Dark web : నెట్టింట చీకటి సామ్రాజ్యం ‘డార్క్‌ వెబ్‌’.. చెలరేగిపోతున్న అక్రమార్కులు

డార్క్‌వెబ్‌ (Dark web).. రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. మంచి ప్రయోజనాల కోసం దీన్ని రూపొందించినా ప్రస్తుతం మాదకద్రవ్యాల విక్రయం (Drugs), మానవ అక్రమ రవాణా (Human trafficking), వ్యభిచారం (Prostitution) వంటి కార్యకలాపాలకు అడ్డాగా మారింది. 

Updated : 07 Jun 2023 14:53 IST

డార్క్‌వెబ్‌  (Dark web), డార్క్‌నెట్‌..  ఈ పదాలు ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. డార్క్‌వెబ్‌ (Dark Web) ఆధారంగా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ఓ భారీ నెట్‌వర్క్‌ (Drugs Trafficking Network)ను ఛేదించినట్లు తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తెలిపింది. ఈ క్రమంలోనే రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ (LSD Blots)ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

మనం రోజూ వినియోగిస్తున్న ఇంటర్నెట్‌లో డార్క్‌ వెబ్‌ ఒక భాగం. అయితే గూగుల్‌, బింగ్‌, యాహూ సఫారి వంటి సెర్చ్‌ ఇంజిన్లు ఉపయోగించి అందులోకి వెళ్లలేము. అది ప్రామాణికం కాని కమ్యూనికేషన్‌ ప్రోటోకాల్‌ ద్వారా అనుసంధానమై ఉంటుంది. వీటిలో జరిగే కార్యకలాపాల సమాచారం ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (ఐఎస్‌పీ), ప్రభుత్వ అధికారులకు అందుబాటులో ఉండవు. డార్క్‌ వెబ్‌ గురించి అర్థం చేసుకోవడానికి ఇంటర్నెట్‌ను మూడు పార్శ్వాలుగా విభజించాల్సి ఉంటుంది. 

1. సర్ఫేస్‌ వెబ్‌

ఇంటర్నెట్‌ కనెన్షన్‌ కలిగిన ప్రతి ఒక్కరూ నిత్యం వినియోగించుకుంటున్నది సర్ఫేస్‌ వెబ్‌. వికీపీడియా, ట్విటర్‌, అమెజాన్‌, యాహూ, ఫేస్‌బుక్‌, గూగుల్, మీరు చదువుతున్న ఈ కథనం సహా అందరికీ అందుబాటులో ఉన్నవి సర్ఫేస్‌ వెబ్‌ కోవలోకి వస్తాయి.

2. డీప్‌ వెబ్‌

డీప్‌ వెబ్‌లో దాదాపు 96 శాతం పాస్‌వర్డ్‌లకు సంబంధించిన విషయాలుంటాయి. అంటే మీరు ఏదైనా ఒక పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేస్తే అది డీప్‌ వెబ్‌లో ఉన్నట్లు. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటివి డీప్‌ వెబ్‌ను ఆధారం చేసుకొని పనిచేస్తాయి. ఇందులో వేలాది మంది పాస్‌వర్డ్‌ల సమాచారం దాదాపు భద్రంగా ఉంటుంది. కేవలం బ్యాంకింగ్‌ రంగం మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమ ఖాతాలు, ఈ మెయిల్స్‌, శాస్త్రీయ, విద్యా పరిశోధనల పత్రాలు వంటివన్నీ ఈ కోవకు చెందినవే. క్లుప్తంగా చెప్పాలంటే మీకు మాత్రమే తెలిసిన సమాచారాన్ని నెట్‌లో భద్రపరచుకునే చోటు డీప్‌ వెబ్‌.

3. డార్క్‌ వెబ్‌

డీప్‌ వెబ్‌లో కొంత భాగమే.. డార్క్‌ వెబ్‌. అంటే మనకు మాత్రమే తెలిసిన సమాచారం డీప్‌ వెబ్‌లో సదరు కంపెనీకి, బ్యాంక్‌కు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ, డార్క్‌ వెబ్‌ ఇంకా లోతుగా ఉంటుంది. అదో చిదంబర రహస్యం. డార్క్‌ వెబ్‌లో కంటెంట్‌ మొత్తం ఎన్‌క్రిప్ట్ చేస్తారు. దాన్ని వాడాలంటే ప్రత్యేక బ్రౌజర్లు వినియోగించాలి. ద ఆనియన్‌ రింగ్‌ (టార్‌), ఫ్రీ నెట్‌, ఇన్‌విజబుల్‌ ఇంటర్నెట్‌ ప్రాజెక్ట్‌(I2P), ద అమీజక్‌ ఇన్‌కాగ్నిటో లైవ్‌ సిస్టమ్‌ (టైల్స్‌), వోనిక్స్‌ అందుకు ఉదాహరణలు.

ఈ రహస్య బ్రౌజర్లు ఎందుకు కనిపెట్టారు?

‘టార్‌’ అనే బ్రౌజర్‌ను యునైటెడ్ స్టేట్స్‌ నావల్‌ రీసెర్చ్‌ లేబోరేటరీ ఉద్యోగులు అభివృద్ధి చేశారు. అమెరికా ఇంటెలిజెన్స్‌ ఆన్‌లైన్ కమ్యూనికేషన్లను భద్రపరచడానికి దానిని వినియోగించారు. బ్రౌజర్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ గమ్యస్థానానికి చేరుకోవడానకి ముందు ఉల్లిపాయలాగా అనేక పొరలను దాటి రావాల్సి ఉన్నందున దీనిని టార్‌ అని సంబోధించారు. టార్‌ను వైద్య పరిశోధన పత్రాలను గోప్యంగా ఉంచడానికి, నేరస్థుల కదలికలను తెలుసుకోవడానికి, సైబర్‌ భద్రతను పెంపొందించడానికి వినియోగించారు. ఇవన్నీ చట్టపరమైనవి. కొన్ని దేశాల్లో నిషేధించిన సామాజిక మాధ్యమాలను కూడా టార్‌ వాడి తెరవచ్చు. టార్‌ బ్రౌజర్‌ను వినియోగించడం నేరపూరిత చర్య కాదు. కానీ, వీటిని డౌన్‌లోడ్‌ చేసుకున్న వ్యక్తుల సమాచారం వెంటనే ప్రభుత్వ నిఘా విభాగానికి తెలిసిపోతుంది. ఆ బ్రౌజర్‌తో ఎటువంటి కార్యకలాపాలు చేస్తున్నారనే విషయాన్ని వారు ఓ కంట కనిపెడుతూ ఉంటారు. ఇటీవల డ్రగ్స్‌ దందా, చైల్డ్‌ పోర్నోగ్రఫీ, సైబర్‌ నేరాలు పెరిగిపోయాయి. అలాంటి కేసులను త్వరగా చేధించడానికి కారణం నిఘా అధికారులకు ఈ డార్క్‌ నెట్‌ వాడే వారి సమాచారం తెలియడమే.

ఎలాంటి నేరాలు జరుగుతున్నాయంటే?

డార్క్‌ వెబ్‌ను తొలినాళ్లలో గోప్యత కోసం రూపొందించినా.. తర్వాత అక్రమార్కులు దాన్ని తమకు అడ్డాగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు ఆ వెబ్‌లో మంచి కంటే చెడే ఎక్కువ కన్పిస్తోంది. 2013లో డార్క్‌నెట్‌ కేంద్రంగా డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత నుంచి మారణాయుధాలు, క్రెడిట్‌ కార్డుల డేటా, మాల్వేర్‌లు ఇలా రకరకాల రహస్య సమాచార విక్రయాలు అందులో జరిగిపోతున్నాయి. డబ్బు సంపాదన కోసం అక్రమ వ్యాపారాలు చేసే వారు మాత్రమే కాదు.. ఉగ్రవాదులు కూడా ఈ నెట్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఒకానొక దశలో నకిలీ కొవిడ్‌ వ్యాక్సిన్ల అమ్మకాలు కూడా డార్క్‌నెట్లో జరిగాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే ప్రజలను, ప్రభుత్వాలను హెచ్చరించింది.

కేసుల ఛేదనలో సవాళ్లు

డార్క్‌ వెబ్‌ కార్యకలాపాలు ఎన్‌క్రిప్షన్‌తో కూడి ఉంటాయి. దాంతో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలను ఛేదించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్లను పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లావాదేవీలు క్రిప్టో కరెన్సీ రూపంలో జరుగుతున్నాయి. దాంతో ఎంత మొత్తం చేతులు మారుతుందో తెలుసుకోలేకపోతున్నారు. బిట్‌ కాయిన్ల చేతులు మారితే నేరం జరిగిందని రుజువు చేయడానికి వాటిని ఆధారాలుగా ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. డార్క్‌ వెబ్‌లో జరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా పోరాటం చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సైబర్‌ భద్రతను పెంపొందించుకోవడానికి మిగిలిన దేశాలకు సాయం చేయాలి. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఇలాంటి నేరాల పరిశోధనకు, భద్రతా ప్రమాణాలు పెంపొందించుకోవడానికి బడ్జెట్‌లో నిధులను కేటాయించాలి. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని