ఈ దుర్గా మండపంలో అమ్మవారెక్కడంటే..

కోల్‌కతా, బెహాలా ప్రాంతంలోని బరిషా క్లబ్‌ దుర్గా పూజ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్న దుర్గాదేవి విగ్రహం ఆదర్శవంతంగా ఉంది.

Published : 16 Oct 2020 17:59 IST

కోల్‌కతా: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు గత్యంతరం లేక తమ స్వగ్రామాలకు చేరేందుకు వందల కిలోమీటర్లు నడిచారు. ఈ క్రమంలో వారు పడ్డ కష్టనష్టాలు ఇంకా మానని గాయాలుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి దసరా పండగకు కోల్‌కతా, బెహాలా ప్రాంతంలోని బరిషా క్లబ్‌ దుర్గా పూజ కమిటీ ఏర్పాటు చేస్తున్న దుర్గాదేవి విగ్రహం వారి కష్టాలకు ప్రతిరూపంగా నిలవనుంది.

చీర కట్టులో బిడ్డను ఎత్తుకుని ఉన్న ఓ సాధారణ స్త్రీ.. ఆమె వెంట మరో ఇద్దరు బాలికలు నడుస్తూ ఉన్నట్టు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. వీరు పదిచేతులు కలిగి ఖాళీగా ఉన్న ఓ వలయాకారం వద్దకు  వెళుతూ.. ఆగి వెనకకు చూస్తున్నట్టుగా విగ్రహం ఉంది. అయితే ఈ ఏర్పాటులో దుర్గాదేవి ఎక్కడ అని ప్రశ్నించే వారికి.. ఈ కార్మిక మాతే ఆ అమ్మవారు అని దీనిని రూపొందించిన కళాకారుడు రింతూ దాస్‌ వివరించారు.  
లాక్‌డౌన్‌ సమయంలో తాను గమనించిన కార్మిక మహిళల్లో దైవత్వం కనిపించిందని, ఆ ప్రేరణతోనే తాను ఈ వైవిధ్యమైన దుర్గా మూర్తిని రూపొందించానని ఆయన తెలిపారు. ఆ మహిళల్లో తాను దుర్గాదేవిని చూశానని అయన వెల్లడించారు. ‘శక్తికి మరో రూపమే దుర్గా దేవి అంటారు. ఆ విధంగా చూస్తే.. ఎర్రటి ఎండను, ఆకలిని ఎదిరించి ఓ తపస్సులా తన పిల్లలతో కలసి గమ్యం వైపు సాగుతున్న ఈ మాతృమూర్తే దుర్గాదేవికి నిజమైన ప్రతిరూపమని’ పలువురు అభిప్రాయపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని