Mount Everest : ఎవరెస్టు అధిరోహణ ప్రాణాలతో చెలగాటం.. ఎన్ని అడ్డంకులు దాటాలంటే!

జీవితంలో ఒక్కసారైనా ఎవరెస్టు పర్వతాన్ని (Mount Everest) అధిరోహించాలనేది పర్వతారోహకుల (Mountaineers) కల. అయితే దాన్ని నెరవేర్చుకునే క్రమంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కొందరు మధ్యలోనే వెనుదిరుగుతారు. మరికొందరు మొండిగా ముందుకెళ్లి ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ క్రమంలో ఎవరెస్టు అధిరోహణలో ఉండే కష్టనష్టాల గురించి చదివేయండి.

Published : 26 May 2023 15:57 IST

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఒక్కసారి అధిరోహించడమే అరుదైన విషయం. అలాంటిది ప్రముఖ పర్వతారోహకులు కమీ రీటా షెర్పా 28 సార్లు, పాసన్గ్‌ దావా షెర్పా 27 సార్లు ఎవరెస్టు ఎక్కి సంచలనం సృష్టించారు. ఈ సీజన్‌లోనే ఆస్ట్రేలియా (Australia)లోని పెర్త్‌కు చెందిన 40 ఏళ్ల జేసన్‌ బెర్నార్డ్‌ కెన్నిసన్‌ (Jason Bernard Kennison)గత శుక్రవారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించి.. కిందకు దిగే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎవరెస్టును అధిరోహించడం ఎందుకు కష్టమైన పని? ఏటా ఎంత మంది మృత్యువాత పడుతున్నారు? షెర్పాలు ఎవరు?తదితర విషయాలు తెలుసుకోండి.

ఎవరీ షెర్పాలు?

షెర్పా అనేది పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక తెగ. భారత్‌, నేపాల్‌, టిబెట్‌ సహా పలు దేశాల్లో ఈ జనాభా ఉంది. వీరు వివిధ భాషలు మాట్లాడుతూ పర్వతారోహకులు, పర్యాటకులకు సాయం చేస్తుంటారు. అందుకోసం కొంత డబ్బు తీసుకుంటారు. ఎవరెస్ట్‌ పర్వాతారోహణ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో వీరికి డిమాండ్ ఏర్పడింది. టూరిస్టులకు సాయం చేసే క్రమంలో కొన్నిసార్లు షెర్పాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన షెర్పాలు సంఖ్య కూడా ఎక్కువే. తొలి రోజుల్లో వీరు పర్వతాలను దేవతలుగా ఆరాధించారు. వాటిని ఇతరులు అధిరోహించడానికి కూడా అంగీకరించేవారు కాదట.

ఎత్తయిన శిఖరం ‘ఎవరెస్టు’

ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా మౌంట్‌ ఎవరెస్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీన్ని టిబెట్ భాషలో ‘చోమోలుంగ్మా’, నేపాలీలో ‘సాగర్‌మాత’ అని పిలుస్తారు. ఈ పర్వతం సముద్రం మట్టం నుంచి 8849 మీటర్ల ఎత్తులో ఉంది. ఎవరెస్టు శిఖరాన్ని తొలిసారి టెన్జింగ్ నార్గే, సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీలు అధిరోహించారు. ఈ నెల 29 నాటికి ఆ ఘట్టానికి 70 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సారి మౌంట్ ఎవరెస్టుపై బాగా రద్దీ నెలకొంది. నేపాల్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 478 క్లైంబింగ్‌ పర్మిట్‌లు మంజూరు చేసింది. అదే విధంగా ఈ సీజన్‌లోనే మే 23 దాకా 11 మంది మృతిచెందారు. మరో ఇద్దరి ఆచూకీ గల్లంతైంది.

ఏళ్ల తరబడి సన్నద్ధం

ఎవరెస్టు ఎక్కడం సాధారణ విషయం కాదు. శారీరకంగా, మానసికంగా, సాంకేతికంగా పర్వతారోహకులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అందుకోసం కొన్ని సంవత్సరాలు సాధన చేస్తారు. ముందుగా ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న, ఎత్తయిన కొండలపై నిద్ర అలవాటు చేసుకుంటారు. అలాగే తక్కువ ఆక్సిజన్‌ ఉన్న గదుల్లోకి వెళ్లి ఎంతసేపు ఉండగలమో ప్రయత్నించి చూస్తారు. మెల్లగా ఆ సమయాన్ని పెంచుతూ పోతారు. చిన్న చిన్న పర్వతాలను అధిరోహిస్తూ తమ శక్తియుక్తులను బలోపేతం చేసుకుంటారు. ఇంతగా శిక్షణ తీసుకున్నా కొందరు ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌లోకి అడుగుపెట్టగానే తడబడతారు. వివిధ అడ్డంకుల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు.

నాన్‌ షెర్పాల మరణాలు అధికం

హిమాలయన్‌ డేటా బేస్‌ ప్రకారం 1922 నుంచి 2022 క్లైంబింగ్ సీజన్‌ పూర్తయ్యేనాటికి 310 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 16 వేల మంది నాన్‌-షెర్పాలు ఎవరెస్టు ఎక్కే సాహసం చేసి 5633 మంది మాత్రమే విజయం సాధించారు. వారి గెలుపునకు కారణం 5825 మంది షెర్పాలు. ఈ షెర్పాలు ఎవరెస్టును అధిరోహించాలనే ఆలోచన లేకుండానే పర్వతారోహకులకు తోడుగా వెళ్లారు. వీరిలో కొందరు ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎవరెస్టును అధిరోహించారు.

2006 నుంచి 2019 మధ్య కాలంలో నాన్‌-షెర్పా మహిళల మరణాలు 0.5 శాతం కాగా.. పురుషుల మరణాలు 1.1 శాతం. ఈ మరణాలకు కారణం అవలంచెలు, మంచు కొండలు విరిగిపడటం, భయానక ఖుంబూ హిమపాతాన్ని దాటుకోవడం, అల్పోష్ణ స్థితి, భయంకరమైన చలి, తీవ్ర అలసట, ఆయాసం, ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో అనారోగ్యం వంటి కారణాలున్నాయి. ఇక 1950 నుంచి సంభవించిన నాన్‌-షెర్పా మరణాల్లో 35 శాతం కింద పడిపోవడం, 22 శాతం ఆయాసం, 18 శాతం అనారోగ్యం.. మిగతావి ఇతర కారణాల వల్ల జరిగాయి. అయితే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం వల్ల షెర్పాలు మరణాలను చాలా వరకు తప్పించుకోగలిగారు. వారి మరణాల్లో 44 శాతం హిమపాతాల కారణంగా చోటు చేసుకున్నాయి. 2014లో ఓ భారీ అవలంచె 16 మంది షెర్పాలను బలితీసుకుంది.

అకస్మాత్తుగా చుట్టుముట్టే వ్యాధులివే!

5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ వద్ద 50 శాతం ఆక్సిజన్‌ మాత్రమే లభిస్తుంది. ఇక శిఖరం వద్ద ప్రాణవాయువు 30 శాతానికి లోపే ఉంటుంది. దాంతో కొందరు తీవ్రమైన ‘మౌంటెన్‌ సిక్‌నెస్‌’కు గురవుతారు. తలనొప్పి వికారం, ఆకలి నశించడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. కొందరు ఈ స్థితిని తట్టుకొని కిందికి వస్తేనే ప్రాణాలతో ఉంటారు. ‘పల్మనరీ అడిమా’ అనేది మరో రోగ లక్షణం. ఊపిరితిత్తుల్లోకి నెమ్ము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పొడి దగ్గుతోపాటు నోట్లో నుంచి నురగ, గులాబీ రంగు కఫం బయటకు వస్తాయి. ‘సెరెబ్రల్ అడిమా’ ఇంకా ప్రమాదకరం. దీంతో మెదడులోకి ద్రవం చేరి తీవ్రమైన తలపోటు వస్తుంది. గందరగోళం ఏర్పడి మైకం వస్తుంది. శరీరంపై నియంత్రణ కోల్పోతారు. సకాలంలో చికిత్స అందకపోతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది. పర్వతారోహకులు ఆక్సిజన్‌ ట్యాంకులు తమ వెంట తీసుకెళ్లడం ద్వారా చాలావరకు ఈ ప్రమాదాలను నివారించుకోగలుగుతున్నారు.

 -ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని