మళ్లీ సోకుతోంది

కరోనా వైరస్‌ రెండోసారి వస్తుందా? ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. ఈ మహమ్మారి రెండోసారి కూడా సోకిన ఉదంతాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినట్లు హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించడం..

Published : 26 Aug 2020 10:13 IST

రెండోసారి కరోనా వైరస్‌ బారినపడటంపై కలకలం

హాంకాంగ్‌: కరోనా వైరస్‌ రెండోసారి వస్తుందా? ప్రస్తుతం అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. ఈ మహమ్మారి రెండోసారి కూడా సోకిన ఉదంతాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా గుర్తించినట్లు హాంకాంగ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించడం, నెదర్లాండ్స్, బెల్జియంలోనూ ఇలాంటి రెండు కేసులు వెలుగు చూసినట్లు వార్తలు రావడంతో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల స్పెయిన్‌ నుంచి హాంకాంగ్‌కు తిరిగొచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి రెండోసారి కరోనా సోకినట్లు హాంకాంగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త కెల్విన్‌ కాయ్‌ వాంగ్‌ చెప్పారు. అతడికి ఈ ఏడాది మార్చిలో ఒకసారి కొవిడ్‌ వచ్చిందన్నారు. తాజాగా అతడికి కరోనా వైరస్‌లోని మరో రకం సోకిందని చెప్పారు. జన్యుక్రమ విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. తొలిసారి ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు అతడిలో చాలా స్వల్ప లక్షణాలే కనిపించాయని, రెండోసారి ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు. హాంకాంగ్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్, టెస్టింగ్‌ సమయంలో యాదృచ్ఛికంగా ఇది బయటపడిందన్నారు. ‘‘దీన్నిబట్టి ఒకసారి ఈ వైరస్‌ బారినపడిన వారిలో కొందరికి జీవితకాలం పాటు దీని నుంచి రోగ నిరోధక రక్షణ ఉండదని స్పష్టమవుతోంది’’ అని చెప్పారు. సాధారణ జలుబు కలిగించే ఇతర కరోనా వైరస్‌ రకాలను ఇది గుర్తు చేస్తోందన్నారు. ఒకసారి సహజసిద్ధంగా ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్ల కానీ టీకా పొందడం ద్వారా కానీ రక్షణ పొందిన వారిలోనూ ఇది తిరిగి వ్యాపించొచ్చని తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ప్రచురణ కోసం ‘క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌’ జర్నల్‌ స్వీకరించింది. అయితే ప్రచురించలేదు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకూ నిలిపి ఉంచాలని కొందరు స్వతంత్ర నిపుణులు కోరారు. 

ఒకసారి కొవిడ్‌ బారినపడిన వారికి తిరిగి ఆ మహమ్మారి సోకుతుందా అన్నది కీలకంగా మారింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన కొందరు.. వ్యాధి లక్షణాలు పూర్తిగా నయమైన కొన్ని వారాల తర్వాత తిరిగి ‘పాజిటివ్‌’గా తేలుతున్న ఉదంతాలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. అయితే అది వారి శరీరాల్లో ఇంకా మిగిలి ఉన్న వైరస్‌ అవశేషాలు లేక ఇన్‌ఫెక్షన్‌ తిరగబెట్టిందా లేక అది కొత్తగా సోకిన ఇన్‌ఫెక్షనా అన్నదానిపై శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. ఒకసారి ఈ వ్యాధి సోకినప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. అవి వైరస్‌ను నాశనం చేస్తాయి. అలాంటివారికి రెండోసారి వ్యాధి బారినపడకుండా రోగ నిరోధక శక్తి ద్వారా రక్షణ ఉంటుందా..? ఉంటే అది ఎంతకాలం కొనసాగుతుంది? వంటివి నిర్ధరించడం అవసరమైంది. టీకా అభివృద్ధి, ప్రజలు తమ పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం కావడానికి, పాఠశాలలు, సామాజిక కార్యక్రమాలను పునఃప్రారంభించడానికి ఈ వివరాలు కీలకం. 

తీవ్ర అనారోగ్యం ఉండకపోవచ్చు..?
రెండోసారి కరోనా సోకిన వ్యక్తికి తీవ్రస్థాయి అనారోగ్యం బారినపడకుండా రక్షణ ఉంటుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. తీవ్ర అనారోగ్యాన్ని కలిగించడానికి రెండోసారి సోకే వైరస్‌ ఎంత భిన్నంగా ఉండాలన్న దానిపై అస్పష్టత నెలకొంది. ‘‘హాంకాంగ్‌లో వెలుగుచూసిన కేసులో రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పటికీ.. లక్షణాలు కనిపించే స్థాయిలో వ్యాధిని కలిగించకుండా అతడి రోగ నిరోధక వ్యవస్థలోని మెమరీ కణాలు చర్య చేపట్టి ఉంటాయి. దీన్నిబట్టి ఒకసారి ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన వారికి తీవ్ర వ్యాధి నుంచి రక్షణ ఉండొచ్చు. ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా మాత్రం రక్షణ ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది’’ అని ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కోరీ స్మిత్‌ పేర్కొన్నారు. తొలిసారి కొవిడ్‌ వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నవారిలో సరిపడా యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోవచ్చని, అలాంటివారికి మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రావచ్చన్న విశ్లేషణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు జాగ్రత్తల విషయంలో అలసత్వం వహించకూడదని పరిశోధకులు తెలిపారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరని పేర్కొన్నారు. 

రీ-ఇన్‌ఫెక్షన్‌ అరుదు
కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి మళ్లీ అది సంక్రమించడం చాలా అరుదు అని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. హాంకాంగ్‌లో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన విషయం గురించి ఆయన స్పందిస్తూ.. ‘‘ఇందుకు రోగనిరోధక శక్తి, వైరస్‌ తీవ్రత, దాని మ్యూటేషన్‌ వంటి కారణాలుంటాయి. ఒకసారి వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత... మళ్లీ సోకడం చాలా అరుదు. మీజిల్స్‌ ఒకసారి వచ్చిపోయిన వారిలో దాన్ని జీవితాంతం అడ్డుకొనే యాంటీబాడీలు వృద్ధిచెందుతాయి. ‘అత్యంత అరుదైన’ సందర్భాల్లో తప్ప మీజిల్స్‌ రెండోసారి సోకిన దాఖలాల్లేవు. కొవిడ్‌ వచ్చి 7-8 నెలలే అవుతున్నందున... దాని నుంచి కోలుకున్నవారిలో వారి యాంటీబాడీలు ఎన్నాళ్లు ఉంటాయన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. దీని గురించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం. కానీ, దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని