China : చైనాలో పెరుగుతున్న ‘లేయింగ్‌ డౌన్‌ ’కల్చర్.. లీ షు జీవితం ఓ ఉదాహరణ!

చైనాకు (China) చెందిన ఓ 29 ఏళ్ల యువకుడు పనీపాట లేకుండా ఓ టెంటులో జీవనం సాగిస్తున్నాడు. క్రమంగా పెరుగుతున్న ఈ సంస్కృతిని అక్కడ ‘లేయింగ్‌ డౌన్‌’ (Lying down) కల్చర్‌ అని పిలుస్తున్నారు. 

Updated : 21 May 2023 12:22 IST

చైనాలో (China) నిరంతరం పని ఒత్తిడి (Work pressure) అక్కడి యువతలో విపరీతమైన మార్పు తీసుకొస్తోంది. వారాంతాల్లో ప్రశాంతత కోసం ప్రార్థనా మందిరాలకు (Temple tourism) వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కొందరు ఏకంగా పని మానేసి విశ్రాంతి తీసుకోవడం (Lying down) మొదలుపెట్టారని తాజాగా ఓ యువకుడి ఉదంతం వెల్లడిస్తోంది. అదేంటో తెలుసుకోండి.

పని మానేసి విశ్రాంతి

దేశ ప్రజలంతా నిరంతరం శ్రమించడంతో గతంలో చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. దాంతో ఆ దేశ జీడీపీలో ఏటా వృద్ధి కనిపిస్తూ ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పని చేయడానికి విముఖత వ్యక్తం చేసే వారి సంఖ్య అక్కడ పెరిగిపోతోంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, ప్రశాంతంగా జీవించడంపై దృష్టి సారిస్తున్నారు. అందుకు లీషు అనే యువకుడి జీవితమే ఉదాహరణ. సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన లీ షు వయసు 29 ఏళ్లు. 2018లోనే తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత నుంచి ఏ పని చూసుకోకుండా అద్దె ఇంట్లో ఉంటూ ఎక్కువ సమయం సుఖంగా గడపడానికి వెచ్చించాడు. దాంతో అతని వద్ద ఉన్న డబ్బులన్నీ మంచినీళ్లలా ఖర్చయ్యాయి. ఇలా అయితే తాను మళ్లీ భవిష్యత్తులో ఉద్యోగం చేయాల్సి వస్తుందని భయపడి ఖర్చు తగ్గించుకోవడం మొదలుపెట్టాడు. అలా రోజుకు 10 యువాన్‌లు అంటే 1.5 డాలర్లతోనే నెట్టుకురావడం అలవాటు చేసుకున్నాడు.

పార్కింగ్‌ యార్డుకు మకాం

తాను దాచుకున్న నగదు మొత్తం తరిగిపోవడంతో లీషుకు అద్దె చెల్లించడం భారంగా మారింది. అందుకే ఆ ఇంటిని ఖాళీ చేశాడు. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తాన్ని 400 యువాన్లకు వేరొకరికి విక్రయించాడు. ఆ నగదు తీసుకొని సమీపంలోని పార్కింగ్‌ యార్డుకు మకాం మార్చాడు. అప్పటికే ఆ ప్రాంతం నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయింది. అందులో ఒక చోట చదును చేసుకొని ఓ చిన్నపాటి గుడారం వేసుకున్నాడు. తన ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించని ప్రాంతం అదేనని భావించి గత 200 రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నాడు. అలా జీవించడంలోనే ప్రశాంతత ఉందని, మళ్లీ తనకు ఉద్యోగం చేసే ఆలోచనే లేదని ఖరాఖండీగా చెబుతున్నాడు.

మార్పు చూసి విస్మయం

లీషు జీవన విధానం చూసి అతని స్నేహితులు, బంధువులు ఆశ్చర్యపోతున్నారు. సెకండ్‌ హ్యాండ్‌ టెంట్‌ మాత్రమే ఇప్పుడు అతని వద్ద ఉన్న విలువైన ఆస్తి. చౌకగా దొరికే నూడుల్స్‌, డంప్లింగ్స్‌ తింటూ కాలం గడుపుతున్నాడు. రుచిగా తినాలనిపిస్తే ఎప్పుడైనా ఒకసారి తన వద్దనున్న స్టవ్‌ వెలిగించి బీఫ్‌, బంగాళ దుంప పాన్‌ కేక్‌ వండుకుంటాడు. కొంత దూరం నడిచి వెళ్లి తాగు నీరు తెచ్చుకుంటాడు. అక్కడే ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకొని వస్తాడు. ఈ వయసులో నీకు ఇదేం ఖర్మ అని ఎవరైనా ప్రశ్నిస్తే తాను ఎంచుకున్న జీవితంతో చాలా సంతోషంగా ఉన్నానని జవాబిస్తున్నాడు. ‘ఇది నా ఎంపిక. జీవితంలో నెరవేరని లక్ష్యాల వెనుక పరిగెత్తడం ఆపినప్పుడే ప్రశాంతత లభిస్తుంది. మారిన పరిస్థితులకు అలవాటు పడుతాం. అప్పుడు కావల్సినంత విశ్రాంతి దొరుకుతుందని’ లీషు తనకు బోధపడిన తత్వం చెబుతున్నాడు.

సాధారణ జీవితంతో సంతృప్తి

‘లేయింగ్‌ డౌన్‌’ కల్చర్‌ పాటిస్తున్న లీషు గురించి తెలిసి పలువురు మీడియా ప్రతినిధులు అతడి వద్దకు వెళ్లారు. ఇప్పుడు కూడా ఏదైనా ఉద్యోగం తెచ్చుకునే శక్తి సామర్థ్యాలు తనకున్నాయని, కానీ అలాంటి ప్రయత్నాలు చేసే ఉద్దేశమే లేదని లీ వారితో చెప్పాడు. మంచి ప్రాంతంలో బస ఏర్పాటు చేయిస్తామని అతని స్నేహితులు చెప్పినా వెళ్లేందుకు నిరాకరించాడు. ఏదైనా వ్యాపారం చేయడానికి నగదు సాయం చేస్తామన్నా ఇష్టపడలేదు. తనకు అవేవీ అక్కర్లేదని, చాలా సాధారణ, పొదుపైన ఈ జీవన విధానంతో సంతృప్తి చెందుతున్నానని స్పష్టం చేశాడు.

తాను నివాసం ఉంటున్న గుడారం వద్ద లీ ఒక నోట్‌ పెట్టాడు. తనకు ఉన్న ఒక్కగానొక్క ఆస్తి ఇదేనని, దాన్ని గౌరవించాలని ఆ స్థల యజమానులను అందులో కోరాడు. ఇక్కడ కొనసాగడం వల్ల అసౌకర్యం కలిగించినట్లయితే క్షమించాలని, సమయం ఇస్తే వేరొక చోటుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. మొత్తానికి లీ కథ అక్కడ పెరుగుతున్న ‘లేయింగ్‌ డౌన్‌’ సంస్కృతికి అద్దం పడుతోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని