సజీవ చైతన్య క్రాంతి.. సంక్రాంతి

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ సంక్రాంతి. తెలుగువారంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరపుకొనే సజీవ చైతన్య క్రాంతి సంక్రాంతి............

Updated : 16 Jan 2020 04:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ సంక్రాంతి. తెలుగువారంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరపుకొనే సజీవ చైతన్య క్రాంతి సంక్రాంతి. ప్రేమ, ఆప్యాయతల కలబోతతో విలసిల్లే అద్భుత సమయం, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు పంచే సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్లలో కనిపించే సందడి చూసి తీరాల్సిందే.
సంక్రాంతి అంటే... 
సంక్రాంతి అంటే సంక్రమణం.. అంటే మార్పు. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉండే సూర్యుడు భోగి తర్వాత రోజు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దాన్నే మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ఒక్కోరాశిలో ఉన్నప్పుడు ఒక్కో సంక్రాంతి వస్తుంది. అయినా పుష్యమాసం.. హేమంత రుతువులో చలిగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలో మారగానే వచ్చే సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ఇది ఉత్తరాయణం పుణ్యకాలం. ఈ సమయంలోనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయన్నది పురాణాల కథనం. అందుకే మకర సంక్రాంతి విశిష్టమైనది. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని మకర సంక్రమణం వరకు వాయిదా వేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో పరమపదించాడని మహా భారతం చెబుతోంది. సంక్రాంతి సమయంలో చేసే దానధర్మాలు స్వర్గలోకంలో స్థానం కల్పిస్తాయనేది పెద్దలు చెప్పే మాట.

ధనలక్ష్మీ ఇళ్లకు చేరుతుంది...

మకర సంక్రాంతి వేళ అన్నదాతల కష్టఫలమైన ధనలక్ష్మీ ఇళ్లకు చేరుతుంది. నట్టింట కొలువుతీరుతుంది. ఊరంతా ఆనందాన్ని పంచుతుంది. అనురాగ బంధాలు విరుస్తాయి. అందుకే ఈ పండుగ అన్ని పర్వదినాల కంటే మిన్న. సంక్రాంతిని మూడు రోజుల పండుగగా ఇప్పుడు జరుపుకొంటున్నా.. నిజానికి ఇది ఐదురోజుల వేడుక. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఏడాది పండుగ అనే ఐదు పేర్లతో చేసుకునే ఉత్సవం. 

పెద్దల పండుగ...

మకర సంక్రాంతి రోజున కొత్త ధాన్యంతో చేసిన పాయసం, పిండివంటలు దేవతలకు సమర్పించడం, పితృదేవతలను పూజించడం-వారికి వస్త్రాలు పెట్టడం తెలుగింట సంప్రదాయం. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని కనీసం కొన్ని రోజులైనా తిరిగి సాక్షాత్కరించే గొప్ప పండుగ ఇది. సంక్రాంతి వేళ హరిదాసుల రూపంలో శ్రీకృష్ణుడు వస్తాడని అంటుంటారు. అందుకే హరిదాసులకు సమర్పించే కానుకలు నేరుగా ఆ కృష్ణ పరమాత్ముడికి సమర్పించినట్లుగా భావిస్తారు. ఎత్తైన మోపురంలో శివలింగాకృతిని గుర్తుకుతెచ్చే గంగిరెద్దులు.. వాకిట్లో వేసిన ముగ్గులో నిలుచుంటే ఆ ప్రదేశం పావనమైనట్లుగా విశ్వసిస్తారు.

భూమాత సప్తవర్ణాలతో...

 

సంక్రాంతి పండుగ వేళ యువతులు పోటీలు పడి దిద్దే రంగవల్లులతో భూమాత సప్తవర్ణాలతో శోభిల్లుతుంది. ఇలా మహిళలు వేసే ముగ్గుల వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. ఆవు పేడతో కళ్లాపి చల్లడం వల్ల క్రిమి కీటకాలు ఇంట్లోకి రావు. బియ్యపు పిండితో వేసిన ముగ్గు చీమలకు ఆహారం. ముగ్గు మధ్యలో పెట్టి గౌరీమాత స్వరూపంగా భావించే గొబ్బెమ్మ కూడా క్రిమి సంహారిణి.

ముద్దుగొలిపే చిన్నారుల సందడి...

సంక్రాంతి వేళ పల్లెసీమల్లో జరిగే సంబరాలు మళ్లీ పండుగ వచ్చేదాక మదిలో నిలిచిపోతాయి. మిగిలిన రోజుల్లో కుటుంబ సభ్యులు ఏదేశంలో, ఏ ప్రాంతంలో ఉన్నా సంక్రాంతి రోజు మాత్రం ఒకచోట స్వగ్రామంలో కలవాల్సిందే. కొత్తబట్టలు కట్టుకొని ముద్దుగొలిపే చిన్నారులు ఇళ్లంతా తిరుగుతుంటే ఆ సందడే వేరు. పెద్దల ముచ్చట్లు, కొత్త అల్లుళ్ల సరదాలు, కొంటె మరదళ్ల అల్లర్లతో అంతటా ఉల్లాసమే.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని