Khalistan movement : ఏంటీ ఖలిస్థాన్‌ వేర్పాటువాదం.. ఎలా పురుడు పోసుకుంది?

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా పంజాబ్‌ పోలీసులు ప్రకటించారు.  అతడి కారణంగా గత కొంతకాలం నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదం మరోసారి వార్తల్లోకెక్కింది.

Updated : 19 Mar 2023 17:24 IST

‘జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే 2.0’గా పేరుతెచ్చుకొని ఖలిస్థానీ వేర్పాటు వాదాన్ని అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal singh) ఎగదోస్తున్నాడు. గతేడాది దుబాయ్‌ నుంచి ఊడిపడ్డ ఈ అమృత్‌పాల్‌ సింగ్‌ ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ పగ్గాలు చేపట్టాడు. గతంలో పంజాబ్‌(Punjab) నటుడు దీప్‌ సిద్ధూ ఈ సంస్థను స్థాపించాడు. అతడు మరణించిన తర్వాత ‘వారిస్‌ పంజాబ్‌ దే’ను అమృత్‌పాల్‌ హైజాక్‌ చేశాడు. ఇటీవల ఓ కేసులో ఇరుక్కున్న తన అనుచరుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌ తూఫాన్‌ను విడిపించుకునేందుకు పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ సాహెబ్‌ను చేతపట్టుకొని  ఏకంగా ఆజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పైనే అమృత్‌పాల్ దాడికి దిగడం దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమృత్‌పాల్ ఖలిస్థాన్‌ వేర్పాటువాదాన్ని(Khalistan movement) బలపరుస్తున్నాడని, అతడికి పాక్‌, విదేశాల నుంచి సాయం అందుతోందనే అనుమానాలున్నాయి.

ఏమిటీ ఖలిస్థాన్‌ ఉద్యమం?

సిక్కులకు స్వయం ప్రతిపత్తితో ఒక రాష్ట్రం ఉండాలనే లక్ష్యంతో ఖలిస్థాన్‌ ఉద్యమం పురుడు పోసుకుంది. భారత్‌, పాక్‌ విడిపోయినప్పటి నుంచి అది వివిధ రూపాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో బలపడుతూ వస్తోంది. 1984లో చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’తో జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే మరణించాడు. ఆ తరువాత రెండు దశల్లో ‘ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌’ చేపట్టి మిగిలిన వేర్పాటు వాదుల అణచివేత జరిగింది. అయితే ఖలిస్థాన్‌ భావజాలాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరపడిన వీరు భారత్‌ను అస్థిరపర్చేందుకు పావులు కదుపుతున్నారు. 

ఎప్పుడు మొదలైంది?

1947లో భారత్‌, పాక్‌లు వేరుపడటంతో నాటి పంజాబ్‌ సంస్థానం రెండు ముక్కలైంది. విభజన సందర్భంగా మతపరమైన హింస చెలరేగింది. వేలాది మంది శరణార్థులుగా మారారు. పశ్చిమ పాకిస్థాన్‌లోని హిందువులు, సిక్కులు భారత్‌కు బయలుదేరారు. ఇక్కడ ఉన్న ముస్లింలు పాక్‌కు వెళ్లారు. మహారాజా రంజిత్‌సింగ్‌ పాలిస్తున్న సిక్కు సామ్రాజ్య రాజధాని లాహోర్‌ పాకిస్థాన్‌లో భాగమైంది.  దాంతో సిక్కుల పవిత్ర స్థలాలైన నాన్‌కానా సాహిబ్‌ భారత్‌ చేజారింది. ఇది సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్‌ జన్మస్థలం కావడం విశేషం. చాలా మంది సిక్కులు భారతదేశంలో స్థిరపడినప్పటికీ జనాభా పరంగా వారున్నది 2 శాతం మాత్రమే. ఫలితంగా తమ స్వయం ప్రతిపత్తి కోసం రాజకీయ పోరాటం మొదలైంది. పంజాబీ మాట్లాడే వారి కోసం పంజాబీ సూబా ఉద్యమం ప్రారంభమైంది. 1955లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ నివేదిక ఆ డిమాండ్‌ను తిరస్కరించింది. చివరికి 1966లో పంజాబ్‌ పునర్వ్యవస్థీకరణ జరిగింది. పంజాబ్‌, హిమాచల్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ తీర్మానం

శిరోమణి గురుద్వారా టాస్క్‌ఫోర్స్‌గా 1920లో అకాలీదళ్‌ ఏర్పడింది. గురుద్వారాలలో సంస్కరణలు కోరుతూ ఈ పార్టీ అకాలీ ఉద్యమాన్ని నడిపింది. భారత్‌, పాక్‌లు విడిపోవడాన్ని కూడా ఈ పార్టీ నేతలు, మాస్టర్‌ తారా సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత ది పంజాబ్‌ సూబా ఉద్యమంతో అకాలీదళ్‌ బలపడింది. అవిభక్త తూర్పు పంజాబ్‌తో కలిపి పంజాబీ మాట్లాడే వారితో రాష్ట్రం ఏర్పాటు కావాలని సంత్‌ ఫతేసింగ్‌ నాయకత్వంలో డిమాండ్‌ చేశారు. పంజాబ్‌ ఏర్పడిన తరువాత ఈ పార్టీ ప్రధాన శక్తిగా అవతరించింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొంది. అయితే 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ జైత్రయాత్ర కారణంగా అకాలీదళ్‌ బలహీనపడింది. దాంతో ఆ పార్టీ ఆనంద్‌పూర్‌ సాహిబ్‌లో సమావేశమైంది. అది ‘ఖల్సా’ కేంద్రం. పంజాబ్‌కు స్వయంప్రతిపత్తి, అంతర్గత రాజ్యాంగం ఉండాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.  వాస్తవానికి భారత్‌ నుంచి విడిపోవాలనే అంశం ఈ తీర్మానంలో లేదు. కానీ, దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.   

తెరపైకి జర్నయిల్‌

పంజాబ్‌లో వేర్పాటువాదం కోరుకొన్నవారిలో జర్నయిల్‌ సింగ్‌ భింద్రన్‌ వాలే ఒకరు. జర్నయిల్‌ ఎదుగుదలలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ పాత్ర ఉందనే విమర్శలున్నాయి. క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చిన భింద్రన్‌ వాలే 1980 నాటికి ప్రభుత్వానికి ఓ పెను సవాల్‌గా మారాడు. యువతలో అతనికి విశేషమైన ఆదరణ లభించింది. అణగారిన వర్గాల ప్రజలు అతన్ని భారీగా అనుసరించారు. ఈ క్రమంలో భింద్రన్‌ అనుచరులు హింసకు తెరలేపారు. 1982లో భింద్రన్‌ ‘ధరమ్‌ యుద్ధ మోర్చా’ పేరిట శాసనోల్లంఘన ఉద్యమం మొదలుపెట్టాడు. దీనికి అకాలీదల్‌ నాయకత్వం కూడా సహకరించింది. స్వర్ణ దేవాలయంలోని పవిత్రమైన  అకాల్‌తక్త్‌ను తన స్థావరంగా మార్చుకొన్నాడు. ఇక్కడి నుంచే తన అనుచరులను పోలీసులపై దాడులకు పంపేవాడు. 1984 నాటికి పంజాబ్‌లో పరిస్థితి చేజారిపోయినట్లుగా కన్పించ సాగింది. భింద్రన్‌వాలే రెచ్చగొట్టడంతో హిందువులు, ప్రభుత్వ అధికారులపై దాడులు పెరిగిపోయాయి. దేవాలయం వద్ద డీఐజీ స్థాయి పోలీసు అధికారిని కాల్చి చంపారు. ఆయన మృతదేహం గంటల కొద్దీ  అక్కడే పడిఉన్నా.. స్థానిక పోలీస్‌లు ఏమీ చేయలేకపోయారు.

ఆపరేషన్‌ బ్లూస్టార్‌

భింద్రన్‌వాలేను ఎలాగైనా అణచివేయాలని ఇందిరాగాంధీ మిలటరీతో సంప్రదింపులు జరిపింది. దాంతో సైన్యం స్వర్ణ దేవాలయంలోకి అడుగుపెట్టింది. ముందే సిద్ధంగా ఉన్న భింద్రన్‌ వాలే వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దాంతో సైన్యం మరింత దూకుడుగా ముందుకు వెళ్లడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయంలో ఇలాంటి చర్య జరగడం ఆ వర్గం జీర్ణించుకోలేకపోయింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 83 మంది సైనికులు మరణించారు. 249 మంది గాయపడ్డారు. 493 మంది వేర్పాటువాదులు, పౌరులు మరణించారు. వాస్తవానికి ఈ అంకె ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెబుతుంటారు.

బ్లూస్టార్‌ తరువాత ఏమైంది?

భింద్రన్‌ వాలే మరణంతో సమస్య ముగిసినట్లే కనిపించినా స్వర్ణ దేవాలయంలో ఘటన జరగడం సిక్కులను తీవ్రంగా కలచివేసింది. దాంతో ఖలిస్థాన్‌ వేర్పాటు వాదం మరింతగా బలపడింది. 1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీని ఇద్దరు సిక్కు బాడీగార్డులు హత్యచేశారు. ఫలితంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ గొడవల్లో వేల మంది సిక్కులు మరణించారు. భింద్రన్‌ మరణానికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఎయిర్‌ ఇండియా విమానాన్ని పేల్చివేశారు. దాంతో 329 మంది మరణించారు.

బ్లాక్‌ థండర్‌ ఆపరేషన్స్‌

భింద్రన్‌ వాలే మరణించిన తరువాత కూడా వేర్పాటు వాదులు స్వర్ణ దేవాలయాన్ని వీడలేదు. దాంతో 1986 ఏప్రిల్ 30న ఆపరేషన్‌ బ్లాక్ థండర్‌-1 చేపట్టి 200 మందిని బంధించారు. డీజీపీ కన్వర్‌పాల్‌ సింగ్‌ ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. 300 మంది ఎన్‌ఎస్‌జీ, 700 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఇందులో పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌కు నాటి అకాలీదళ్‌ నేత, ముఖ్యమంత్రి సుర్జిత్‌ సింగ్‌ బర్నాలా ఆమోదం తెలిపారు. మితవాద సిక్కు నాయకులు కూడా ఈ పోలీసు చర్యను సమర్థించారు. 

మళ్లీ 1988లో ఆపరేషన్‌ బ్లాక్ థండర్‌-2 చోటు చేసుకుంది. ఈ సారి కూడా దాదాపు 200 మంది వేర్పాటువాదులు పట్టుబడ్డారు. 46 మందిని హతమార్చారు. ప్రజల సహకారం తోడు కావడంతో ఈ ఆపరేషన్ సునాయసంగా ముగిసింది.

మూగబోయిన ఖలిస్థాన్‌ గొంతులు

బ్లాక్‌ థండర్‌ ఆపరేషన్‌ తరువాత వేర్పాటు వాదం తగ్గిపోయింది. భారత్‌లో అశాంతి రగిలించేందుకు పాక్‌ ఖలిస్థాన్‌ ఉద్యమానికి సహకారం అందిస్తూనే ఉన్నప్పటికీ జనాభాలో చాలా మంది హింసను వ్యతిరేకించడంతో ఉద్యమం క్రమంగా బలహీనపడింది. ఆర్థిక సంస్కరణల దిశగా దేశం పయనించడంతో ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల గొంతులు పూర్తిగా మూగబోయాయి. అందువల్ల పంజాబ్‌లో చాలా కాలంగా ప్రశాంత వాతావరణం ఉంది. విదేశీ శక్తులు మాత్రం అప్పుడప్పుడు వేర్పాటువాద ఉద్యమాన్ని వివిధ రూపాల్లో బలపర్చేందుకు యత్నిస్తున్నారు. తాజాగా అమృత్‌పాల్‌ సింగ్ రాకతో మళ్లీ మునుపటి వాతావరణం ప్రతిబింబించేలా ఉందని శాంతికాముకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని