Social Media Day: నేడు సోషల్‌ మీడియా డే... ఇవిగో వాటి సంగతులు!

నేడు ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం (World Social Media Day). ఈ సందర్భంగా వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి చదివేయండి. 

Updated : 30 Jun 2023 12:25 IST

ఆధునిక మానవుల దినచర్య సామాజిక మాధ్యమాలతో (Social Media) ప్రారంభమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు వృత్తి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఒక రోజులో సగటున 144 నిమిషాలు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారట. నేడు ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం (World Social Media Day) సందర్భంగా అవి ఎలా ప్రారంభమయ్యాయి. ఏ విధంగా ఆదరణ పొందాయో తెలుసుకోండి.

అలా మొదలైంది ‘వరల్డ్ సోషల్‌ మీడియా డే ’

నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. దాంతో ప్రపంచంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువై.. వారితో సంభాషిస్తున్నారు. భిన్న సంస్కృతులు, ప్రముఖ వ్యక్తులు, ఉద్యమాలు ఇలా ఏ అంశమైనా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే 2010 జూన్‌ 30న ‘మాషబుల్’ అనే సంస్థ ‘వరల్డ్ సోషల్‌ మీడియా డే ’ను ప్రారంభించింది. ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థపై సామాజిక మాధ్యమాలు వేస్తున్న ముద్రను గుర్తించే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టారు.

అదే తొలి సామాజిక మాధ్యమం

ప్రస్తుత కాలంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విటర్, లింక్డ్‌ ఇన్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలను మనం వాడుతున్నాం. అయితే వీటిలో ఏదీ తొలి సామాజిక మాధ్యమం కాదు. 1997లో అభివృద్ధి చేసిన ‘సిక్స్‌ డిగ్రీస్‌’ మొట్టమొదటి సామాజిక మాధ్యమం. ఆండ్రూ విన్రీచ్‌ అనే వ్యక్తి దానిని స్థాపించాడు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ లిస్టులు ఉండే ఇందులో ప్రొఫైల్స్‌, బులెటిన్‌ బోర్డ్స్‌, పాఠశాల అనుబంధాలు వంటి ఫీచర్లు అలరించేవి. ఒకానొక దశలో 10 మిలియన్ల యూజర్లకు చేరువైన ఈ సామాజిక మాధ్యమ ప్రస్థానం 2001లో ముగిసిపోయింది.

ఫేస్‌బుక్‌కు గట్టి పోటీ మై స్పేస్‌

2002లో కొంచెం అధునాతన సామాజిక మాధ్యమం ‘ఫ్రెండ్‌స్టర్’ నెట్టింట్లోకి వచ్చింది. ఈ వెబ్‌సైట్‌ సురక్షితంగా కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడానికి అనుమతించింది. దాంతో స్వల్పకాలంలోనే మిలియన్ల యూజర్లు వచ్చి చేరారు. అందులో మెజారిటీ వినియోగదారులు ఆసియా నుంచే ఉండేవారు. బిజినెస్‌ ప్రాధాన్య అంశంతో  2003లో ‘లింక్డ్‌ఇన్‌’వచ్చింది. 2004లో ‘మై స్పేస్‌’, ‘ఫేస్‌బుక్‌’ ప్రారంభమయ్యాయి. 2006 కల్లా ‘మై స్పేస్‌’ ప్రపంచ ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమంగా అవతరించింది. యూజర్లు మ్యూజిక్‌ను కూడా పోస్టు చేసే సౌలభ్యం ఇందులో ఉండటంతో ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు.

ఇప్పుడు ఎక్కువ మంది గంటల కొద్దీ సమయం గడిపేస్తున్న యూట్యూబ్‌  2005లో, ట్విటర్‌ 2006లో ప్రారంభమయ్యాయి. 2010లో ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్థానం మొదలు కాగా.. అనతి కాలంలోనే అది ఫేస్‌బుక్‌కు గట్టి పోటీనిచ్చే సంస్థగా ఎదిగింది. దాంతో ఇన్‌స్టాగ్రామ్‌ను 1 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ కొనేసింది. ఆ తరువాత సందేశాల ఫీచర్‌తో దూసుకెళ్తున్న ‘వాట్సప్‌’ను కూడా ఫేస్‌బుక్‌ 16 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇలా ఫేస్‌బుక్‌ ఒక్కొక్క కంపెనీని కొనుగోలు చేస్తున్న క్రమంలో దాని కన్ను ‘స్నాప్‌చాట్‌’పై పడింది. అయితే ఫేస్‌బుక్‌ ప్రకటించిన ఆఫర్‌ ధరను స్నాప్‌చాట్‌ తిరస్కరించింది. 2016 చైనా సామాజిక మాధ్యమం ‘టిక్‌ టాక్‌’ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సులభంగా ఎడిటింగ్‌, నచ్చిన మ్యూజిక్‌తో పోస్టులు పెట్టే  ఫీచర్లతో రావడం వల్ల ఈ కంపెనీ తొందరగా వీక్షకుల అభిమానం చూరగొంది. అయితే ఈ కంపెనీ అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు సరిగా లేవనే కారణంగా చాలా దేశాలు దీన్ని నిషేధించాయి. అయినప్పటికీ టిక్‌టాక్‌ హవా కొనసాగుతూనే ఉంది.

విమర్శల పాలూ ఎక్కువే

సామాజిక మాధ్యమాలు ఎంత తొందరగా పాపులర్‌ అయ్యాయో.. అంతే త్వరగా విమర్శల పాలయ్యాయి. డేటా చౌర్యం, విద్వేషపూరిత ప్రసంగాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, ఎన్నికల ఫలితాల తారుమారు, తప్పుడు సమాచార వ్యాప్తితో అవి చేటు చేస్తున్నాయనే ఆరోపణలు తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాల కారణంగా అనేక సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకుంటే వార్తలు, షాపింగ్‌, బిజినెస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర వ్యాపార రంగాలకు సామాజిక మాధ్యమాలు ఉపయోగకరంగా ఉంటాయని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని సంగతులు..

  • ప్రపంచవ్యాప్తంగా 4.48 బిలియన్ల ప్రజలు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు.
  • ఒక్కో సామాజిక మాధ్యమ వినియోగదారుడు సగటున 6.6 వేర్వేరు సామాజిక మాధ్యమాలను వాడుతున్నాడు.
  • సామాజిక మాధ్యమాలు వాడేందుకు దాదాపు 99 శాతం మంది తమ మొబైల్‌ను, 1.32 శాతం మంది డెస్క్‌ డాప్‌ను ఎంచుకుంటున్నారు.
  • ఓ వ్యక్తి 16 ఏళ్ల వయసులో సామాజిక మాధ్యమంలో అడుగుపెట్టి..  70 సంవత్సరాలు జీవించాడనుకుంటే అతని సామాజిక మాధ్యమ జీవిత కాలం 5.7 సంవత్సరాలు.
  • ఫేస్‌బుక్‌కు 2.9 బిలియన్‌, యూట్యూబ్‌కు 2.3 బిలియన్‌, వాట్సప్‌కు 2 బిలియన్‌, ఎఫ్‌ బీ మెసేంజర్‌కు 1.3 బిలియన్‌, వీ చాట్‌కు 1.2 బిలియన్ల యాక్టివ్‌ యూజర్లున్నారు.
  • అమెరికాలో 72.3 శాతం (అంటే అక్కడి జనాభాలో 24 కోట్ల మంది) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
  • రోజుకు 500 మిలియన్ల మంది ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ను వాడుతున్నారు.
  • వాట్సప్‌, ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ కలిపి రోజుకు 60 బిలియన్ల సందేశాలను చేరవేస్తున్నాయి.
  • యూట్యూబ్‌లో నిమిషంలో 300 గంటల వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని