్న సబ్‌వే మెట్రో నిర్మాణాల గురించి తెలుసుకుందాం...

సబ్‌వేను మ్యూజియంగా మార్చేసి...

సబ్‌వేల నిర్మాణాలకు స్పెయిన్‌ పెట్టింది పేరు. మాడ్రిడ్‌లో ఎనిమిది మెట్రో స్టేషన్లతో 1919లో ప్రారంభించిన సబ్‌వేలను, 1966లో మూసివేశారు. అక్కడ అధునాతన రైళ్ల రాకపోకలకు సౌకర్యవంతంగా లేకపోవడంతో వాటిని మూసివేయడం గమనార్హం. పారిస్‌లోని మెట్రోస్టేషన్లను ఆదర్శంగా తీసుకుని అలాంటి ఫీచర్స్‌తోనే మాడ్రిడ్‌లో నిర్మించారు. 2008లో మళ్లీ వాటిని తెరచి మ్యూజియంగా మార్చేశారు. 1920లో ప్రజల జీవిత విధానం ఎలా ఉందో కళ్లకు కట్టేలా తీర్చిదిద్దారు.


పారిస్‌లోనే మూడు.. చిత్రీకరణకు సూపర్‌!

 పారిస్‌లో సెయింట్‌ డెనిస్‌-రిపబ్లిక్‌ స్టేషన్ల మధ్య సెయింట్‌ మార్టిన్‌ సబ్‌ వే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో దీన్ని మూసివేశారు. అయితే యుద్ధం ముగిశాక మళ్లీ తెరచినా కొంతకాలానికే మూతపడింది. ఖాళీగా ఉండటంతో నిరాశ్రయులు అక్కడకు చేరుకోవడం మొదలైంది. ఇప్పటికీ గోడలపై అప్పటి పోస్టర్లు ఉన్నాయి. అలాగే పారిస్‌లో 1923-39 మధ్యకాలంలో తొలి మెట్రో లైన్‌ క్రొయిక్స్‌ రౌగ్‌. అయితే రెండో ప్రపంచయుద్ధం తర్వాతి నుంచి ఇప్పటి వరకు మెట్రో సబ్‌వేను పునఃప్రారంభించకపోవడం గమనార్హం. పారిస్‌లోని పన్నెండు మెట్రో స్టేషన్లలో రెండో ప్రపంచ యుద్ధంవేళ చాలావాటిని మూసివేసినా మళ్లీ తర్వాత తెరిచారు. అయితే క్రొయిక్స్‌ రౌగ్‌ మెట్రో సబ్‌వే స్టేషన్‌ను తెరవకుండా అలానే వదిలేశారు. పోర్ట్‌ డెస్ లిలాస్‌ సబ్‌వే మెట్రో స్టేషన్‌ను 1929లో మూసివేశారు. 1970 నుంచి సినిమాల చిత్రీకరణకు అద్భుతమైన ప్రాంతంగా ఇది పేరుగాంచింది. సాధారణ ప్రజల సందర్శన కోసం సబ్‌ వే మెట్రో స్టేషన్‌ను తెరిచి ఉంచారు. యూరోపియన్‌ చారిత్రాత్మక ప్రదేశంగా యాత్రికుల దృష్టిని ఇది ఆకర్షించింది. ఇక్కడ సినిమా చిత్రీకరణ కోసం పది గంటల సమయానికి 17,500 డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది.


దెయ్యాల నిలయాలుగా ప్రసిద్ధి!

లండన్‌లోని ఘోస్ట్‌ స్టేషన్లలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది అల్‌డ్విచ్‌ సబ్‌వే మెట్రో స్టేషన్. 1994కు వరకు పని చేసిన స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. అయితే ఇప్పటికీ చూడటానికి అనుమతిస్తున్నారు. చెక్కతో రూపొందించిన పానెల్స్‌, చారిత్రక పోస్టర్లను పరిరక్షించారు. ఇక్కడ కూడా హాలీవుడ్‌ చిత్రాలను చిత్రీకరించారు. స్టేషన్‌కు పర్యాటకులను చేరవేసేలా లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మ్యూజియం టూర్లు నిర్వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యటనలను ప్రస్తుతం తాత్కాలికంగా రద్దు చేసింది. లండన్‌లో అండర్‌గ్రౌండ్‌ రవాణా వ్యవస్థలు ఎక్కువగా ఉండేవి. ఈస్ట్రన్‌లోని సబ్‌వే మెట్రోస్టేషన్‌ ఎంతో బిజీగా ఉండే రూట్‌. అయితే న్యూ విక్టోరియా లైన్‌ను పునర్నిర్మాణం చేయడంతో ఈస్ర్టన్‌ టన్నెల్స్‌ ప్రభ తగ్గిపోయింది.


మధ్యలోనే వదిలేసిన అతిపెద్ద నిర్మాణం

అండర్‌గ్రౌండ్‌లో సబ్‌వే నిర్మాణమంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమెరికాలో చాలా సబ్‌వే మెట్రో స్టేషన్లు ఉన్నాయి. అయితే సిన్‌సినాటీ సబ్‌వే మెట్రో స్టేషన్‌ నిర్మాణాన్ని 20వ శతాబ్దం తొలినాళ్లల్లో ప్రారంభించారు. నిర్మాణ వ్యయం పెరగడం, నిధుల సమస్య, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ప్రాజెక్టు ఆగిపోయింది. 1928లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వదిలిపెట్టేశారు. అమెరికాలోనే రద్దయిన అత్యంత పెద్ద టన్నెల్‌గా ఇది రికార్డుకెక్కింది. ఇప్పుడు లాస్‌ఏంజెలెస్‌ నగరంలో ఉన్న సబ్‌వే కాకుండా ఓల్డ్‌ సిటీలోనూ సబ్‌వే టెర్మినల్‌ ఉంది. 1940లలో దాదాపు 65వేల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ప్రస్తుతం సబ్‌వే మెట్రో స్టేషన్‌ అందుబాటులో లేదు.


నిరుపయోగంగా మారి.. 

గతంలో అవిభాజ్య సోవియట్‌ యూనియన్‌ విస్తీర్ణం చాలా పెద్దది. రష్యా నుంచి విడిపోయాక అనేక దేశాలు రిపబ్లిక్కులుగా ప్రకటించుకున్నాయి. వాటిలో ఉక్రెయిన్‌ పెద్దది. పురాతన చర్చీలకు పెట్టింది పేరు. అలానే కీవ్‌ మెట్రో స్టేషన్‌ను సోవియట్‌ యూనియన్‌ నిర్మించింది. అందులో న్యూక్లియర్ టన్నెల్స్‌, బంకర్లు, గిడ్డంగులు ఉండటం విశేషం. అయితే సబ్‌వే టన్నెల్‌లోకి వెళ్లాలంటే మాత్రం అంత సులభం కాదు. అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. 


బెల్జియంలో సొరంగం.. కెనడాలో కేవలం ఆరు నెలలే..

సొరంగ మార్గంలో రైలు దూసుకుపోతుంటే భలేగా ఉంటుంది కదా! బెల్జియంలోని యాంట్‌వెర్ప్‌ ప్రిమెట్రో స్టేషన్‌ను 1980లలో నిర్మించారు. ఇప్పటికీ ఇది వినియోగంలో ఉండటం విశేషం. నగర కేంద్రాన్ని అనుసంధానం చేసేలా టన్నెల్స్‌ నిర్మాణానికి నిధుల కొరత తీవ్ర సమస్యగా మారింది. ఇక కెనడా టొరొంటోలోని లోయర్‌ బే స్టేషన్‌ను కేవలం ఆరు నెలలు మాత్రమే వినియోగించడం గమనార్హం. ఇంటర్‌లైనింగ్‌ ద్వారా కొత్త కనెక్ట్‌విటీ ఇవ్వాలనే ప్రయోగం కారణంగా ఈ ప్రాజెక్ట్‌ విఫలమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని