Flights - Alcohol: అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో మద్యం సరఫరా ఎందుకు?
మద్యం అనర్థదాయకం. అయినా కూడా అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాల్లో మద్యం పంపిణీ చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారో చదివేయండి!
ఇటీవల పలు అంతర్జాతీయ విమాన(International flights) ప్రయాణాల్లో మందుబాబులు చేసిన హల్‌చల్ చర్చనీయాంశమైంది. మద్యం మత్తులో తోటి ప్రయాణికులపైనే మూత్రం విసర్జన చేయడం, అనుచితంగా ప్రవర్తించడం, ఎయిర్ హోస్టెస్‌లతో వాదనకు దిగడం, విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వారిలో చాలా మంది మద్యం మత్తులోనే అలాంటి విపరీత పోకడలకు పోయారని తెలిసింది. అయితే ఇన్ని గొడవలకు కారణమవుతుందని తెలిసీ విమానంలో మద్యాన్ని ఎందుకు సరఫరా చేస్తారంటే...
విమాన ప్రయాణం ఒక విలాసం. అందులో ఎక్కువగా ఖర్చుకు వెనుకాడని ధనవంతులే ప్రయాణిస్తుంటారు. వారికి మరిన్ని సౌకర్యాలు సమకూరిస్తే మరింత ఆదాయం పొందవచ్చనేది విమాన సంస్థల ఆలోచన. అందుకే ఎకానమీ, బిజినెస్ క్లాసులను బట్టి మద్యం (alcohol) సరఫరా చేసి లాభాలను ఆర్జిస్తుంటాయి. ఇదివరకు కొన్ని విమాన సంస్థలు తమ ప్రయాణికుల (passenger)కు మద్యం (liquor) మాత్రమే కాకుండా.. రాజభోగాలు సమకూర్చాయి. అనుకోకుండా తమ సంస్థ విమానాలు రద్దయితే టికెట్ (ticket) రేటుతో సంబంధం లేకుండా ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటు చేశాయి. ఎందుకంటే వాటి మధ్య ఉన్న పోటీతత్వం. ప్రయాణికుల (customers) మనసులో చోటు సంపాదిస్తే ఎప్పుడూ తమ సంస్థ విమానాల్లోనే ప్రయాణిస్తారని వారి నమ్మకం. ఇలా అనవసర ఆర్భాటాలతో ‘గాల్లో విమానాలు’ నడిపి ఆ సంస్థలు నష్టాలను చవి చూసి చివరికి చేతులు కాల్చుకున్న ఘటనలు ఉన్నాయి.
మద్యం అందించడం వెనుక కారణాలేంటి?
మద్యం పంపిణీ చేయడం వెనుక కంపెనీ పబ్లిసిటీ, లాభాపేక్ష తప్పితే ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. విమాన టికెట్‌లో మద్యంపై కొంత మొత్తాన్ని ముందుగానే వసూలు చేస్తారు. దీంతో ఆ విమాన సంస్థకు ఆదాయం లభిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలకు కచ్చితంగా కొన్ని గంటల సమయం పడుతుంది. అందువల్ల కొంత మంది మద్యం, ఆహారం తీసుకుంటే ప్రయాణం బోర్ కొట్టదని భావిస్తారు. ఇక మద్యం తీసుకున్న ప్రయాణికులు నిద్రలోకి జారుకునే అవకాశాలు ఎక్కువ. దాంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అందించాల్సిన సేవలు తగ్గుతాయి. మత్తులో ఉండటం వల్ల.. ప్రయాణికులు తరచూ సమయం చూడటం తగ్గుతుంది. తమకు అందుతున్న సేవలపై, ప్రయాణంలో లోపాలపై ప్రశ్నించడానికి ఆసక్తి చూపించరు.
రెడ్ కేటగిరీ ప్రయాణికులతోనే ఇబ్బంది
మద్యం తీసుకున్న చాలా మంది ప్రయాణికులు గ్రీన్ కేటగిరికి చెంది ఉంటారు. అంటే వీరు హద్దుల్లో ఉంటారు. ఎంత మొత్తం తాగాలి.. అది ఎంత సేపు తమ శరీరంపై ప్రభావం చూపుతుంది అనే స్పష్టమైన ఆలోచన ఉంటుంది. తాము మోతాదుకు మించి తాగుతున్నామని తెలియగానే కచ్చితంగా ఆపేస్తారు. రెండోది ఎల్లో కేటగిరి. వీరు పరిస్థితులు అదుపుతప్పితేనే అతిగా ప్రవర్తించడానికి ఆస్కారం ఉంటుంది. మూడోది విపరీత పోకడలకు పాల్పడేవారు. వీరిని రెడ్ కేటగిరీ కింద చూస్తారు. తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గొడవ చేయడం, మూత్ర విసర్జన చేయడం, అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించడం లాంటి ఇబ్బందులు ఇలాంటి వారి వల్లే ఎదురవుతాయి. ఇలా మూడు కేటగిరీల ప్రయాణికులను గుర్తించి.. అతి చేసేవారిని నియంత్రించేలా విమానయాన సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తారు. తాజాగా మన దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా కూడా తమ సిబ్బందికి ఇలాంటి సూచనలే చేసింది.
సర్వేలు ఏం చెబుతున్నాయి!
విమాన ప్రయాణాల్లో ఎక్కువ మంది ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు పలు సంస్థలు సర్వేలు చేపట్టాయి. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎంత విమాన ప్రయాణమైనా ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే ఎక్కువ సమయమే తీసుకుంటుంది. అంత సమయం ఏం చేయాలో తోచక చాలా మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడతున్నారట. 10 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో దాదాపు 8 మంది ఆల్కహాల్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. ఇక వయసు పైబడిన వారితో పోలిస్తే యువకులు ప్రయాణం పట్ల ఆందోళనకు గురై ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారని తెలిసింది. విమానంలో పీడనం సముద్ర పీడనానికి కంటే 4శాతం తక్కువగా ఉంటుంది. దాంతో ప్రయాణికుల శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా తగ్గిపోతుంది. ఆ సమయంలో మద్యం తీసుకున్న ప్రయాణికులకు కిక్ ఎక్కని భావన కలుగుతుంది. ఇంకాస్త తాగినా.. తమకు ఏమీ కాదనే అభిప్రాయంతో ఎయిర్‌హోస్టెస్‌లను మద్యం అడుగుతుంటారు. అయితే వారికి రక్తంలో కలిసిన ఆల్కహాల్ ప్రభావం విమానం నేలపై ల్యాండ్ అయిన తరువాత తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఆ విమానాలు మద్యానికి దూరం
ప్రయాణికులకు తప్పనిసరిగా మద్యం ఇవ్వాలని నిబంధనలు ఏమీ లేవు. దీంతో కొన్ని విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మద్యం అందించవు. చాలా మధ్య ప్రాచ్య దేశాల విమాన సంస్థలు.. ప్రయాణాల్లో ఆల్కహాల్ తాగడాన్ని నిషేధించాయి. అవి ముస్లిం దేశాలకు చెందినవి కావడం కూడా ఒక కారణం. దాంతో ఎయిర్ అరేబియా, ఈజిప్ట్ ఎయిర్, ఇరాన్ ఎయిర్, ఇరాకీ ఎయిర్ వేస్, కువైట్ ఎయిర్ వేస్, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్, రాయల్ బ్రూనై ఎయిర్‌లైన్స్, సౌదియా విమాన కంపెనీలు మద్య నిషేధం అమలు చేస్తున్నాయి.
మన దేశీయ ప్రయాణాల్లో ‘నో’
మన దేశంలోనూ ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే విమానాల్లో(domestic flights) మద్యం తాగడానికి అనుమతించరు. మద్యం పోయరు. అయితే పరిమిత సంఖ్యలో మద్యం సీసాల రవాణాకు మాత్రం అనుమతిస్తారు. ఇలాగే టర్కీ, చైనా కూడా తమ దేశీయ విమాన ప్రయాణాల్లో ఆల్కహాల్‌ను అనుమతించవు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MIW vs DCW: చరిత్ర సృష్టించిన ముంబయి.. డబ్ల్యూపీఎల్ కైవసం
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
Crime News
UP: ‘నన్ను ఎన్కౌంటర్ చేస్తారు’.. భయం మధ్యే గ్యాంగ్‌స్టర్ యూపీకి తరలింపు
-
Sports News
Shikhar Dhawan : నేను పెళ్లి విషయంలో ఫెయిలయ్యాను.. : శిఖర్ ధావన్
-
Movies News
Nagababu: పవన్‌కు ఇచ్చే గొప్ప బహుమతి అదే..: చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగబాబు కామెంట్స్
-
Sports News
TATA IPL 2023: ఐపీఎల్ వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ