Published : 18/11/2020 09:52 IST

యూట్యూబ్‌ ఉందిగా.. నేర్చేద్దాం పదండిక..!!


 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు ఆసక్తి ఉంటే చాలు ఏదైనా నేర్చుకోవచ్చు. క్షణాల్లో కావాల్సిన సమాచారం సంపాదించేయొచ్చు. వీడియోల రూపంలో చూసేయొచ్చు. అందుకు యూట్యూబ్‌ ఓ వేదిక. మరి యూట్యూబ్‌లో కాస్త ఆసక్తికరంగా నేర్చేయాలంటే.. వినోదంతో పాటు విజ్ఞానాన్ని సంపాదించేయాలంటే.. అందుకే ఈ ఛానళ్లు.

ఎలా పనిచేస్తుంది?
కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ అసలెలా పని చేస్తుంది? మనుషులు చనిపోయే ముందు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు అసలు పరిష్కారమే లేని రహస్యాలేంటి? నిజంగా దెయ్యాల బంగ్లాలున్నాయా? ఇలాంటి ఆసక్తికర విషయాలు వీడియోరూపంలో చూసేయాలనుందా! అసలు ప్రపంచమెలా పనిచేస్తోందో తెలుసుకోవాలనుందా?అయితే how stuff works యూట్యూబ్‌ ఛానల్‌ చూడొచ్చు. ఆసక్తికర విషయాలను అర్థమయ్యేరీతిలో వివరించడం ఈ ఛానల్‌ ప్రత్యేకత. 1998లో ఓ చిన్న వెబ్‌సైట్‌గా ఏర్పడి ప్రస్తుతం ఓ ‘అవార్డ్‌ విన్నింగ్‌ ఛానల్‌’గా అవతరించింది. ప్రపంచ వింతలు, విశేషాలు, సైన్స్, చరిత్రకి సంబంధించిన తదితర కథనాలు అందుబాటులో ఉంచారు. 

ఒకవేళ అలా జరిగితే..!
మనమందరం ఊహిస్తాం. మనకంటూ ఓ ఊహాప్రపంచాన్ని సృష్టించుకుంటాం. కానీ మీ ఊహలకు సమాధానాలు కావాలంటే? మీ ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే..! మీరెప్పుడైనా అనుకున్నారా ‘ఒకవేళ టైం మిషన్‌ ఉంటే?’.. నిద్రపోయి లేవలేకపోతే? అని.. ఇలాంటి మీ ఊహా ప్రశ్నలకి ఈ ఛానల్‌ సమాధానం చెబుతుంది. పేరు What If. ఊహా ప్రపంచంలోని వింతలను కళ్లకు కడుతుంది. లేని ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓ సాహస ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అంతేకాదు భవిష్యత్తు టెక్‌ కబుర్లు, సైన్స్‌ సంగతులు, వర్తమాన వ్యవహారాలు ఇలా అనేక విషయాలు ఆసక్తికరంగా చూసేయొచ్చు. 

ఆకట్టుకునే యానిమేషన్‌తో..
వీడియోలతో వాస్తవాలు చెప్పాలన్నా.. సరదాగా పరిహాసమాడాలన్నా.. ఆ వీడియో అందంగా, ఆకట్టుకునేలా ఉండాలి. అలా గ్రాఫిక్‌లతో ఆకట్టుకునేలా చూపడమే ఈ ఛానల్‌ ప్రత్యేకత. పేరు The Infographics Show. అసలు ఏలియన్స్‌ ఉన్నాయా? నిద్రలేకపోతే ఏమవుతుంది? వివిధ దేశాల మిలటరీ బలగాలెంత? బ్లాక్‌హోల్‌ అంటే ఏంటీ.. ఏం జరుగుతుంది..? ఇలా వర్తమాన వ్యవహారాలు, చారిత్రక ముఖ్య సంఘటనలు, చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తులు? ఆరోగ్య వాస్తవాలు, ముఖ్య స్థలాలు, నవ్వించే విషయాలు తదితర అనేక ఆసక్తికర వీడియోలు యానిమేషన్‌ రూపంలో చూడొచ్చు. 

ఆసక్తికర ప్రశ్నలతో..
2007లో వీడియో గేమ్‌ల కోసం ఏర్పడిన ఈ ఛానల్‌ ప్రస్తుతం విద్యా సంబంధిత సమాచారాన్ని మాత్రమే ఉంచుతుంది. పేరు Vsauce. ఏదైనా కొత్త అంశం నేర్చుకోవాలంటే ఆసక్తి అవసరం. అలా ఆసక్తితో వినోదభరితంగా ఉండే వీడియోలను పోస్ట్‌ చేయడం ఈ ఛానల్‌ ప్రత్యేకత. ఇందులో ప్రత్యేక విషయాలు, అంశాలపై కంటెంట్‌ ఏం ఉండదు. ప్రజాసక్తి ఉన్న ప్రతీ అంశాన్ని ఆసక్తిగా చెబుతూ వీడియోలు పోస్ట్‌ చేస్తారు. ఉదాహరణకు భూమి తిరగడం మానేస్తే ఏమవుతుంది? మన కంటి రిజల్యూషన్‌ ఎంత? 5-సెకండ్‌ రూల్‌ నిజమేనా?.. తదితర ఆసక్తికర అంశాలు వీడియోల రూపంలో చూడొచ్చు. సమాచారం తెలుసుకోవచ్చు.

నిమిషాల నిడివిలో..
సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేరీతిలో నిమిషాల నిడివితో అందుబాటులో ఉంచడం ఈ ఛానల్‌ ప్రత్యేకత. పేరు minutephysics. సౌరకుటుంబం, ఆవర్తన పట్టికను తిరిగి ఊహించడం, ప్యార్లర్‌ యూనివర్సెస్, అద్దం కేవలం ఎడమ, కుడి మాత్రమే ఏందుకు చూపుతుంది? వర్షంలో నడవడం మంచిదా? పరిగెత్తడమా? తదితర ఫిజిక్స్‌ అంశాలను సింపుల్‌గా వివరిస్తారు. దీంతోపాటు ‘మినెట్‌ ఎర్త్‌’ అనే ఛానల్‌నూ చూడొచ్చు. దీని ద్వారా ఆరోగ్యం, వాతావరణం, పర్యావరణం, ఆహారం, వ్యవసాయం, జీవశాస్ర్తం తదితర విభాగాల్లో అంశాలను తెలుసుకోవచ్చు.  

త్వరత్వరగా నేర్చేయండి
సరికొత్త విషయాలను ఆసక్తికరంగా నేర్చేందుకు ఈ ఛానల్‌ ఉపయోగపడుతుంది. పేరు crash course. ఓ విధంగా ఈ ఛానల్‌ ద్వారా మీకు నచ్చిన కోర్సులను ఉచితంగా నేర్చేయొచ్చు. వ్యాపారం, ఆర్థిక శాస్ర్తం, జీవశాస్ర్తం, కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, చరిత్ర, సాహిత్యం, పురాణాలు, తత్వశాస్ర్తం, మనస్తత్వశాస్ర్తం, భౌతికశాస్త్రం‌, గణాంకాలు.. తదితర వాటిలో వీడియోలు చూడొచ్చు. ఆకట్టుకునే డిజైన్లతో సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ వీడియోలను తీర్చిదిద్దారు.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్