Heavy bicycle : ఔరా బాహుబలి సైకిల్‌.. తొక్కుకుంటూ పోవాలె!

‘లోకో భిన్న రుచి’ అంటుంటారు. సైకిల్‌(Cycle) ఎల్లప్పుడూ ఒకే విధంగా ఎందుకు కనపడాలి? దాని టైర్లు(Tyre) పెద్దగా ఉంటే ఏమవుతుంది? ఇలా తన మొదడులో ఉదయించిన రకరకాల ప్రశ్నలతో ఓ వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్‌(world heaviest bicycle) తయారు చేశాడు.

Updated : 29 Mar 2023 16:05 IST

(Image : Facebook)

ఇటీవల జర్మనీ(Germany)లోని డుసెల్డోఫ్‌ పట్టణంలో ‘సైక్లింగ్‌ వరల్డ్‌ బైక్‌ షో’ నిర్వహించారు. వివిధ రకాల సైకిళ్ల(Cycles)ను అందులో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఓ బుల్డోజర్‌ పరిమాణంలో ఉన్న ‘క్లైన్‌ జొహన్నా’ అనే పేరు గల సైకిల్‌(Cycle) మాత్రం సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. ఏంటి దాని ప్రత్యేకతలు? ఎవరు తయారు చేశారో తెలుసుకోండి.

42 గేర్లు.. బరువు 2177 కేజీలు

‘క్లైన్‌ జొహన్నా’ 2177 కేజీల బరువుంది. అంటే ఇది దాదాపు ఓ సెడాన్‌ కారు(Car)తో సమానం. గతంలోనూ ఇలా భారీ పరిమాణంలో రూపొందించిన సైకిళ్లు రోడ్డెక్కాయి. కానీ అవేవీ దీనంత బరువు లేవు. ఇందులో ఉపయోగించిన వస్తువులన్నీ తుక్కు దుకాణం నుంచి తెచ్చారు.  ఈ సైకిల్‌ 5 మీటర్ల పొడవు, 2 మీటర్ల ఎత్తు ఉంది. ముందు, వెనుక వైపు కలిసి రెండు భారీ టైర్లు, మధ్యలో ఒక మీడియం టైరును సపోర్టుగా అమర్చారు. దీన్ని పెడల్‌తో ఎలా కదిలిస్తారనే ప్రశ్న మీకు రావచ్చు.సైకిల్‌ సులువుగా కదిలేందుకు ఒక ట్రక్‌ గేర్‌ బాక్సును, సాధారణ గేర్‌ సైకిల్‌ వ్యవస్థతో అనుసంధానం చేశారు. ముందుకు కదపాలంటే ఏకంగా 35 గేర్లు వాడాలి. అలాగే వెనక్కి మళ్లాలంటే 7 గేర్లు ఉపయోగించాలి. ఇంత కష్టపడి తయారు చేసిన ఈ సైకిల్‌పై ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణిస్తే దీని గొప్ప ఏముంటుంది చెప్పండి. అందుకే దీనికి 15 టన్నుల్లోపు బరువైన వాహనాలు ఏవి కట్టినా సునాయాసంగా లాగవచ్చని ఈ బాహుబలి సైకిల్ రూపకర్త సెబాస్టియన్‌ తెలిపాడు. ఈ సైకిల్‌కు లోపల ఓ ఇంజిన్‌ కూడా ఉంది. అయితే అది ఆల్టర్నేటర్‌ తిరగడానికి మాత్రమే సహాయం చేస్తుంది. ఆ శక్తితో మొబైల్‌ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఇక వేగం విషయానికి వస్తే ఇది మనుషుల మామూలు నడక కంటే తక్కువనే చెప్పవచ్చు. అయినా ఈ వేగంతో బాల్టిక్‌ సముద్రం వరకు వెళ్లాలని యోచన చేస్తున్నట్లు సెబాస్టియన్‌ తెలిపాడు. అందు కోసం ఈ వేసవిలో అతడు 389 కిలోమీటర్ల ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు. ‘క్లైన్‌ జొహన్నా’ను ప్రపంచంలోనే అత్యంత బరువైన సైకిల్‌గా ‘రికార్డ్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ జర్మనీ’ గుర్తించింది. ఇది ఆ దేశంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో సమానం.

కఠిన శ్రమకు ఫలితం

ఈ బాహుబలి సైకిల్ రూపకర్త సెబాస్టియన్‌ బ్యూట్లర్‌ మామూలోడు కాదు. జర్మనీలోని కోథెన్‌ పట్టణానికి చెందిన ఈయన బాల్యంలోనే తుక్కు దుకాణంలో దొరికే వ్యర్థాలతో సైకిల్‌ తయారు చేసి అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. తర్వాత నుంచి అనేక ఆవిష్కరణల వైపు అతడి అడుగులు పడ్డాయి. 2011 ఒకసారి సెబాస్టియన్‌ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ సమయంలోనే ఓ అసాధారణ ఆవిష్కరణ చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. చాలా ఏళ్ల నుంచి ఒక బాహుబలిలాంటి సైకిల్‌ను రూపొందించాలనే కోరిక ఆయన మనసులో ఉండేది. అంతే మూడేళ్ల పాటు శ్రమించి ‘క్లైన్‌ జొహన్నా’ను తీర్చిదిద్దాడు. ఈ ప్రాజెక్టు కోసం తన జీవితంలో 2500 గంటలు కేటాయించాడు. ఇలా పనిచేస్తుంటే తాను ఏమైపోతాడోనని ఒకానొక దశలో సెబాస్టియన్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు కంగారు పడ్డారు. చేస్తున్న పనిని అంతటితో ఆపేయమని కోరారు. కానీ అతడు వినలేదు. ఆ కఠోర శ్రమకు ఫలితమే నేడు కన్పిస్తున్న బాహుబలి సైకిల్‌. లిథువేనియాకు చెందిన ఓ సైకిల్‌ను ప్రపంచంలోనే అత్యంత భారీ సైకిల్‌గా 2016లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. దాని బరువు 1385 కేజీలు. సెబాస్టియన్‌ రూపొందించిన ‘క్లైన్‌ జొహన్నా’కు త్వరలో ఆ ఘనత దక్కే అవకాశం ఉందంటున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని