Maldives : పర్యాటకుల మది దోచే మాల్దీవులు.. బుల్లి దేశం విశేషాలెన్నో!

హిందూ మహా సముద్రంలోని అతి చిన్న పర్యాటక దేశం మాల్దీవుల్లో (Maldives) ఎంతో వైవిధ్యం దాగుంది. ఆ దేశానికి సంబంధించిన వింతలు, విడ్డూరాల గురించి తెలుసుకోండి.  

Updated : 11 Jan 2024 14:11 IST

మాల్దీవులు (Maldives).. హిందూ మహా సముద్రంలోని చిన్న దేశం. భారత్‌ (India), శ్రీలంకకు (Sri lanka) అత్యంత సమీపంలోని ఈ దేశ అందాలను తిలకించడానికి అన్ని కాలాల్లోనూ పర్యాటకులు పోటెత్తుతుంటారు. చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు.. ఓ మనిషి తన జీవితాన్ని సరదాగా గడపడానికి ఇంతకంటే అందమైన ప్రాంతం మరొకటి ఉండదేమో..! అందుకే.. ఇటీవలి కాలంలో మన పాన్‌ ఇండియా తారలు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పోస్ట్‌ చేస్తున్నారు. అంత మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లను ఆకర్షిస్తున్న ఆ దేశ విశేషాలేంటో తెలుసుకోండి.

  • మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇక్కడి పగడపు దిబ్బలు. ఈ దేశంలో 26 పగడపు అటోల్స్‌, 1200 దీవులున్నాయి.
  • ఈ దేశ రాజధాని మాలే. ఇదే అతి పెద్ద నగరం కాబట్టి ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. రంగురంగుల భవనాలు, రద్దీ మార్కెట్లు, చారిత్రక మసీదులను పర్యాటకులు ఇక్కడ చూడొచ్చు.
  • సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల వాతావరణ మార్పుల ప్రభావం ఈ దేశంపై అధికంగా ఉంటుంది. పెరుగుతున్న సముద్ర నీటి మట్టం కారణంగా భవిష్యత్తులో ఇక్కడ కొన్ని దీవులు కనిపించకపోవచ్చు.

  • ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్టులున్నాయి. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్‌ కోసం, సెలబ్రిటీలు, ట్రావెలర్స్‌ క్యూ కడుతుంటారు.
  • మాల్దీవుల్లో అధికారిక భాష ‘ధివేహి’. ఇది పొరుగునున్న శ్రీలంక భాష సింహళకు కాస్త దగ్గరగా ఉంటుంది. పర్యాటకుల రాక వల్ల ఇంగ్లిష్‌ మాట్లాడే స్థానికుల సంఖ్య కూడా పెరిగింది.
  • మాల్దీవుల జనాభా దాదాపు 5.6 లక్షలు. భారత్‌, శ్రీలంక, అరబ్‌ దేశాల సంస్కృతి, సంప్రదాయాలను స్థానికులు అనుసరిస్తుంటారు. 
  • సముద్ర జీవ వైవిధ్యానికి నెలవైన ఈ ప్రాంతంలో దాదాపు 2వేల రకాల చేపలు, 200 జాతుల పగడపు దీవులను చూడొచ్చు. మెరైన్‌ జీవ శాస్త్రవేత్తలు, డైవర్స్‌, సర్ఫర్లు అందుకే ఎక్కువగా ఈ దేశం వెళ్తుంటారు.
  • ప్రపంచంలోనే మొట్టమొదటి సారి నీటి అడుగున నిర్మించిన హోటల్‌ ‘కాన్రాడ్ మాల్దీవ్స్‌ రంగాలీ ఐలాండ్’ ఈ దేశంలోనే ఉంది. . 16 అడుగుల లోతులో, రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ హోటల్లో బస చేసి అతిథులు కడలి అందాలను చూసి మైమరచిపోవచ్చు.
  • మాల్దీవుల సంప్రదాయ వంటకాలను చేపలు, కొబ్బరి, బియ్యం, పండ్లను వినియోగించి తయారు చేస్తారు. ‘మాస్‌ హుని’, ‘గరుధియా’, ‘హెధికా’ ప్రఖ్యాత రుచులు.
  • పర్యాటక దేశం కదా అని బహిరంగ ప్రదేశాల్లో ఆల్కహాల్‌ తాగేందుకు అనుమతిస్తారనుకుంటే పొరపడినట్లే. రిసార్టులు, పర్యాటక సంస్థలు మాత్రమే ఇక్కడ మద్యం సరఫరా చేస్తాయి. 
  • ఈ చిన్న దేశంలో అక్షరాస్యత 98 శాతంగా ఉంది. దాన్ని బట్టి పాలకులు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
  • మన ఇండియాలో క్రికెటర్‌ ధోనీ ఎంత ఫేమస్సో.. మాల్దీవుల్లో ‘ధోనీస్’ అంత ఫేమస్‌. ‘ధోనీస్’ అంటే సంప్రదాయ పడవ. చేపల వేట, ఒక ద్వీపం నుంచి మరొక ద్వీపానికి పర్యాటకుల రాకపోకలు వీటిలోనే సాగుతాయి. 
  • ప్రత్యేక సందర్భాల్లో ఈ దేశ స్త్రీ, పురుషులు ‘ధివేహి లిబ్బాస్‌’ వస్త్రాలను ధరిస్తారు. అవి పైజామా, లుంగీ ఆకారంలో ఉంటాయి.
  • ఈ దేశంలోని ‘బోడు బెరు’ పేరుతో డ్రమ్స్‌ వాయిస్తూ, నృత్యం చేస్తూ, పాటలు పాడుతారు.
  • ఇక్కడి ప్రజలు పడవలు నిర్మించడంలో నేర్పరులు. అనేక తరాలుగా వారు ‘ధోనీస్‌’ తరహాలో విభిన్న రకాల పడవలను తయారు చేశారు.
  • ఈ దీవుల్లో నీటి అడుగున గుహలున్నాయి. రంగురంగుల చేపలను చూస్తూ వాటిలో ఈత కొడితే డైవర్లు తమ జీవితంలో ఆ అనుభూతిని మర్చిపోలేరు. 
  • మాల్దీవుల కరెన్సీ ‘రూఫియా’. అమెరికన్‌ డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీతో కూడా ఇక్కడ లావాదేవీలు జరుగుతుంటాయి.
  • ఈ ప్రాంతంలోని రైతులు సముద్రంలోని పాచిని సాగు చేస్తారు. దాన్ని ఆహారంగానూ తీసుకుంటారు. అందులో విటమిట్‌ ఎ, సి, ఈ పుష్కలంగా ఉంటాయట.
  • మాల్దీవుల్లో దొరికే కొబ్బరి బొండాన్ని ‘కురుంబ’ అని పిలుస్తారు. ఎక్కడికెళ్లినా ఇవి దొరుకుతాయి. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని