DNA : ఎక్కడ వెతికినా మానవుల ‘ఈడీఎన్‌ఏ’.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
అమెరికాలోని (America) యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డప్ఫీ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జన్యు, పర్యావరణ, సముద్ర జీవ శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి ఓ పరిశోధన (Research) నిర్వహించారు. ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల మానవుల డీఎన్‌ఏ (DNA) ఆనవాళ్లున్నట్లు వారు కనుగొన్నారు.
ఓ కొత్త పరిశోధనలో (Research) మానవుల డీఎన్‌ఏ (DNA) ఆనవాళ్లు వాతావరణంలోని ప్రతి చోటా ఉన్నట్లు తేలింది. అందుకోసం పరిశోధకులు నీరు, ఇసుక, మట్టి, గాలి నుంచి నమూనాలు (Sample) సేకరించారు. వాటిని విశ్లేషించగా సంబంధిత డీఎన్‌ఏల వంశం, లింగం, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో విషయాల గురించి తెలిసింది.
శరీరంలోని ప్రతి కణంలోనూ డీఎన్‌ఏ ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది. దాన్ని విశ్లేషించి ఆ వ్యక్తి లేదా ప్రాణి పరిణామ క్రమాన్ని తెలుసుకోవచ్చు. డీఎన్‌ఏ పరీక్ష చేయడానికి వైద్యులు, పరిశోధకులు మానవుల రక్తం, స్వాబ్, జీవాణువులను సేకరిస్తారు. జంతువులకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. అయితే ఇలా సేకరించాల్సిన అవసరమే లేకుండా డీఎన్‌ఏ ఆనవాళ్లు వాతావరణంలో కన్పిస్తున్నాయి. అనేక ఏళ్లుగా మానవులు వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కారణంగా నీరు, గాలి, మట్టి, ఇసుక ఇలా ప్రతి చోటా నమూనాలు దొరుకుతున్నాయి.
పర్యావరణ డీఎన్‌ఏ
పర్యావరణంలో డీఎన్‌ఏ నమూనాలు కలిసిపోవడాన్ని ఎన్విరాన్‌మెంటల్ డీఎన్‌ఏ లేదా ‘ఈడీఎన్‌ఏ’ అని సంబోధిస్తారు. జీవ వైవిధ్యాన్ని, వన్యప్రాణుల సంచారాన్ని, వ్యాధుల పరిణామ క్రమాన్ని గుర్తించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈడీఎన్‌ఏను సేకరించే విధానాన్ని అనుసరిస్తున్నారు. దాంతో అరుదైన, అంతరించిపోతున్న జీవుల గురించి తెలుసుకున్నారు. ఈ పద్ధతి లేకుంటే అనేక విషయాలను కనుక్కోవడం వారికి కష్టంగా ఉండేది. పైగా డీఎన్‌ఏ టెస్టులు చేస్తామంటే.. మానవులు సాధారణంగా అంగీకరించరు. పరిశోధకులు ఈడీఎన్‌ఏ పరికరాలను కేవలం వారు పరిశోధన చేస్తున్న జీవుల నమూనాలు సేకరించడం కోసమే వినియోగిస్తారు. అయితే మానవ సంచారం అధికం కావడం వల్ల ఈడీఎన్‌ఏ సేకరిస్తున్న ప్రతి చోటా మనుషుల డీఎన్‌ఏ బయటపడుతోంది. దగ్గు, తుమ్ము, మల, మూత్ర విసర్జనల కారణంగా అవి పర్యావరణం అంతటా వ్యాపించాయి.
తాబేలుపై పరిశోధన చేయగా..
వాస్తవానికి ఈ బృందం తొలుత అంతరించిపోతున్న ఓ సముద్ర తాబేలు, దానికి సోకే ట్యూమర్ గురించి అధ్యయనం చేసింది. తీరంలో పుట్టిన తాబేలు పాకుతూ సముద్రంలోకి వెళ్లే సమయంలో కొన్ని డీఎన్‌ఏ ఆనవాళ్లను వదిలి వెళ్తున్నట్లు వారు గుర్తించారు. ఆ ఆనవాళ్లలో తాబేళ్లకు సోకే వైరస్‌లు, వ్యాధుల తాలుకా డీఎన్‌ఏ లభించింది. తాబేలును నీటిట్యాంకులో ఉంచి అందులోని కొంత నీటిని బయటకు తీసి పరిశోధన చేసినా ఇదే తరహా సమాచారం లభిస్తుందట.
దాంతో పరిశోధకులు ఓ అడుగు ముందుకేసి ఫ్లోరిడాలోని వివిధ ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు. సముద్రం, నదులు, గ్రామాలు, పట్టణాలు, మానవ సంచారం లేని బీచ్‌లు, మారుమూల ద్వీపాలు ఇలా అన్నింటినీ జల్లెడ పట్టారు. మారుమూల ద్వీపాల్లో తప్ప అన్ని చోట్లా వారికి మానవుల డీఎన్‌ఏ దొరికింది. అవి విశ్లేషించడానికి, పరిణామక్రమాన్ని తెలుసుకోవడానికి అనువుగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఐర్లాండ్‌లోనూ ఇలాంటి పరిశోధనే చేయగా మారుమూల పర్వతం, నదుల ప్రారంభ స్థానంలో తప్ప మిగిలిన ప్రదేశాల్లో మానవుల డీఎన్‌ఏ లభించిందట. కేవలం బయటి ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఇండోర్‌లోనూ నమూనాలు సేకరించారు. ఓ పశు వైద్యశాల గదిలోని గాలి నుంచి నమూనాలు తీసుకొని విశ్లేషించగా అందులో మనుషుల డీఎన్‌ఏ, పశువుల డీఎన్‌ఏ, వాటికి వచ్చే వైరస్‌ల డీఎన్‌ఏ బయటపడింది.
నైతికత ప్రశ్నార్థకం
పర్యావరణ డీఎన్‌ఏ సేకరణ విధానం పరిశోధనల వరకు బాగానే ఉన్నా దాని నైతికత గురించి ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈడీఎన్‌ఏ సేకరణకు సమ్మతి ఉందా? అందులో బయట పడిన సమాచారం ఇతరులకు తెలియకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వ్యక్తుల గోప్యతకు భంగం వాటిల్లుతుందేమో? ఇలా రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అందుకోసం కొన్ని నియమ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరముందని కొందరు వాదిస్తున్నారు.
అయితే తాము సేకరించిన ఈడీఎన్‌ఏల నమూనాలను సరిగ్గా వినియోగించుకుంటే పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రాచీన మానవుల గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. జీవ శాస్త్రవేత్తలు క్యాన్సర్ వంటి వ్యాధుల మ్యూటేషన్ల గురించి, పోలీసులు నేరస్థుల చిట్టా తయారు చేయడానికి కూడా ఈ పరిశోధన తోడ్పడుతుందని అంటున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eatela rajender: పొంగులేటి.. జూపల్లి నాకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు: ఈటల
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్‌ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు