Appendix: ఆ ఊర్లో ఉండాలంటే అపెండెక్స్‌ తొలగించుకోవాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్రామాలున్నాయి. అయితే, గ్రామాల్లో ఉండే కుటుంబాల సంఖ్య తక్కువగానే ఉంటుంది. అందుకే, ప్రజలంతా కలిసి మెలిసి ఉంటారు. ఊరి మేలు కోసం ఏకతాటిపైకి వస్తారు. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి కొన్ని గ్రామాలు ప్రభుత్వాలు, అధికారులతో సంబంధం లేకుండా సొంతగా నిబంధనలు

Published : 16 Nov 2021 09:55 IST


(Photo: google maps)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, షరతులను దేశంలోని అన్ని ప్రాంతాల వారు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కానీ కొన్ని గ్రామాల్లో సొంతంగా నిబంధనలు, షరుతుల పెడుతుంటారు. ప్రభుత్వాలు, అధికారులతో సంబంధం లేకుండా వాటిని పాటించమని చెబుతుంటారు. అలా అంటార్కిటికాలోని కింగ్‌జార్జ్‌ ఐలాండ్‌లో ఉన్న విల్లా లాస్‌ ఎస్ట్రెల్లాస్‌ అనే గ్రామం ఓ నిబంధన విధించుకుంది. గ్రామంలోకి ఎవరైనా స్థిరపడాలని వస్తే వారు అపెండెక్స్‌ (ఉండుకం) తొలగించుకోవాలి. నిబంధన విచిత్రంగా ఉంది కదా! దీనికో కారణముంది. అదేంటంటే!

అంటార్కిటికాలో మనుషులు జీవిస్తున్న రెండు ప్రాంతాల్లో విల్లా లాస్‌ ఎస్ట్రెల్లాస్‌ ఒకటి. ఈ గ్రామంలో వేళ్ల మీద లెక్కపెట్టగలినన్ని ఇళ్లు ఉంటాయి. ఆ ఊరులో దాదాపు 150 మంది నివసిస్తున్నారు. దుకాణాలు, పాఠశాల, బ్యాంక్‌, పోస్ట్‌ ఆఫీస్‌... ఇలా అన్ని వసతులున్నాయి. రెండు ప్రాథమిక ఆస్పత్రులూ ఉన్నాయి. కానీ ఏదైనా తీవ్ర అనారోగ్యం వస్తే వందల కి.మీ. ప్రయాణం చేసి పట్టణానికి వెళ్లాల్సిందే. ఊర్లో ఎవరికైనా అపెండెక్స్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకి అపెండిసైటిస్‌ వస్తే చాలా కష్టం. ఊర్లో ఉన్న ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ చేయడానికి సర్జన్‌ డాక్టర్లు, వసతులు లేవు. దీంతో పట్టణానికి హుటాహుటిన వెళ్లాల్సిందే. పైగా గ్రామంలో ఎప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది. దీంతో అన్నివేళలా ప్రజా రవాణా సాధ్యపడదు.

ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల్ని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అపెండెక్స్‌ ఆపరేషన్‌ చేయించడం వీలవదు. దీంతో వారి ప్రాణాలకు ముప్పు. అందుకే, ఊర్లో వారందరూ గతంలోనే దగ్గర్లోని పట్టణాలకు వెళ్లి అపెండెక్స్‌ తొలగించుకున్నారు. కొత్తగా ఊళ్లోని వచ్చినవాళ్లను సైతం తొలగించుకోమని నిబంధన పెట్టారు. ఈ ప్రాంతంలో కొంతకాలం ఉండిపోవడానికి తరచుగా బయటి ప్రాంతాల వాళ్లు వస్తుంటారు. వారు కచ్చితంగా అపెండెక్స్‌ ఆపరేషన్‌ చేయించుకొని రావాలని గ్రామస్థులు నిబంధన పెట్టారు. అదన్నమాట సంగతి..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని