Air traffic : గగనతలంలో లక్ష్మణ రేఖలెన్నో..!

ప్రపంచవ్యాప్తంగా (World) రోజుకు దాదాపు లక్ష విమానాలు (Flight) గాల్లో ఎగురుతున్నాయి. గగనతలం (Sky)లో అంత రద్దీ ఉన్నా అవి ఢీకొంటున్న ఘటనలు అరుదు. అందుకు కారణాలు తెలుసుకోండి.

Published : 30 Mar 2023 10:51 IST

కొద్ది రోజుల క్రితం నేపాల్‌ (Nepal) గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌ ఇండియా (Air India), నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ (Nepal Airlines)లకు చెందిన విమానాలు గాల్లో దాదాపు ఢీకొట్టుకున్నంత పని చేశాయి. వెంటనే.. హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. అసలు విమానాలు (Flights) ఎదురెదురుగా, వెనుక నుంచి ఒకదానినొకటి ఢీకొనకుండా గాల్లో ఏ విధంగా ప్రయాణం సాగిస్తాయో చదివేయండి.

సుశిక్షితులైన పైలట్లు

గగనతలంలో సురక్షిత ప్రయాణానికి విమానం నడిపే పైలట్లు (Pilots) రకరకాల పద్ధతులను అవలంబిస్తారు. రాడార్‌ రహిత, రాడార్‌ సహిత వ్యవస్థలను ఆధారం చేసుకొని ఎలా ప్రయాణం చేయాలో వారు శిక్షణలో నేర్చుకుంటారు. దాంతో గాల్లోనే రెండు విమానాలు ఢీకొనడం దాదాపుగా అసాధ్యం. విమానాలు గాల్లో ఎగరడం మొదలైన తొలినాళ్లలో పక్కనే ఏమైనా విమానం వస్తోందా అని పైలట్లు కిటికీలో నుంచి చూసేవారట. ఆ పరిస్థితిని మార్చేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతులను కనుగొని పాటించారు. నేడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో దేశం తమ అవసరాలకు తగ్గట్లుగా మొత్తం రక్షణ వ్యవస్థలను వినియోగించుకుంటుంది. వాటిలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

నిరంతర సమాచారం

విమానాశ్రయానికి దగ్గరలో వచ్చిపోయే విమానాల ట్రాఫిక్‌ గురించి స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్‌ డిపార్చర్‌ (ఎస్‌ఐడి), స్టాండర్డ్‌ టెర్మినల్‌ ఎరైవల్‌ రూట్‌(స్టార్‌) ద్వారా పైలట్లు తెలుసుకుంటారు. ఏ సమయంలో ఏయే విమానాలు వస్తాయో మొత్తం సమాచారం వారికి ఎప్పటికప్పుడు అందుతుంటుంది. టేకాఫ్‌ కావడానికి విమానాశ్రయంలో పరిస్థితులు అనుకూలించపోయినా పైలట్లకు సమాచారం వెళ్తుంది. దాంతో వారు కొంచెం సేపు విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించి తరువాత కిందకి దించుతారు. ఒక వేళ విమానాశ్రయానికి దూరంగా ప్రయాణిస్తుంటే నిలువు, అడ్డం సూత్రాలను ఆధారం చేసుకొని విమానాలను నడిపిస్తారు. అంటే గాల్లో ఎగిరే సమయంలో ఇతర విమానాలకు దూరం పాటిస్తారు. నేపాల్‌ ఘటనలో ఈ విధానంలో తేడా రావడంతోనే ప్రమాదానికి ఆస్కారం ఏర్పడినట్లు సమాచారం.

నిలువు దూరం లెక్కన..

విమానం స్థితిని బట్టి అవి ఎగిరే ఎత్తులో ఎంత దూరం పాటించాలో నిర్ధారిస్తారు. సాధారణంగా 29 వేల అడుగుల లోపు ఎత్తులో ప్రయాణించే విమానాల మధ్య  వెయ్యి అడుగుల నిలువు దూరం పాటించాల్సి ఉంటుంది. అంటే ‘X’ అనే విమానం 12 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తే ‘Y’ 13 వేల అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణం చేయాలి. 29 వేల అడుగులకు పైన ప్రయాణిస్తుంటే రెండు విమానాల ఎత్తులో దూరం 2 వేల అడుగులుంటుంది. 45వేల అడుగులకు పైన ప్రయాణించే సూపర్‌సోనిక్‌ విమానాలు 4 వేల అడుగుల ఎత్తు దూరం పాటించాలి. అధునాతన జెట్‌ విమానాలను మాత్రం ‘రెడ్యూస్డ్ వెర్టికల్ సెపరేషన్‌ మినిమా’ విధానంలో 29-41వేల అడుగుల ఎత్తులో వెయ్యి అడుగుల దూరం పాటించడానికి అనుమతిస్తారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి ఈ విధానం తోడ్పడుతుంది.

పలురకాలుగా ‘అడ్డు’కట్ట 

విమానాలను అడ్డంగా వేరు చేసేందుకు రెండు మార్గాలను ఎంచుకుంటారు. రాడార్‌ కవర్‌ చేసే ప్రదేశాన్ని దూరంతో, రాడార్‌లేని ప్రదేశాన్ని సమయంతో వేరు చేస్తారు. రాడార్‌ కవర్‌ చేస్తున్న ప్రదేశంలో రెండు విమానాలు ఒకదాని వెనుక మరొకటి వెంటనే వెళ్లడానికి అనుమతించరు. ఈ విధానంలో ఒక్కో విమానానికి దాదాపు 5 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. రాడార్‌ కవర్‌ చేయని ప్రాంతంలో ప్రయాణానికి రెండు విమానాలు బయలుదేరే సమయం 10 నుంచి 15 నిమిషాలు తేడా ఉంటుంది. ఇక ఎదురెదురుగా వచ్చే విమానాలు ఢీకొట్టకుండా ‘నార్త్‌-సౌత్‌’ రూల్‌ను పాటిస్తారు. అంటే ఆకాశ మార్గాన్ని 360 డిగ్రీలుగా విభజించుకొని 0-179 డిగ్రీల వరకు విమానాలు నార్త్ నుంచి సౌత్‌కు వెళతాయి. 180-359 డిగ్రీల మధ్య విమానాలు సౌత్‌ నుంచి నార్త్‌ వైపు ప్రయాణిస్తాయి.

రాడార్‌ రహిత గగనతలంలో

అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖండాలు, మహా సముద్రాలు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. శాస్త్ర పరిశోధనల పరిమితుల కారణంగా ప్రపంచంలో కొన్ని చోట్ల రాడార్లు పనిచేయవు. దాన్నే రాడార్‌ రహిత గగనతలం అంటారు. ముఖ్యంగా సముద్రంపై మార్గాలను రాడార్లు కవర్‌ చేయలేవు. ఇలాంటి సమయంలో ఒక విమానానికి మరో విమానానికి మధ్య ఎత్తులో, పక్క, వెనుక నుంచి దూరం(పొజిషన్‌) పాటించడం ఎంతో ఉపకరిస్తుంది. ఎత్తులో తేడా వెయ్యి కిలోమీటర్లే అయినప్పటికీ విమానం బయలుదేరే సమయం మధ్య వ్యవధి 30 నిమిషాలు, దూరం దాదాపు 90 కిలోమీటర్లు ఉండేలా చేసుకుంటారు.

ఏటీసీ ఆదేశాలు కీలకం 

విమానాలు సురక్షితంగా గాల్లో ప్రయాణం చేయడంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ (ఏటీసీ) కీలక పాత్ర పోషిస్తుంది. ఏ విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోందో ఏటీసీకి ఎప్పటికప్పుడు రాడార్ల సహాయంతో తెలిసిపోతుంది. అందుకు విమానంలో అమర్చిన ట్రాన్స్‌పాండర్‌ దోహదం చేస్తుంది. ఏటీసీ సూచనలు పైలట్లు తప్పకుంటా పాటించాల్సి ఉంటుంది. ఇక విమానాలు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటే వాటి వేగం 463 కిలోమీటర్ల లోపునే ఉండాలి. ఎక్కడ తేడా జరిగినట్లు తెలిసినా ఏటీసీ, పైలట్లు, పరికరాలు అన్నింటినీ తనిఖీ చేసి తప్పు ఎక్కడ దొర్లిందో సాంకేతిక సిబ్బంది కనిపెట్టేస్తారు.

అధునాతన వ్యవస్థ ‘టీసీఏఎస్‌’ 

విమానం గగనతలంలో ఎగురుతుండగానే ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే ట్రాఫిక్‌ అలర్ట్ & కొలిజన్‌ అవైడెన్స్‌ సిస్టమ్ (టీసీఏఎస్‌) పైలట్‌లను అప్రమత్తం చేస్తుంది. దాదాపు అన్ని విమానాల్లో ఇటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఎగిరే ఎత్తు పెంచమని ఒక పైలట్‌ను, తగ్గించమని మరో పైలట్‌ను కమాండ్‌ చేస్తుంది. ఈ వ్యవస్థ అప్రమత్తం చేసిందంటే దాన్ని కచ్చితంగా పైలట్లు పాటించి తీరాలి. ఒక వేళ ఆ సమయంలో ఏటీసీ నుంచి భిన్నమైన కమాండ్స్‌ వచ్చినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ప్రయాణికులతో రాకపోకలు సాగించే విమానాలకు ‘టీసీఏఎస్‌’ వ్యవస్థ తప్పనిసరి చేశారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని