MiG-21 : అనేక ప్రమాదాలు.. అయినా ‘మిగ్‌ ’యుద్ధ విమానాలే శరణ్యం ..!

భారత వాయుసేనకు (Indian Air Force)చెందిన మిగ్‌-21 (MiG-21) యుద్ధ విమానాలు తరచూ కూలిపోయి వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ పాతతరం యుద్ధ విమానాలను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలుసుకోండి.

Updated : 08 May 2023 17:37 IST

ప్రపంచంలోని అత్యుత్తమ వైమానిక దళాల్లో ఒకటిగా భారత వైమానిక దళానికి (Indian Air Force) ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అత్యంత అధునాతన ఆయుధ సంపత్తిని ఈ దళం వినియోగించుకుంటోంది. అయినప్పటికీ మిగ్‌-21 వంటి పాతతరం విమానాలను తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని  (Rajasthan)హనుమాన్‌గఢ్‌లోని పొలాల్లో మిగ్‌-21 (MiG-21) శిక్షణ యుద్ధవిమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. కాగా ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగ్‌-21లు ఎందుకు ఎక్కువగా కూలిపోతున్నాయి. వాటిని ఇంకా వాయుసేన ఎందుకు కొనసాగిస్తుందో తెలుసుకోండి. 

సగం కూలిపోయాయి!

1985లోనే సోవియట్‌ యూనియన్‌ మిగ్‌-21లను తమ దళం నుంచి తొలగించింది. బంగ్లాదేశ్‌ కూడా వాటిని పక్కన పెట్టింది. భారత్‌ వాయుసేనలో మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు, మాజీ వైమానిక దళ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర సుఖోయ్‌, రఫేల్, తేజస్‌ వంటి యుద్ధ విమానాలున్నాయి. కానీ, వాటి సంఖ్య చాలా పరిమితం. దాంతో భారత వాయుసేన అవసరాలు తీరడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోవియట్‌ యూనియన్‌ రూపొందించిన ఈ మిగ్‌-21లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న 872 మిగ్‌ విమానాల్లో సగానికిపైగా కూలిపోయినట్లు 2012లోనే నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోని రాజ్యసభలో వెల్లడించారు. నాటి లెక్కల ప్రకారమే 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు మృతి చెందారు. ఇటీవలి కాలంలో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఆ సంఖ్య మరింతగా పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రత్యామ్నాయం కరవు

ప్రస్తుతం వాయుసేనలో సుమారు 32 స్క్వాడ్రన్లు ఉన్నాయి. అయితే వాస్తవానికి 42 స్క్వాడ్రన్ల అవసరం ఉంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వీలైనంత తొందరగా అదనపు స్వ్కాడ్రన్లను ప్రవేశపెట్టుకోవాల్సి ఉంది. అందుబాటులో ఉన్న స్క్వాడ్రన్లలో పాతతరం యుద్ధ విమానాలు మిగ్‌-21, జాగ్వార్‌, మిరాజ్‌ రకానికి చెందినవి ఎక్కువగా ఉన్నాయి. ఉన్నపళంగా వాటిని తొలగించడం కుదరని పని. 7 మిగ్‌-21 స్క్వాడ్రన్లు ప్రస్తుతం క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. వాటిలో నాలుగింటిని 2025 నాటికి తొలగిస్తారని సమాచారం. 

పాతవే అయినా..

మిగ్‌-21లు పేరుకు పాతతరం విమానాలే అయినా వాటిలో వాడుతున్న సాంకేతికత చాలా అధునాతనమైనది. అందుకే వాటిని ‘మిగ్‌-21 బైసన్‌’అని పిలుస్తుంటారు. 1963లో ప్రవేశపెట్టిన మిగ్‌లకు ఇప్పటి మిగ్‌లకు చాలా వైవిధ్యం ఉంది. సరికొత్త ఏవియానిక్స్‌, ఆయుధ రవాణా సామర్థ్యం జోడించిన కారణంగా ఇవి సురక్షితమని చెప్పేవారూ లేకపోలేదు. అనేక ప్రమాదాలకు కారణం కేవలం అవి పాతబడిపోవడం మాత్రమే కాదని చెబుతున్నారు. 

భారత వాయుసేన నివేదికల ప్రకారం.. మిగ్‌-21 యుద్ధ విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి. 1971 యుద్ధంలో ఇండియాకు అద్భుత విజయం చేకూరడం వెనుక మిగ్‌ల కృషి దాగి ఉంది. అందుకే వీటితోనే కొత్తగా వాయుసేనలో చేరిన పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కువగా సేవలందించడం, శిక్షణలో పాల్గొనడం కారణంగా మిగ్‌-21లు కూలిపోతున్న ఘటనలు కూడా ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. నూతనంగా అందుబాటులోకి వచ్చిన తేజస్‌, రఫేల్‌లను శిక్షణలో వినియోగిస్తే ఖర్చు పెరిగిపోతుంది. అందుకే మిగ్‌-21లను వినియోగిస్తున్నారు. 

‘తేజస్‌’ల రాక ఆలస్యం

మిగ్‌-21ల స్థానాన్ని భర్తీ చేయడానికి 1980 ప్రాంతంలోనే భారత ప్రభుత్వం  (లైట్‌ కొంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌) ఎల్‌సీఏ ప్రాజెక్టును చేపట్టింది. హాల్‌తో కలిసి సుదీర్ఘ పరిశోధన అనంతరం తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను మనం సొంతంగా రూపొందించుకోగలిగాము. 2016 నాటికి తేజస్‌లు స్క్వాడ్రన్‌లలో చేరిపోయాయి. సుమారు 123 తేజస్‌ విమానాల కోసం ఆర్డర్‌ చేయగా 30 వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వాటితో రెండు స్క్వాడ్రన్‌లు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుంది. సుమారు 90 తేజస్‌ విమానాల రాక ఆలస్యం కావడంతో మిగ్‌-21లను వాయుసేన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తగ్గిన రఫేల్‌ యుద్ధ విమానాల సంఖ్య

ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ద్వారా లోటు భర్తీ చేయవచ్చని తొలుత భావించారు. 126 విమానాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా 2016లో కేంద్రప్రభుత్వం 36 మాత్రమే ఆర్డర్‌ ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

-ఇంటర్నెట్ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని