Amaravati: అవన్నీ నకిలీ ఓట్లు కాబట్టే ఎవరూ ఫిర్యాదు చేయలేదు: ఏపీ సీఈవో

ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షల నకిలీ ఓట్లను తొలగిస్తే ఒక్క ఫిర్యాదూ రాలేదని ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అవన్నీ డూప్లికేట్‌ ఓట్లు కాబట్టే ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు..

Updated : 19 Jun 2023 20:10 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షల నకిలీ ఓట్లను తొలగిస్తే ఒక్క ఫిర్యాదూ రాలేదని ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈవో)ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అవన్నీ డూప్లికేట్‌ ఓట్లు కాబట్టే ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు రానున్న తరుణంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటరు కార్డుకు ఆధార్ కార్డును ఇంకా జత చేయలేదని.. కేవలం ఆధార్ సమాచారం మాత్రమే తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

‘‘ప్రతీ ఏడాది ఓటర్ల జాబితా ప్రకటించే సమయంలో సాధారణంగా ఓటర్లలో 1 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దేశిత సంఖ్యలో ఓటర్లు ఉండాలి. కానీ ఏపీలో 3-4 శాతం మేర పెరుగుదల ఉండటం గుర్తించాం. అందుకే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఒకే ఫొటోతో ఉన్న 15 లక్షల మంది ఓటర్లను గుర్తించాం. 2022లో 10 లక్షల మందిని గుర్తించి జాబితా నుంచి తొలగించాం. డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగించాం. ఓట్ల తొలగింపుపై చాలా కథనాలు వచ్చాయి. కానీ దాని వెనుక ఈ తరహా కారణాలున్నాయి. ప్రస్తుత డేటా ప్రకారం పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించటం అన్నది అవాస్తవం. ఓటర్ల జాబితాను సవ్యంగా రూపొందించాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశం.

1.62 కోట్ల ఇంటి నంబర్లు రాష్ట్రంలో ఉన్నాయి. వాటిలో 3.98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 50 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇంటి నంబర్లు 2,100 వరకు ఉన్నాయి. ఇలా ఉన్న ఇళ్లను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉండొచ్చు. అలాగే కావాలని చేసినవి కూడా ఉండొచ్చు. అక్టోబర్ 15 నాటికి తదుపరి ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేస్తాం. ఆ సమయానికి ఈ తరహా పొరపాట్లు లేకుండా జాబితాను రూపొందించి విడుదల చేస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోనూ ఈ తరహాలోనే జరిగిందని భావిస్తున్నాం. ఉరవకొండలో నియోజకవర్గంలో కావాలని ఓట్లు తొలగించిన ఇద్దరు బీఎల్ఓలను సస్పెండ్ చేశాం. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు వీల్లేదు. దీనిపై ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది’’ అని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని