Cbi director : ఎవరీ ప్రవీణ్‌ సూద్‌.. ఏఎస్పీ స్థాయి నుంచి సీబీఐ డైరెక్టర్‌ వరకు ప్రస్థానమిదీ!

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరొందిన సీబీఐ (CBI) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ (praveen sood) ఎంపికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్థానమిది..

Published : 16 May 2023 13:15 IST

1986 బ్యాచ్‌ కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్‌ (praveen sood) సీబీఐ (CBI) నూతన డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రధాని (Prime minister) నేతృత్వంలోని హై పవర్డ్‌ సెలక్షన్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయన రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌ పదవీ కాలం మే 25తో ముగియనుంది. ఆయన తరువాత సీనియారిటీ ప్రవీణ్‌కు ఉంది. అయితే, కర్ణాటక ఎన్నికల్లో ఆయన భాజపాకు (BJP) అనుకూలంగా పని చేశారని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌  (Dk Shiva kumar) గతంలో తీవ్ర విమర్శలు చేశారు. అధిష్ఠానం ఓకే అంటే తానే సీఎం అవుతానని డీకే భావిస్తున్న నేపథ్యంలో సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ ఎంపిక జరగడం గమనార్హం.

ఎవరీ ప్రవీణ్‌ సూద్‌?

ప్రవీణ్‌ సూద్‌ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా పని చేస్తున్నారు. ఆయన ఐఐటీ దిల్లీ, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి. 1989లో మైసూరులో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తరువాత బళ్లారి, రాయచూర్‌లో ఎస్పీగా పనిచేశారు. అనంతరం బెంగళూరు నగర లా అండ్ ఆర్డర్‌ డీసీపీగా పదోన్నతి పొందారు. 1999లో డిప్యుటేషన్‌పై ఫారెన్‌ సర్వీసుకు వెళ్లారు. మారిషస్‌ ప్రభుత్వానికి పోలీస్‌ సలహాదారుగా మూడేళ్లు పని చేశారు. తరువాత కొన్నాళ్లు సెలవులో ఉండి న్యూయార్క్‌లోని సిరక్యూస్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం మైసూరు నగర సీపీగా, బెంగళూరు ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

పదవులతో పాటు పతకాలు

ఆయనకు కెరీర్‌లో ప్రమోషన్లతోపాటు పలు పతకాలు దక్కాయి. 1996లో ముఖ్యమంత్రి బంగారు పతకం వచ్చింది. 2002లో మారిషస్‌ సేవలకు గానూ పోలీస్‌ మెడల్ వరించింది. 2011లో రాష్ట్రపతి పోలీసు పతకానికి ఎంపికయ్యారు. తరువాతి కాలంలో కర్ణాటక స్టేట్ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా, హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా సేవలందించారు. అనంతరం బెంగళూరు నగర సీపీ, సీఐడీ డీజీ వంటి పదవులు నిర్వహించారు. సీఎంగా సిద్ధరామయ్య కొనసాగుతున్న సమయంలో ఒకసారి అకస్మాత్తుగా ఆయన బదిలీ జరిగింది.

డీకే శివకుమార్‌కు గిట్టని అధికారి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కార్యకర్తలపై పలు కేసులు నమోదయ్యాయి. అందులో సీఎం బసవరాజ బొమ్మైను ‘పేసీఎం’ అంటూ కించపరిచినందుకు నమోదు చేసిన కేసులు కూడా ఉన్నాయి. దీనిపై స్పందించిన కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌.. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలను మాత్రమే లక్ష్యంగా చేసుకొన్నారని ఆరోపించారు. భాజపా కేడర్‌ ఏం చేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతకుముందు మార్చి నెలలో భాజపా నాయకులు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఊరి గౌడ, నంజే గౌడల ఆర్చ్‌ ఏర్పాటు చేయడానికి యత్నించారు. టిప్పు సుల్తాన్‌ను వీరిద్దరూ చంపారని కీర్తిస్తూ ఈ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. ఆ విషయంలో కేవలం కాంగ్రెస్‌ నేతలపై మాత్రమే కేసులు పెట్టడాన్ని శివకుమార్‌ తప్పుపట్టారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయనను విధుల నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశారు. డీజీపీ ప్రవీణ్‌ను ‘భాజపా ఏజెంట్’ అని తీవ్ర పదజాలంతో విమర్శించారు.

నియామకం ఎలా జరిగిందంటే..!

సీబీఐ డైరెక్టరును ఎంపిక చేసే అధికారం ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన ప్యానల్‌కు ఉంటుంది. ప్రవీణ్‌ సూద్‌ నియామకాన్ని ప్రధాని నరేంద్రమోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్‌ సమర్థించగా లోక్‌సభలో ప్రతిపక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి వ్యతిరేకించినట్లు సమాచారం. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళా అధికారులను ఆ పోస్టుకు ఎంపిక చేయాలని ఆయన కోరారు. అయినప్పటికీ ప్రవీణ్‌ సూద్ నియామకం జరిగిపోయింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని