Ap High court: ఆదేశాలు అమలు చేయకపోతే జైలుకు పంపుతాం.. విద్యాశాఖ అధికారులకు హైకోర్టు వార్నింగ్‌

కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని విద్యాశాఖ అధికారులను ఏపీ హైకోర్టు హెచ్చరించింది.

Updated : 01 May 2023 19:51 IST

అమరావతి: ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 25 శాతం కోటా కింద ప్రవేశం కల్పించిన విద్యార్థుల జాబితా ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.

ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25శాతం సీట్లు కేటాయించాలని 2022లో హైకోర్టు తీర్పు వెలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు అమలు చేయట్లేదని ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాది యోగేశ్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఏడాది విద్యాసంస్థల్లో 90వేల సీట్లు కేటాయించాల్సి ఉండగా.. కేవలం 9,064 మందికే సీట్లు కేటాయించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో కూడా 85వేల సీట్లకు గానూ 2,001 మందికే సీట్లు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సరిగా ఫలాలు అందట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఇప్పటివరకు పేద విద్యార్థులకు ఎన్ని సీట్లు కేటాయించారనే వివరాల జాబితాను తమ ముందు ఉంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే అవసరమైతే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తూ.. తదుపరి విచారణను జూన్‌ 7కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని