Sammed Shikharji: అప్పట్లో తీర్థంకరుల మోక్ష స్థలం ‘సమ్మేద్ శిఖర్జీ’.. ఇప్పుడెలా వార్తల్లోకెక్కింది!

‘సమ్మేద్‌ శిఖర్జీ’ (Sammed Shikharji).. ఇటీవల జైనులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ దాన్ని తమ పవిత్ర స్థలంగా గుర్తించాలని ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో తెలుసుకోండి.

Updated : 11 Jan 2023 16:22 IST

సమ్మేద్‌ శిఖర్జీ’ (Sammed Shikharji).. ఇటీవల దేశవ్యాప్తంగా జైనులు (jain) ఆందోళనలు జరపడంతో ఈ పేరు బాగా వినిపించింది. ఈ స్థలం ఎక్కడుంది? దాన్ని తమ పవిత్రస్థలంగా గుర్తించాలని జైనులు ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారో తెలుసుకోండి.

(Image credit : Google map)

జైనులకు ఇది ఎందుకు పవిత్ర స్థలం ?

పార్శ్‌నాథ్‌ ఝార్ఖండ్‌(jharkhand)లోనే ఎత్తయిన పర్వతం. గిరిధ్‌ జిల్లాలో పార్శ్‌నాథ్‌ కొండపై సమ్మేద్‌ శిఖర్జీ(Sammed Shikharji) ఉంది. జైన మతం ఆచరించే దిగంబర, శ్వేతాంబరులకు ఇది ముఖ్యమైన జైనతీర్థం. 24 మంది జైన తీర్థంకరులలో 20 మంది ఇక్కడ మోక్షం సాధించినట్టు చెబుతుంటారు. సమ్మేద్‌ శిఖర్జీ(Sammed Shikharji) మాత్రమే కాకుండా గిర్నార్‌(గుజరాత్), దిల్వారా(రాజస్థాన్‌), పాలిటనా(గుజరాత్‌), అష్టపద్‌ కైలాస్‌(చైనాలోని టిబెట్‌ స్వయం ప్రతిపత్తి ప్రాంతం) వంటివి జైనులకు ముఖ్యమైన ఆరాధన ప్రదేశాలు.

మద్యం, మాంసంతో మొదలైన వివాదం

2019లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పార్శ్‌నాథ్‌ అభయారణ్యాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా గుర్తించింది. దీంతో అక్కడికి పర్యాటకులను ఆకర్షించే విధంగా 2022 జులైలో ఝార్ఖండ్(jharkhand) రాష్ట్ర ప్రభుత్వం నూతన టూరిజం పాలసీని తీసుకొచ్చింది. అప్పటి నుంచి పార్శ్‌నాథ్‌ కొండకు వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగింది. వారిపై సరైన నియంత్రణ లేకపోవడంతో మాంసం, మద్యం తదితర అసాంఘిక కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పలు చోట్ల ఎముకలు కన్పించడం జైనుల ఆగ్రహానికి కారణమైంది. 

చైతన్యవంతంగా నిరసన

2011 లెక్కల ప్రకారం దేశంలో జైనుల జనాభా(jain population) 44,51,753. అంటే భారతదేశంలోని మొత్తం జనాభాలో వీరు 1% కూడా లేరు. కానీ జైనుల్లో అక్షరాస్యత శాతం ఎక్కువ. వివిధ హోదాల్లో కొందరు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపార రంగంలోనూ జైనులు తమదైన ముద్ర వేశారు. తమ పవిత్ర స్థలానికి భంగం వాటిళ్లుతోందని తెలియగానే వేగంగా ప్రతిస్పందించారు. దిల్లీ(delhi), అహ్మదాబాద్‌(ahmedabad), కోల్‌కతా వంటి ముఖ్య నగరాల్లో ఆందోళనలు మొదలుపెట్టారు. క్రమంగా ఈ నిరసనలు మన తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతా విస్తరించాయి. ఇద్దరు గురువులు నిరాహార దీక్ష దిగి ప్రాణాలు విడిచారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి ఎకో టూరిజం ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేశాయి. 

ఎకో సెన్సిటివ్‌ జోన్‌పై పర్యవేక్షణ కమిటీ

సమ్మేద్‌ శిఖర్జీపై వివాదం తలెత్తడంతో ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వం ఎకో సెన్సిటివ్‌ జోన్‌ నిర్ణయంపై ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఇద్దరు జైనులు, ఒక ఆదివాసీ సభ్యుడిగా ఉంటారని కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌(Bhupender Yadav) వెల్లడించారు. సమ్మేద్‌ శిఖర్జీ పవిత్రతకు భంగం వాటిల్లకుండా కొండపై చర్యలు చేపట్టాలని కేంద్రం.. ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పార్శ్‌నాథ్‌పై మద్యం, మాంసాహార విక్రయాలపై నిషేధం, లౌడ్‌ స్పీకర్ల ఏర్పాటు, ట్రెక్కింగ్‌ వంటివి లేకుండా చూడాలని సూచించింది.

కొండపై ముదురుతున్న వివాదం

కేంద్రం ఎకో టూరిజం పాలసీపై స్టే విధించడంపై అక్కడ నివాసం ఉంటున్న ఆదివాసీ నేతలు మండిపడుతున్నారు. ‘ఆ ప్రాంతం మాకు చెందినది. గత కొన్ని దశాబ్దాలుగా మేము జైనుల మత విశ్వాసాలను గౌరవిస్తున్నాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మా సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. సమ్మేద్‌ శిఖర్జీకి 10 కిలోమీటర్లకు దూరంలో ఉన్న గ్రామాలపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు.ఆదివాసీలకు కూడా ఈ కొండ పవిత్రమైనది. మాకూ హక్కులున్నాయనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇది జైనుల మత ప్రదేశమని ప్రకటిస్తే.. ఆదివాసీల తీర్థయాత్ర ప్రదేశంగా కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఆదివాసీలు ఇక్కడే ఉంటూ వారి ఆచారాలను కొనసాగించేలా చూడాలంటూ’ ఆదివాసీ హక్కుల పోరాట నేత సికందర్‌ హెంబ్రోం వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని