Hyderabad: రాజేంద్రనగర్‌లో హైకోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు, మంత్రులు

తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 23 Dec 2023 21:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌ మండలంలో హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌ కుమార్ శావలి, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌, జస్టిస్ లక్ష్మణ్‌, జస్టిస్‌ విజయసేనారెడ్డితో కలిసి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు.

గత ప్రభుత్వం ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, దీనివల్ల ప్రజలకు తీరని ఇబ్బందులు కలిగాయని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు అందాల్సిన న్యాయ సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా హైకోర్టు భవనం నిర్మిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరిలో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. నూతన భవనం.. కక్షిదారులకు, న్యాయమూర్తులకు, న్యాయవాదుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా, అన్ని సౌకర్యాలతో హైకోర్టు నూతన భవన నిర్మాణం చేపడతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని