Phone apps : యాప్‌లు మొరాయిస్తున్నాయా.. ఇలా చేసి చూడండి!

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో (Android phone) కొన్ని యాప్‌లు (apps) సరిగా పనిచేయడం లేదనే ఫిర్యాదులు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ సమస్యను సొంతంగా ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోండి.

Updated : 22 May 2023 12:31 IST

సాంకేతిక పరిజ్ఞానం (Technology) పెరిగే కొద్దీ వేలాది యాప్‌లు (apps)ప్లే స్టోర్‌లలో (Play store) ప్రత్యక్షమవుతున్నాయి. విద్య, ఆరోగ్యం, వార్తలు, వినోదం ఇలా ప్రతి అంశానికి సంబంధించిన యాప్‌ల వాడకంతో ఫోన్లు నిండిపోతున్నాయి. అయితే అందులో కొన్ని ఉన్నట్టుండి మొరాయిస్తుంటాయి. లాగిన్‌ (Login) కాకపోవడం, మధ్యలోనే క్విట్‌ కావడం, చెక్‌ యువర్‌ ఇంటర్నెట్‌ (Internet) కనెక్షన్‌ వంటి సందేశాలు చూపిస్తూ సతాయిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలుసుకోండి. 

యాప్‌లు ఎందుకు పని చేయవు?

మొబైల్‌ యాప్‌లు పని చేయకపోవడానికి అనేక కారణాలుంటాయి. సమయానుకూలంగా అప్‌డేట్ చేయకపోవడం సమస్యకు ఓ ప్రధాన కారణం. కొత్త ఫీచర్లు తెచ్చిన సందర్భంలో యాప్‌ డెవలపర్లు అప్‌డేట్‌ ఇస్తుంటారు. యూజర్లు గుర్తించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి, భద్రతా ప్రమాణాలు మెరుగు పరచడానికి సైతం అప్‌డేట్స్‌ తప్పనిసరి. అలా చేసిన సందర్భంలో పాత వెర్షన్‌ యాప్‌లు ఫోన్‌లో సరిగా పనిచేయవు.

మరిన్ని కారణాలు ఏమిటంటే..! 

  • సరైన సమయంలో అప్‌డేట్ చేయకపోవడం
  • ఫోన్‌లో స్టోరేజీ తక్కువగా ఉండటం.
  • కరప్టడ్‌ క్యాచీ, యాప్‌ డేటా
  • యాప్‌లోని బగ్స్‌, గ్లిచెస్‌
  • తాత్కాలిక ఎర్రర్స్‌
  • అవుట్‌డేటెడ్‌ యాప్‌ లేదా ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌


ఎలా సరిదిద్దుకోవాలి

యాప్‌ పని చేయలేదని తెలియగానే చిరాకు పడి కొంతమంది ప్లేస్టోర్‌లో రివ్యూలు రాసేస్తుంటారు. అంతకుముందే ఈ టిప్స్‌ ఒక్కొక్కటిగా ప్రయత్నించి చూస్తే ఉపయోగం ఉంటుంది. 

1. ఫోన్‌ రీబూట్‌

ఏ సాంకేతిక పరికరం పని చేయకపోయినా అందరూ చేసే మొదటి పని రీబూట్‌. ఫోన్‌ యాప్‌ పని చేయని పక్షంలోనూ ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుంది. పవర్‌ బటన్‌ను కొన్ని సెకన్లపాటు నొక్కితే ఆఫ్‌ ఆప్షన్‌తోపాటు రీబూట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే ఫోన్‌ ఆఫ్‌ అయ్యి ఓ 20 సెక్లన్లలోపు మళ్లీ ఆన్‌ అవుతుంది. ఈ సమయంలో మొబైల్‌ తనకు తానుగా కొన్ని ప్రాథమిక రిపేర్లు చేసుకుంటుంది. అందులో యాప్‌ల తాలుకా సమస్య ఉన్నా పరిష్కారమవుతుంది.

2. యాప్‌ అప్‌ డేట్‌

బ్యాంకులకు సంబంధించిన యాప్‌లు భద్రతా కారణాల రీత్యా తరచూ అప్‌ డేట్‌ చేస్తుంటారు. ఇలాంటి వాటిని మనం కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆ యాప్‌ పేరుతో సెర్చ్‌ చేస్తే యాప్‌ సమాచారం ప్రత్యక్షమవుతుంది. ‘అప్‌డేట్‌’ ఆప్షన్‌ చూపిస్తుంటే దానిపై క్లిక్‌ చేయాలి. అన్ని యాప్‌లు అప్‌డేట్‌ కావాలంటే ‘అప్‌డేట్‌ ఆల్‌’పై క్లిక్‌ చేయాలి. అయితే ఆ పని చేసే ముందు సరిపడే డేటా మీ వద్ద ఉందో లేదో చెక్‌ చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.

3. ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ వెబ్‌ వ్యూ యాప్‌

2021 మార్చిలో గూగుల్, ఇతర యాప్‌లు పనిచేయడం లేదని చాలా మంది ఆండ్రాయిడ్‌ యూజర్లు ఫిర్యాదు చేశారు. సమస్య ఏంటని ఆరా తీస్తే క్రోమ్‌, ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ వెబ్‌ వ్యూ యాప్‌లోని అప్‌డేట్ కారణమని తేలింది. యాప్‌లు సరిగా పని చేయని సందర్భంలో ‘ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ వెబ్‌ వ్యూ’ యాప్‌ను చెక్‌ చేయాలి. ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఈ పేరుతో సెర్చ్‌ చేస్తే ఆ యాప్‌ కనిపిస్తుంది. అక్కడ ‘అప్‌డేట్’ ఆప్షన్‌ కనిపిస్తే దానిపై నొక్కి తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అనంతరం మరోసారి ఫోన్‌ రీస్టార్ట్‌ చేసి చూడాలి. ఇప్పుడు కూడా మనకు కావాల్సిన యాప్‌ పనిచేయనట్లయితే ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ వెబ్‌ వ్యూ యాప్‌ను రోల్‌ బ్యాక్‌ చేయాలి.

ఈ యాప్‌ను రోల్‌ బ్యాక్‌ చేసేందుకు ‘సెట్టింగ్స్‌’లోని ‘యాప్స్‌ & నోటిఫికేషన్స్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులోని ‘ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌ వెబ్‌ వ్యూ’ యాప్‌పై క్లిక్‌ చేస్తే ఆ యాప్‌నకు సంబంధించిన సమాచారం కన్పిస్తుంది. ‘అన్‌ ఇన్‌స్టాల్ అప్‌డేట్స్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మళ్లీ పాత వెర్షన్‌ వస్తుంది. ఇప్పుడు మరోసారి ఫోన్‌ను రీస్టార్ట్‌ చేయాల్సి ఉంటుంది.

4. చెక్‌ అండ్‌ ఇన్‌స్టాల్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌

ఫోన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ గురించి ‘సిస్టమ్‌ అప్‌డేట్స్‌ అవైలబుల్’ అనే నోటిఫికేషన్లు కొన్నిసార్లు మన ఫోన్‌లో కన్పిస్తుంటాయి. పనిలో పడి వాటిని పట్టించుకోము. అయితే ఈ అప్‌డేట్స్‌ డివైజ్‌లో ఏర్పడే బగ్స్‌, గ్లిచెస్‌ను సరిదిద్దడానికి కూడా ఉపయోగపడుతాయి. దాంతో యాప్‌లు ఈజీగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను అప్‌డేట్‌ చేసుకోవడానికి ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్లాలి. సిస్టమ్‌➡సిస్టమ్‌ అప్‌డేట్స్‌➡ ఆన్‌లైన్‌ అప్‌డేట్స్‌లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కనిపిస్తే చేసుకోవాలి. లేని పక్షంలో ఇదే లేటెస్ట్‌ వెర్షన్‌ అని అక్కడ చూపిస్తుంది.

5. క్లియర్‌ ది క్యాచీ డేటా 

కొన్నిసార్లు యాప్‌లో పోగుపడిన క్యాచీ దాన్ని పనిచేయకుండా చేస్తుంది. తొలగించేందుకు యాప్‌పై నొక్కి పట్టుకుంటే ‘యాప్‌ ఇన్‌ ఫో’ కన్పిస్తుంది. అందులోకి వెళితే యాప్‌ సమాచారం మొత్తం కన్పిస్తుంది. ‘ఫోర్స్‌ స్టాప్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ‘స్టోరేజ్‌ యూసేజ్‌’లోకి వెళ్లి ‘క్లియర్‌ క్యాచీ’పై క్లిక్‌ చేయాలి. తరువాత యాప్‌ను అన్‌ ఇన్‌స్టాల్‌ చేసి మరోసారి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తరువాత ఫోన్‌ రీబూట్‌ చేసి యాప్‌ సరిగా పని చేస్తుందో లేదో చెక్‌ చేసుకోవాలి.

6. రీసెట్‌ యువర్‌ డివైజ్‌

పైన చెప్పిన చిట్కాలేవీ ఫలించని పక్షంలో ఫోన్‌ మొత్తాన్ని రీసెట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఫోన్‌లోని డేటా మొత్తం తొలగిపోతుంది. అందుకే ముఖ్యమైన సమాచారం మొత్తాన్ని ఒక పెన్‌డ్రైవ్‌ లేదా సిస్టమ్‌లోకి బ్యాకప్‌ చేసుకోవాలి. తరువాత ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్లి ‘రీసెట్‌ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’పై క్లిక్‌ చేయాలి. అక్కడ ‘ఎరేజ్‌ అల్‌ డేటా’ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయగానే ఫోన్‌లోని సమాచారం మొత్తం తొలగిపోతుంది. తరువాత అవసరమైన యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరిపోతుంది. 

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని