World Bee Day: తేనెటీగలు శ్రమ జీవులు.. వాటిని గుర్తించాల్సిన రోజు ఇది!

తామెంతో శ్రమించి మధురమైన తేనెను (Honey) మానవులకు అందిస్తున్న తేనెటీగలు (Bees) అనేక కారణాల వల్ల అంతరించిపోతున్నట్లు ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. వాటిని ఎలా కాపాడుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే ఏటా మే 20న ప్రపంచ తేనెటీగల దినోత్సవం (World Bee Day) నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.

Updated : 20 May 2023 11:23 IST

స్లొవేనియా దేశానికి చెందిన ఆంటన్‌ జాన్స్‌ తేనెటీగల (Bees)పెంపకంలో నిపుణుడు. 18వ శతాబ్దానికి చెందిన ఈయన తేనెటీగల పెంపకంలో ఆధునిక పద్ధతులను కనుగొన్నాడు. అంతేకాదు పర్యావరణానికి తేనెటీగలు చేస్తున్న మేలు ఎలాంటిదో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. నేడు ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు, ఆర్థిక వ్యవస్థకు తేనెటీగల పెంపకం ఒక ముఖ్య అవసరంగా మారింది. తేనెటీగల ప్రాముఖ్యత ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే మే 20ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున తేనెటీగల గురించి అవగాహన కల్పిస్తోంది.

మానవుల చర్యలతోనే ప్రమాదం

ఎక్కువగా మానవులు చేసే పనుల కారణంగానే తేనెటీగల మనుగడ ప్రమాదంలో పడుతోంది. మోనోక్రాపింగ్‌, పురుగు మందుల వాడకం, భూ వినియోగ మార్పు, ఇతర కీటకాల సంచారం ఎక్కువ కావడంతో తేనెటీగల కాలనీలకు నష్టం వాటిల్లుతోంది. అసలు తేనెటీగలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఏముంది? మహా అయితే తేనె లభించదు. అంతేగా అనుకోవద్దు. ప్రపంచంలోని 90 శాతం దాకా అడవి పువ్వులు పెరగడానికి దోహదం చేస్తోంది తేనెటీగలేనట. మరి అవి భూమిపై లేకపోతే ఇంత పచ్చదనం ఉంటుందా అనే విషయం ఆలోచించాలి. కేవలం అడవి పువ్వులే కాదు మనం పొలాల్లో పండిస్తున్న 35 శాతం పంటలు పండటంలో కూడా తేనెటీగల పాత్ర ఉంది. దాంతో ప్రపంచ పర్యావరణ సమతౌల్యత సాధ్యమవుతోంది. తేనెటీగలు మాత్రమే కాకుండా గబ్బిలాలు, హమ్మింగ్‌ బర్డ్స్‌, సీతాకోకచిలుకలు సైతం ఈ క్రతువులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.

మన వంతుగా ఏం చేయాలి?

తేనెటీగలు అంతరించిపోకుండా కాపాడుకోవాలంటే పండ్లు, పూలు, కూరగాయలు పండించే తోటలను ప్రారంభించవచ్చు. అంత స్థలం లేదనుకుంటే తేనెటీగలు ఇష్టపడే పువ్వులను బాల్కనీలో, మేడపై పెంచవచ్చు. పొద్దు తిరుగుడు, గసగసాలు, మెంతులు వంటివి పెంచినా ప్రయోజనం ఉంటుంది. తేనెటీగలను కాపాడాలంటే పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలి. ఒక వేళ తప్పనిసరి అయితే ఉదయాన్నే లేదా రాత్రిపూట పిచికారీ చేస్తే తేనెటీగలకు హాని కలుగదు. 

తేనెటీగల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు

  • తేనెటీగలకు 5 కళ్లుంటాయి.
  • తేనెటీగలు నృత్యం చేస్తూ సంభాషించుకుంటాయి. 
  • మగ తేనెటీగలను డ్రోన్స్‌ అని పిలుస్తారు.
  • రాణి ఈగ ఒక రోజులో 2వేల దాకా గుడ్లు పెట్టగలదు.
  • శ్రామిక తేనెటీగలు 2-20 వారాలు, మగ తేనెటీగలు 30-55 రోజులు, రాణి ఈగ 1-5 సంవత్సరాలు బతుకుతాయి.
  • మెలిసా, అలీ అనే పేర్లకు గ్రీకు, ఉర్దూ భాషలో తేనెటీగ అని అర్థం.
  • గాయాలను నయం చేసేందుకు కొందరు తేనె రాస్తుంటారు. అందులోని యాంటీసెప్టిక్‌ గుణం త్వరగా గాయాన్ని మానేలా చేస్తుందని నమ్ముతారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని