India population : చైనాను వెనక్కి నెట్టి మనమే నం.1.. ఎలా సాధ్యమైందంటే!

భారత జనాభా (India population) 142.86 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి (United nations) ప్రకటించింది. అంతలా మన దేశ జనాభా పెరగడానికి గల కారణాలివి.

Published : 20 Apr 2023 17:19 IST

ప్రపంచంలో (World) అత్యధిక జనాభా (Population) కలిగిన దేశంగా భారత్‌ (India) అవతరించింది. ఇప్పటిదాకా నంబరు 1గా నిలిచిన చైనాను (China) దాటేసింది. మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్య సమితి (United nations)  ప్రపంచ జనాభా డాష్‌ బోర్డు ఇప్పుడు భారత్‌ను అత్యధిక జనాభా కలిగిన దేశంగా చూపిస్తోంది. అదెలా సాధ్యమైందో చదివేయండి.

కచ్చితమైన లెక్కలు

1950వ సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా లెక్కలను సేకరించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఒక్క భారత్‌లోనే సుమారు వంద కోట్ల జనాభా పెరిగింది. గతంలో మన దేశంలో ఎంత మంది శిశువులు జన్మిస్తున్నారనే విషయంపై కచ్చితమైన డేటా అందుబాటులో ఉండేది కాదు. ఇటీవలి కాలంలో స్థానిక ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. దాంతో మనం చైనాను దాటేయబోతున్నామనే విషయం ఈ ఫిబ్రవరిలోనే సూచన ప్రాయంగా తెలిసింది. చైనాలో వృద్ధ జనాభా అధికంగా ఉంది. దాంతో అక్కడ జనాభా పెరుగుదల అసాధ్యం. అయితే ప్రస్తుత అంచనాల ప్రకారం ఇప్పట్లో భారత జనాభా పెరుగుదల ఆగదని తెలుస్తోంది. మధ్యస్తంగా జననాలు సంభవించినా ఈ దశాబ్దం చివరికల్లా 150 కోట్ల జనాభా, 2064 కల్లా 170 కోట్ల మంది భారత్‌లో ఉంటారని ఐరాస అంచనా వేస్తోంది.

యువత పెళ్లి వైపు అడుగులు

ప్రపంచవ్యాప్తంగా 25 సంవత్సరాల వయసున్న ఐదుగురిలో ఒకరు భారతీయులే. దేశ జనాభాలో యువత 40 శాతం దాకా ఉన్నారు. యుక్త వయసులోని వారంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కంటున్నారు. యువ దంపతులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒకరు లేదా ఇద్దరికి జన్మనిస్తున్నారు. అందువల్ల పెరుగుదల కన్పిస్తోంది. కాస్త మధ్య వయసు మన దేశంలో 28 కాగా.. అమెరికాలో 38, చైనాలో 39గా ఉంది.

స్వల్పంగానే వృద్ధుల సంఖ్య

తాజా గణాంకాల ప్రకారం భారత్‌ తరువాతి స్థానంలో జనాభా కలిగిన దేశాలు చైనా, అమెరికా. మన దేశంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 7 శాతం మాత్రమే. అదే చైనాలో 14 శాతం, అమెరికాలో 18 శాతం దాకా ఉన్నారు. అమెరికా అంచనా ప్రకారం 2063 నాటికి కూడా మన దేశంలో వృద్ధ జనాభా 20 శాతం లోపే ఉంటారట. 

సంతానోత్పత్తి రేటు

భారత్‌లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంది. ఇక్కడ ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగలుగుతోంది. అదే చైనాలో (1.2), అమెరికాలో (1.6)గా ఉంది. 1950 కాలంలో ఒక్కో భారతీయ మహిళ 5.9 మందికి జన్మనివ్వగలిగేదట. కుటుంబ నియంత్రణపై అవగాహన పెరగడంతో క్రమంగా పిల్లలను కనడం తగ్గించారు. 1999లో 4.4 ఉన్న సంతానోత్పత్తి రేటు 2019 కల్లా 2.4కు తగ్గింది. మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కుటుంబ నియంత్రణ పద్ధతులపై శ్రద్ధ కనబరుస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా వెల్లడైంది. ముస్లింలలో మాత్రం సంతానోత్పత్తి రేటు మిగతా వర్గాలతో పోలిస్తే అధికంగానే ఉన్నట్లు తేలింది.

వ్యత్యాసం భర్తీ

పట్టణాలు, గ్రామాల మధ్య కూడా సంతానోత్పత్తి రేటులో వ్యత్యాసం ఉంటోంది. అధిక సంతానంతో పట్టణాల్లో నెగ్గుకురావడం కష్టం. అందుకే అక్కడ ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేందుకు మొగ్గు చూపరు. కొన్ని రాష్ట్రాల్లోని దంపతులు కూడా ‘ఒకరు ముద్దు.. ఇద్దరు వద్దని’ పెళ్లయిన కొత్తలోనే నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఏర్పడిన వ్యత్యాసాన్ని ఉత్తరప్రదేశ్, మేఘాలయా, మణిపుర్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు భర్తీ చేస్తున్నాయి. బిహార్‌లో ఇప్పటికీ సంతానోత్పత్తి రేటు 2.98గా ఉంది. 

గ్రామీణ మహిళలు

గ్రామీణ ప్రాంత మహిళలు 20.8 ఏళ్లకు తొలిబిడ్డకు జన్మనిస్తే.. పట్టణ ప్రాంతాల స్త్రీలు 22.3 ఏళ్లకు ప్రసవిస్తున్నారు. అక్షరాస్యత ఉండి, కాస్త సంపన్నులైన స్త్రీలు ఆలస్యంగా పిల్లలను కనేందుకు ఇష్టపడుతున్నారు. వారితో పోలిస్తే గ్రామీణుల సంఖ్య ఎక్కువే కాబట్టి అధిక జననాలు సంభవిస్తున్నాయి. పేదరికం వల్ల కూడా కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు తొందరగా బిడ్డలకు జన్మనిస్తున్నారు.

అమ్మాయిల సంఖ్య పెరుగుదల

గతంలో కొందరు ఆడపిల్లలను కనడానికి ఇష్టపడేవారు కాదు. అక్రమ లింగ నిర్ధారణ పద్ధతుల ద్వారా భ్రూణ హత్యలు పెరగడంతో స్త్రీ, పురుషుల వ్యత్యాసం ఏర్పడింది. కఠినమైన చట్టాలు చేయడం ద్వారా ప్రభుత్వాలు లింగ నిర్ధారణ పరీక్షలు లేకుండా చేయగలిగాయి. ఫలితంగా అబ్బాయిలకు సమానంగా అమ్మాయిల సంఖ్య దగ్గరవుతూ వస్తోంది. 2011లో జరిపిన సర్వే ప్రకారం.. 111 మంది అబ్బాయిలకు 100 అమ్మాయిలుండేవారు. 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలున్నారు.

శిశు మరణాలు తగ్గుముఖం

గత మూడు దశాబ్దాల్లో శిశు మరణాలు 70 శాతం వరకు తగ్గాయి. 1990లో వెయ్యి మంది శిశువులు జన్మిస్తే 89 మరణాలుండేవి. 2020 నాటికి ఆ సంఖ్య 27కు పడిపోయింది. అయితే నేపాల్, భూటాన్‌, శ్రీలంక, చైనా, అమెరికాలో ఈ మరణాల సంఖ్య ఇంకా కనిష్ఠ స్థాయిలో ఉంది. గర్భిణులకు పోషకాహారం పంపిణీ, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరచడం వంటి చర్యలతో శిశు మరణాలను అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని