Foreign Ministry: అది భారత వ్యతిరేక ప్రచారం: విదేశీ వ్యవహారాల శాఖ

భారత్‌ (India) ఇతర దేశాల్లోని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోందని యూకే పత్రిక పేర్కొనడాన్ని మన విదేశాంగశాఖ తప్పుపట్టింది. ఆ దాడులతో తమకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంది. 

Published : 05 Apr 2024 10:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకేకు చెందిన పత్రిక కథనం రాయడంపై మన విదేశాంగశాఖ మండిపడింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు భారత్ ప్రభుత్వ విధానం కాదని పునరుద్ఘాటించింది. గతంలో కూడా ఈ విషయంపై మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌ జైశంకర్‌ దేశ వైఖరిని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 

బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ పత్రిక భారత్‌పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూదిల్లీ లక్ష్యంగా చేసుకొందని పేర్కొంది. భారత విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్‌, పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథనం రాసినట్లు పేర్కొంది. 

న్యూదిల్లీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వ్యూహంలో భాగంగా యూఏఈలో స్లీపర్‌ సెల్స్‌ను ఏర్పాటు చేసుకుందని తెలిపింది. వారే ఈ హత్యలకు పథక రచన చేస్తున్నారని పాక్‌ అధికారులు చెబుతున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. వారే పాక్‌లోని స్థానిక నేరగాళ్లకు, పేదలకు లక్షల రూపాయలు చెల్లించి ఈ టార్గెట్‌ కిల్లింగ్స్‌ను అమలు చేస్తున్నారని రాసుకొచ్చింది. లష్కరే, జైషే ఉగ్ర సంస్థలకు చెందిన షాహిద్‌ లతీఫ్‌, రియాజ్‌ అహ్మద్‌ల హత్యల్లో భారత హస్తం ఉందంటూ ఇస్లామాబాద్‌ జనవరిలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్‌, రష్యాకు చెందిన కేజీబీ నుంచి భారత్‌ స్ఫూర్తి పొంది ఈ చర్యలకు దిగినట్లు యూకే పత్రిక వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని