IDFC First Bank: ఆ బ్యాంకుల బాటలోనే ఐడీఎఫ్‌సీ.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో కోత

IDFC First Bank: ప్రైవేటురంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ తన క్రెడిట్‌ కార్డ్‌ ప్రయోజనాల్లో కీలక మార్పులు చేసింది. లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్ల ప్రయోజనాల్లో కొత్త నిబంధనల్ని ప్రకటించింది.

Published : 05 Apr 2024 10:37 IST

IDFC First Bank | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రైవేటురంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (IDFC First Bank) తన క్రెడిట్‌ కార్డ్‌ రివార్డు ప్రయోజనాల్లో కీలక మార్పులు చేసింది. లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్లకు సంబంధించిన నిబంధనలను మార్చింది. మే 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌.. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్లలో ఇప్పటికే పరిమితులు విధించాయి. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కూడా తన క్రెడిట్‌ కార్డ్‌ ప్రయోజనాల్లో కోత విధించింది. ఈ విషయాన్ని ఇ- మెయిల్‌ ద్వారా కార్డ్‌హోల్డర్లకు తెలియజేసింది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ అందిస్తున్న క్రెడిట్‌ కార్డు సాయంతో ఆన్‌లైన్‌లో రూ.20,000 ఖర్చు చేస్తే ఆరు రెట్ల రివార్డు పాయింట్లు వచ్చేవి. మే 1 నుంచి అవి మూడు రెట్లకు తగ్గనున్నాయి. అయితే రూ.20 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 10 రెట్ల రివార్డు పాయింట్లను పొందొచ్చు. ఇక ఎడ్యుకేషన్‌, వాలెట్ లోడ్, ప్రభుత్వ సేవలకు సంబంధించిన లావాదేవీలపై రివార్డు పాయింట్లు మూడు రెట్లకు సవరించనుంది. ఐడీఎఫ్‌సీ అందిస్తున్న ఫస్ట్‌ ప్రైవేట్ క్రెడిట్‌ కార్డ్‌ మినహా అన్ని రకాల క్రెడిట్‌ కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

  • అలాగే, క్రెడిట్ కార్డ్‌తో చేసే గ్యాస్‌, కరెంట్‌ బిల్‌, ఇంటర్నెట్‌ వంటి యుటిలిటీ చెల్లింపులపై సర్‌ఛార్జి విధించనుంది. యుటిలిటీ బిల్లు చెల్లింపుల మొత్తం రూ.20 వేలు దాటితే 1 శాతం సర్‌ఛార్జితో పాటు జీఎస్‌టీ వసూలు చేయనుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేటు కార్డ్‌, ఎల్‌ఐసీ క్లాసిక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ఎల్‌ఐసీ సెలెక్ట్‌ క్రెడిట్ కార్డ్‌లపై యుటిలిటీ సర్‌ఛార్జ్‌ వర్తించవు.
  • కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో ఐడీఎఫ్‌సీ నిబంధనల్ని సవరించింది. ప్రస్తుత నెలలో ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే మునుపటి నెలలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.20వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్‌దారులకు ప్రతి త్రైమాసికానికి ఉచితంగా అందించే దేశీయ ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ సందర్శనల సంఖ్యను 4 నుంచి 2కు తగ్గించింది. ఇక ఫస్ట్‌ వెల్త్‌ క్రెడిట్‌ కార్డు యూజర్లకు దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్‌ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 4 నుంచి 2కు కుదించింది.
  • రెంట్‌ పే ఆప్షన్‌ జరిపే లావాదేవీలపై ఛార్జీలను పెంచింది. ప్రతి లావాదేవీకి రూ.249+ 18 శాతం జీఎస్టీ లేదా 1 శాతం+ 18 శాతం జీఎస్టీ ఏది ఎక్కువైతే దాన్ని విధిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని