Kongunadu Issue: కొంగునాడు అంటే.. జోరుగా సాగుతున్న చర్చలు..

తమిళనాడులో పశ్చిమప్రాంతాలు అంటే పశ్చిమకనుమలను ఆనుకొని ఉన్న ప్రాంతాలను కొంగునాడు అని పిలుస్తారు. వాస్తవానికి దక్షిణాదిలో అనేకప్రాంతాల్లో నాడు అనేది వ్యవహారికం. 

Updated : 23 Jul 2021 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : తమిళనాడులో పశ్చిమప్రాంతాలు అంటే పశ్చిమకనుమలను ఆనుకొని ఉన్న ప్రాంతాలను కొంగునాడు అని పిలుస్తారు. వాస్తవానికి దక్షిణాదిలో అనేకప్రాంతాల్లో నాడు అనేది వ్యవహారికం.  ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని నాడుగా పిలుస్తారు.  ఆంధ్రప్రదేశ్‌లో కూడా పల్నాడు, రేనాడు, పాకనాడు అనే పేర్లతో ప్రాంతాలున్నాయి.  ఇక ముఖ్యమైన విషయానికి వస్తే తమిళనాడుకు చెందిన భాజపా నేత, రాజ్యసభ సభ్యుడు మురుగన్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటు లభించింది.  మురుగన్‌ తమిళనాడులోని కొంగునాడు ప్రాంతానికి చెందినవారుగా భాజపా పేర్కొనడంతో వివాదం ఏర్పడింది. తమిళనాడులోని పశ్చిమప్రాంతాలైన   నీల్‌గిరీస్‌, కొయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌, కరూర్‌, నమక్కల్‌. సేలం..తదితర జిల్లాలు కొంగునాడు  అని పేర్కొంటారు.

పారిశ్రామికంగా అభివృద్ధి.,

ఈ జిల్లాల్లో నమక్కల్‌, సేలం, తిరుప్పూర్‌, కొయంబత్తూర్‌ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి.  అన్నాడీఎంకేకు ఈ ప్రాంతంలో బాగా పట్టుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ద్వారా భాజపా నాలుగు స్థానాల్లో గెలుపొందింది. వీటిలో రెండు కొంగునాడులో ఉన్నాయి. అయితే  రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాదాపు సగభాగం ఈ ప్రాంతంనుంచే వస్తున్నా అభివృద్ధి లేదని కొందరి వాదన. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని ఎవరూ ఉద్యమాలు చేయలేదు. అయినా ద్రవిడ పార్టీలను దెబ్బతీసేందుకు భాజపా వ్యూహమని మరి కొందరు పేర్కొంటున్నారు.

డీఎంకేను నిలువరించేందుకు..

క్షేత్రస్థాయిలో భాజపాకు రాష్ట్రంలో పెద్ద బలంలేదు. డీఎంకే కేంద్రప్రభుత్వాన్ని ఒండ్రియ అరసు అని పిలుస్తోంది. అంటే యూనియన్‌ గవర్న్‌మెంట్‌ అని. వాస్తవానికి మదియ అరసు అని పిలవాలి. ఇలాంటి డీఎంకే దూకుడును అడ్డుకునేందుకు భాజపా ఇలాంటి వ్యూహాన్ని ఎన్నుకుందని కొందరు రాజకీయ పరిశీలకులు వెల్లడించారు.

జోరుగా చర్చలు..

తమిళనాడు రాష్ట్రంలో సుదీర్ఘకాలం అనంతరం కొంగునాడు అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కొంగు అంటే అమృతం లేదా తేనె అని తమిళ మేథావులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో తేనె ఎక్కువగా లభిస్తుంది. దీంతో అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది.  తమిళనాడును ఎవరూ విడదీయలేరు అని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. ఇది సోషల్‌ మీడియాలో చర్చలో ఉందని నిజానికి ఈ ప్రాంత ప్రజల్లో ఎలాంటి వేర్పాటువాదం లేదని రాష్ట్ర భాజపా సీనియర్‌ నేతలు ప్రకటించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌, ఏఎంఎంకే .. తదితర పక్షాలు మాత్రం కొంగునాడు వాదాన్ని సమర్థించకూడదని నిర్ణయించాయి. ఈ చర్చను మొదలుపెట్టంది భాజపా కాబట్టి వారే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని