భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలసిరులు

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు చెరువులు మత్తడి దూకుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు సందడి...

Published : 18 Aug 2020 11:20 IST

హైదరాబాద్‌: గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తెలంగాణలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులు, చెక్‌డ్యాంలు నిండుకుండను తలపిస్తున్నాయి. పలు చెరువులు మత్తడి దూకుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు సందడి చేస్తున్నారు. చేపల వేటతోపాటు.. జల సవ్వళ్లు చూస్తూ ఆనందంగా గడుపుతున్నారు. భారీ వర్షాలతో ఈ ఏడాది పంటలకు నీళ్లు పుష్కలంగా అందుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

వికారాబాద్‌ జిల్లాలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోయాయి. అలుగు పారుతూ రైతుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురిసాయి. దీంతో కోదాడ పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. జల దృశ్యాలను చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేశారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్ధన్నపేట పరిధిలోని కోనారెడ్డి చెరువులో నీరు ఎగసి పడుతోంది. కాకతీయుల నాటి పురాతన చెరువు ఎన్నో ఏళ్ల తర్వాత అలుగు పారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేపల వేటకు స్థానికులు పోటీ పడ్డారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం రామప్ప సరస్సు జలకళ సంతరించుకుంది. 

సిద్దిపేట జిల్లాలో కూడవెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చందాపూర్‌ గ్రామంలో దుబ్బాక-గజ్వేల్‌ వెళ్లే మార్గంలో పాత వంతెనపై నుంచి వరద నీరు దూకుతోంది. సిద్దిపేటలో కోమటి చెరువు నిండి మత్తడి దూకుతోంది. దీంతో పట్టణవాసులు చెరువును చూసేందుకు తరలి వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. చింతల చెరువు, ఎర్రచెరువు, నర్సాపూర్‌ చెరువు నిండు కుండను తలపిస్తున్నాయి. 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. బోధన్‌ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే బెల్లాల్‌ చెరువు నిండుకుండను తలపిస్తోంది. అలుగు పారుతూ అటుగా వెళ్తున్న వారిని కనువిందు చేస్తోంది. మరోవైపు కామారెడ్డి పెద్ద చెరువు మత్తడి దూసుకుండగా పిల్లలు, పెద్దలు అక్కడికి వెళ్లి సందడి చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌కొండాపూర్‌ చెరువు పొంగిపొర్లుతోంది. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ జోరు వానలు కురిసాయి. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి జలాశయంలోని భారీగా వరద వస్తుండటంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. మంచిర్యాల జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని బైపాస్‌ రోడ్డు మార్గంలో రాళ్లవాగు కాజ్వేపై నుంచి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని