Bhindranwale: సాఫ్ట్‌గానే ఉండేవాడు.. మరీ అంత ఉగ్రంగా ఎలా మారాడు?

పంజాబ్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఘటనలను గుర్తు చేస్తున్నాయి. భింద్రన్‌వాలే నేతృత్వంలో వేర్పాటువాదులు అనేక సవాళ్లు విసిరారు.

Published : 02 Mar 2023 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: 80ల్లో పంజాబ్‌.. అంతా భయంభయంగా ఉండేది.. ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు.. తుపాకుల బుల్లెట్లు ఎక్కడ నుంచి వస్తాయో అంతుబట్టదు.. లా అండ్‌ ఆర్డర్‌ ఉండేది కాదు.. మోటార్‌ సైకిళ్లపై యువత ఆయుధాలు చేతబట్టి విచ్చలవిడిగా తిరిగేవారు.. ఖలిస్థాన్‌ మద్దతుదారులు బాహటంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవారు.. వీరి ధైర్యానికి కారణం ఒక్కరే కావడం గమనార్హం... ఆయనే జర్నైల్ సింగ్‌ భింద్రన్‌వాలే (Jarnail Singh Bhindranwale). తొలినాళ్లలో సాఫ్ట్‌గా ఉన్న భింద్రన్‌ కరడుగట్టిన వేర్పాటువాదిగా మారడం గమనార్హం.

ఆధ్యాత్మిక సంస్థ నుంచి అడుగులు

1947లో మోగా జిల్లాలో ఆయన జన్మించారు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆరో తరగతిలోనే చదువు ముగించి పొలంబాట పట్టాడు. అనంతరం కొన్నాళ్లకు  ఆధ్యాత్మిక విద్యాసంస్థలో చేర్పించారు. తరువాత మత పెద్దగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటించారు. అప్పట్లో పంజాబ్‌లో నిరుద్యోగం ఎక్కువగా ఉండేది. దీంతో ఎక్కువమంది ఆయన ప్రసంగాలకు ప్రభావితమయ్యేవారు.

కాంగ్రెస్‌ అండతో..

రాష్ట్రంలో కాంగ్రెస్‌, అకాలీలు మాత్రమే ప్రధాన పక్షాలుగా ఉండేవి. అకాలీదళ్ పార్టీని నివారించేందుకు కాంగ్రెస్‌ భింద్రన్‌ను ప్రోత్సాహించింది. అందివచ్చిన అవకాశాలను అందుకొని తిరుగులేని నేతగా ఎదిగాడు. అయితే, తొలినాళ్లలో  ఖలిస్థాన్‌ ఉద్యమానికి దన్నుగా నిలవలేదు. ఆనందపుర్‌ సాహిబ్‌ తీర్మానాన్ని అమలు చేయాలని మాత్రమే కోరేవాడు. పంజాబ్‌కు సంబంధించి పలు డిమాండ్లు ఈ తీర్మానంలో ఉన్నాయి.

అమృత్‌సర్‌ కేంద్రంగా..

ఈ  క్రమంలో ఆయన అనుచరులకు మాజీ సైనికాధికారులైన సాహెబ్‌సింగ్‌ ... తదితరులు ఆయుధాల శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నిఘా పెరగడంతో ఆయుధాలతో పాటు భింద్రన్‌వాలే స్వర్ణదేవాలయానికి చేరుకున్నాడు.  స్వాతంత్య్రం వచ్చే నాటికి  ఖలిస్థాన్‌ డిమాండ్‌ ఉన్నా అకాలీనేత మాస్టర్‌ తారాసింగ్‌, ఇతర సంస్థనాధీశులైన  సర్దార్‌ బల్‌దేవ్‌సింగ్‌, రాజా హరిందర్‌ సింగ్‌, సర్దార్‌ హుకుంసింగ్‌లు భారత్‌ వైపే మొగ్గు చూపారు.

ఆపరేషన్‌ బ్లూస్టార్‌తో హతం

అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో వేర్పాటువాదులతో మకాం వేసిన భింద్రన్‌వాలేను జనజీవన స్రవంతిలో  కలిసిపోవాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సారథ్యంలోని ప్రభుత్వం కోరింది. అయితే, ఈ వినతిని భింద్రన్‌ పట్టించుకోలేదు. చివరకు 1984 జూన్‌లో ఆపరేషన్‌ బ్లూస్టార్‌తో సైనికచర్య ప్రారంభించింది. ఏడు రోజుల పాటు సాగిన పోరులో భింద్రన్‌వాలే చనిపోవడంతో పోరు ముగిసింది. తరువాత కొద్ది కాలానికే ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులు కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లింది. ఐపీఎస్‌ అధికారి గిల్‌ కఠిన చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాదం రూపుమాసింది. అయితే  స్వతంత్ర్య భారత చరిత్రలో ఈ వేర్పాటువాద ఘటనలు ఎందరో అమాయకుల ప్రాణాలను తీసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని