15 ఏళ్లకే.. ఎథికల్‌ హ్యాకర్‌

ఓ పదో తరగతి విద్యార్థి ఐటీ కంపెనీ ప్రారంభించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సంస్థ ద్వారా టెక్నాలజీ అంశాలపై శిక్షణనివ్వటంతోపాటు ఇతర కంపెనీలకూ హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పించే సేవలు అందిస్తానంటున్నాడు. ఓ కంపెనీలో ఐటీ అండ్ సెక్యూరిటీ అనలిస్టుగా పనిచేస్తూనే....

Published : 19 Apr 2021 01:20 IST

ఐటీ కంపెనీ ప్రారంభించే పనుల్లో బిజీ

పద్మారావునగర్‌: ఓ పదో తరగతి విద్యార్థి ఐటీ కంపెనీ ప్రారంభించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సంస్థ ద్వారా టెక్నాలజీ అంశాలపై శిక్షణనివ్వటంతోపాటు ఇతర కంపెనీలకూ హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పించే సేవలు అందిస్తానంటున్నాడు. ఓ కంపెనీలో ఐటీ అండ్ సెక్యూరిటీ అనలిస్టుగా పనిచేస్తూనే సొంత సంస్థ పెట్టాలనుకుంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన తనిష్క్‌ (15). పద్మారావునగర్‌కు చెందిన తనిష్క్‌కు సాంకేతిక అంశాలపై విపరీతమైన ఆసక్తి. ఈ క్రమంలోనే ఎథికల్‌ హ్యాకింగ్‌లో పట్టుసాధించి ‘వైట్‌ ఎటాకర్‌’గా సమాజానికి ఉపయోగపడాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోన్న తనిష్క్‌.. ఏడో తరగతి నుంచే రోబోటిక్స్‌, గ్రాఫిక్‌ డిజైనింగ్‌, వెబ్‌ డెవలపింగ్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌ వంటి అంశాలపై పట్టు సాధించాడు. ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారానే కోర్సులను నేర్చుకున్న ఈ బాలుడు రెండున్నరేళ్లలో హ్యాకింగ్‌లో మెళకువలు నేర్చుకున్నాడు. సైబర్‌ నేరగాళ్ల నుంచి రక్షించే వైట్‌ ఎటాకర్‌గా ఎదగాలనేది తన లక్ష్యమంటున్నాడు. ఇప్పటికే నాసా, కెనడీ స్పేప్‌ సెంటర్‌ను సందర్శించి హ్యాకింగ్‌లో తన వ్యక్తిగత ప్రాజెక్టును సమర్పించాడు.

మన వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలియకుండా, హ్యాకింగ్‌ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటున్నాడు తనిష్క్‌. హ్యాకింగ్‌కు ఎలా గురవుతామనే అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జరిగిన పోడల్‌ ఎటాక్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కే12 యాక్టివిటీ అకాడమీలో సబ్‌ రీజినల్‌ హెడ్‌గా తనిష్క్‌ పనిచేస్తున్నాడు. ఇక్కడ, ఐటీ అండ్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌గా సేవలందిస్తున్నాడు. హ్యాకింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించి సైబర్‌ నేరగాళ్ల నుంచి కాపాడాలన్నదే తన కోరిన అని తనిష్క్‌ పేర్కొంటున్నాడు. ఇందుకోసం ‘టీకే సొల్యూషన్‌’ పేరుతో కంపెనీ ప్రారంభించి రోబోటిక్స్‌, ఎథికల్‌ హ్యాకింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తూనే హ్యాకర్స్‌ నుంచి సంస్థలను రక్షించే సేవలందిస్తానని అంటున్నాడు.

క్లిష్టమైన సబ్జెక్టులో తనిష్క్‌ నిష్ణాతుడిగా ఎదగడంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిది. చిన్నప్పటి నుంచే ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌పై మక్కువ ఉండటంతో ఆ వైపుగా ప్రోత్సహించానని బాలుడి తండ్రి శ్రీనివాస్‌ తెలిపారు. హ్యాకింగ్‌లో తనిష్క్‌ పరిజ్ఞానం చూసి అందరూ అబ్బురపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని