Dreams-Sleep : కనులు మూస్తే కలలు.. రోజూ ఎందుకొస్తాయంటే..?

రోజూ మన ప్రమేయం లేకుండానే నిద్రలో అనేక కలలు వస్తుంటాయి. వాటి సృష్టి ఏ రకంగా జరుగుతుంది? ఎలా మనల్ని కలవరపెడతాయో తెలుసుకోండి. 

Updated : 12 Feb 2023 11:35 IST

మన నిద్రలో కలలు(dreams) ఒక భాగం. అవి మంచివి కావచ్చు.. చెడువి కావచ్చు. గుర్తు ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కలలు మనల్ని ఆనందింపజేస్తుంటాయి. కొన్నిసార్లు భయపెడుతుంటాయి. సంతోషం, శృంగారం, కలవరపెట్టడం.. ఇలా రకరకాలుగా ఉంటాయి. ‘కలలో కూడా ఊహించలేం’ అనే డైలాగ్‌లాగే ఊహించనివన్నీ కలలుగా వస్తుంటాయి. అసలు కలలు ఎందుకు వస్తున్నాయో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, మానసిక వైద్యులకు అంతుచిక్కడం లేదు. 

మనకు సాధ్యం కాని కోరికలు కలలో తీర్చుకోవడం జరుగుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. మెదడు, శరీరం నుంచి వచ్చిన సంకేతాల ద్వారా కూడా కలలు ఉద్భవిస్తాయట. రోజంతా జరిగిన వ్యవహారాలకు సంబంధం లేని అంశాలను జత చేస్తూ కలలు ఉంటాయి. భవిష్యత్‌లో జరగబోయే చెడును ఊహిస్తూ కూడా కలలు(dreams) కనడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒకే కలలో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల సంఘటనలు మిళితమవుతాయి. 

కలల గురించి కొన్ని నిజాలు

  • ప్రతి కల మనకు గుర్తులేకున్నా.. రాత్రి(night) పడుకున్న(sleep) తర్వాత 3 నుంచి 6 కలలు వస్తాయి.
  • ఒక్కో కల 5 నుంచి 20 నిమిషాలు ఉంటుంది.
  • నిద్రలేచే సరికి 95 శాతం కలలు మనం మర్చిపోతాం. 
  • కలలు కనడం వల్ల మన మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
  • కంటి చూపు ఉన్న వారి కంటే అంధులకు(Blind people) కలలు ఎక్కువగా వస్తాయి. ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల వారికి కూడా కలలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. 
  • మగవారి కంటే ఆడవారికి కలలు ఎక్కువగా వస్తాయి.

స్వప్నశాస్త్రం.. ఏం చెబుతోంది?

ఇక కలల గురించి చెప్పేందుకు ఓ శాస్త్రం కూడా ఉంది. దానినే స్వప్నశాస్త్రం అంటారు. దాని ప్రకారం.. కలలు మూడు రకాలు. అవి ‘చింతజములు’, ‘వ్యాధిజములు’, ‘యాదృచ్ఛికములు’. ఏ విషయం గురించైనా అదే పనిగా ఆలోచిస్తే అలాంటి కలలే వస్తాయి. వాటిని ‘చింతజములు’ అంటారు. మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు, వ్యాధుల బారినపడినప్పుడు కొన్ని కలలు వస్తుంటాయి. వాటిని ‘వ్యాధిజములు’ అంటారు. ఇక మనకు అసలు సంబంధం లేకుండా వచ్చేవి ‘యాదృచ్ఛికములు’. వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. కలలు మనిషి శరీరంలోని చక్రాలపై ఆధారపడి ఉంటాయని యోగశాస్త్రం సూచిస్తోంది.

నిద్రలో రెండు దశలు.. కలలకు కారణం

నిద్రలో రెండు రకాల దశలు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్(ఆర్‌ఈఎం స్లీప్‌). రెండోది నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌. నాన్‌ ర్యాపిడ్‌ ఐ మూవ్‌మెంట్‌లో వచ్చిన కలలు ఎంతమాత్రం గుర్తుండవు. ఈ దశ తరువాత వచ్చే ఆర్‌ఈఎం స్లీప్‌(rapid eye movement)లో ఎక్కువగా కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం అసాధారణంగా ఉంటుంది. మూతపడిన కళ్లు వివిధ కోణాల్లో తిరుగుతూ ఉంటాయి. గుండె(Heart) కొట్టుకునే వేగం ఎక్కువ అవుతుంది. మగవారిలో అయితే శృంగార కాంక్షలు చెలరేగుతాయి. అప్పుడు నిద్రలో నుంచి ఉన్నఫలంగా మేల్కొంటే.. వచ్చిన కల నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితి మన రోజువారీ నిద్రలో 20 నుంచి 25 శాతం ఉంటుందట. 

ఆర్‌ఈఎం స్లీప్‌ అంటే.. 

నిద్రపోయిన తరువాత దాదాపు 90 నిమిషాలకు ఇది మొదలవుతుంది. మూసిన రెప్పలోనే కనుగుడ్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి. కానీ, మెదడుకు ఎలాంటి సంకేతాలు పంపించవు. ఇలాంటి స్థితి నిద్ర పోయిన తర్వాత తొలిసారి 10 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత మళ్లీ నాన్‌ ఆర్‌ఈఎం స్లీప్‌కు వెళ్లిపోతాం. ఆ తర్వాత మళ్లీ ఆర్‌ఈఎంలోకి వస్తాం. అప్పుడు స్థితి నిడివి పెరుగుతుంది. అలా దశలు మారే కొద్దీ ఆర్‌ఈఎం నిద్ర ఉండే సమయం పెరుగుతూ ఉంటుంది. ఆర్‌ఈఎం స్లీప్‌ కారణంగా మెదడులోని కొంత భాగం ఉత్తేజితమవుతుంది. ఆ చర్య కలలో వచ్చిన వాటిని గుర్తుంచుకోవడానికి, ప్రోటీన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లలు ఎక్కువ సేపు ఆర్‌ఈఎం స్టేజీలో ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

కల గుర్తు రావాలంటే ఏం చేయాలి

బాల్యంలో 10 ఏళ్లు దాటిన తరువాత ప్రతి ఒక్కరికి రాత్రి పూట 4 నుంచి 6 కలలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. అయితే అవి అందరికీ గుర్తుండవు. కల ముగిసిన 5 నిమిషాలకే 50 శాతం దాన్ని మరచిపోతామట. ఆ తరువాత 5 నిమిషాలు గడిస్తే 90 శాతం కల గుర్తుండదట. అయితే మిగతా పదిశాతాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

  • అలారం లేకుండా నిద్ర లేవాలి.
  • ఆ వెంటనే ఎలాంటి కల వచ్చిందో దానిపై ఆలోచనల్ని కేంద్రీకరించాలి.
  • గుర్తుకు వచ్చిన మేర దాన్ని పేపర్‌పై రాయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఎలాంటి కలలు వచ్చాయో సులభంగా తెలుసుకోవచ్చు.

తెలిసి కూడా కలగంటాం..

నిత్యం జీవితం మనకు నచ్చినట్లుగా ఉండక పోవచ్చు గానీ.. కొన్ని సార్లు కలలు మనకు నచ్చినట్లుగా ఉంటాయి. వాటినే లూసిడ్‌ డ్రీమ్స్‌(Lucid dreams) అంటారు. కలలో ఇష్టమైన వారితో సంభోగం జరపడం, వైరం ఉన్న వ్యక్తులపై దాడికి పాల్పడటం వంటివన్నీ.. ఇలాంటి కలల్లోనే సాధ్యపడతాయి. కలలో వచ్చే వ్యక్తులు కూడా విచిత్రంగా ఉంటారు. ఒక సర్వే ప్రకారం.. 48 శాతం కలల్లో తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తులే వస్తుంటారట. 35 శాతం కలల్లో సమాజంలోని వివిధ రకాల వృత్తులు చేసే వ్యక్తులు కనపడుతున్నారట. దొంగలు, పోలీసులు, వ్యాపారులు ఇలా. ఎప్పుడూ చూడని విచిత్రమైన మనుషులు, జంతువులు మిగతా శాతం కలల్లో కనపడుతుంటాయని తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని