Top 10 News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 05 Apr 2024 13:06 IST

1.  వర్క్‌.. వెల్త్‌.. వెల్ఫేర్‌.. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్య నేతలు సోనియా, రాహుల్‌ తదితరులు ‘న్యాయ్‌పత్ర’ పేరుతో దిల్లీలో మేనిఫెస్టోను ప్రకటించారు. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ: షర్మిల

ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. నాకెందుకు టికెట్ ఇవ్వలేదు: వేదికపై చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన పప్పూయాదవ్

బిహార్‌ (Bihar) రాజకీయాల్లో పప్పూయాదవ్ (Pappu Yadav) పేరు సుపరిచితమే. పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. తాజాగా తనకు టికెట్ దక్కలేదని ఏడ్చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ కన్నుమూత

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన.. చెరగని ముద్రవేశారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.  కచ్చతీవుపై రాజకీయ రగడ.. శ్రీలంక ఏమందంటే..?

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ భారత్‌లో కచ్చతీవు (Katchatheevu) ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంక (Sri Lanka)కు ఇచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్‌ దేవానంద స్పందించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6.  ఆ బ్యాంకుల బాటలోనే ఐడీఎఫ్‌సీ.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో కోత

 ప్రైవేటురంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (IDFC First Bank) తన క్రెడిట్‌ కార్డ్‌ రివార్డు ప్రయోజనాల్లో కీలక మార్పులు చేసింది. లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్లకు సంబంధించిన నిబంధనలను మార్చింది. మే 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌.. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్లలో ఇప్పటికే పరిమితులు విధించాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. అది భారత వ్యతిరేక ప్రచారం: విదేశీ వ్యవహారాల శాఖ

పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకేకు చెందిన పత్రిక కథనం రాయడంపై మన విదేశాంగశాఖ మండిపడింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు భారత్ ప్రభుత్వ విధానం కాదని పునరుద్ఘాటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం

ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే ‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును (Repo Rate) 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి  విధాన (RBI Monetary Policy) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. భవిష్యత్తులో జపాన్‌లో అందరికీ ఒకే ఇంటిపేరు..!

 ప్రస్తుతం అమల్లో ఉన్న కఠినతర వివాహ చట్టాలు కొనసాగితే భవిష్యత్తులో జపాన్‌(Japan)లో అందరికీ ఒకే ఇంటిపేరు వస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. పెళ్లి చేసుకొన్న జంటలు వేర్వేరు ఇంటి పేర్లను ఉంచుకునే హక్కును ఇవ్వకపోతే.. 2531 నాటికి జపాన్‌ ప్రజల పేర్ల చివర ‘సాటో’ అనేది మిగులుతుందని ఆ నివేదికలో పేర్కొంది. జపాన్‌లో 18వ శతాబ్ధంలో చేసిన సివిల్‌ కోడ్‌ చట్టం ప్రకారం దంపతులు ఇద్దరూ ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.  హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌!

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ (Israel) శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కార్యాలయం ఈ మేరకు ప్రణాళికలను వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని