Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Apr 2024 17:01 IST

1. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా

 సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఘటనకు సంబంధించి వివరాలు కోరినట్టు సమాచారం. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. చిలకలూరిపేటలో ప్రధాని సభ, సీఎం రోడ్‌ షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ సూచించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కొత్త నాటకానికి తెర: అచ్చెన్నాయుడు

ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్‌ కొత్త నాటకానికి తెరతీశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆరోపించారు. వివేకా హత్య, కోడికత్తి తరహాలో.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. దక్షిణ భారత్‌కూ బుల్లెట్‌ రైలు.. త్వరలో సర్వే : ప్రధాని మోదీ

దేశంలో బుల్లెట్‌ రైళ్ల (Bullet Trains)కు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక హామీ ఇచ్చారు. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్న ఆయన.. ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ ఈ రైళ్ల సేవలు విస్తరిస్తామన్నారు. వీటికి సంబంధించిన అధ్యయనం కూడా త్వరలోనే మొదలు కానుందని చెప్పారు. ‘సంకల్ప్‌ పత్ర’ పేరిట భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ₹లక్షన్నర వేతనంతో సెబీలో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వాయిదా

దేశంలో ఫైనాన్షియల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)లో ఉద్యోగాల భర్తీకి గత నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. వీటికి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 13నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజాగా అది వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్లికేషన్ల స్వీకరణను వాయిదా వేస్తున్నట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌  బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI) వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. విద్యుత్‌ వ్యవస్థను అల్లకల్లోలం చేసి.. మాపై విమర్శలా?: భట్టి

విద్యుత్‌ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్‌.. చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూ.10 వేల కోట్ల విద్యుత్‌ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. కెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

కెనడాలో చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు వెల్లడించారు. ‘‘కాల్పుల శబ్దం వినిపించినట్లు ఏప్రిల్‌ 12వ తేదీ రాత్రి 11గంటల సమయంలో ఈస్ట్‌ 55 అవెన్యూ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్లి చూడగా.. కారులో చిరాగ్‌ విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు’ అని వాంకోవర్‌ పోలీసులు ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఇరాన్ దాడి పరిస్థితులను సంక్లిష్టం చేస్తుంది: డెన్నిస్ ఫ్రాన్సిస్

జ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయడంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. ‘దాడి.. ప్రతిదాడుల విషవలయంలో ఈ ప్రాంతం కూరుకుపోవచ్చు. అనివార్యంగా మరిన్ని మరణాలు, బాధ తప్పకపోవచ్చు. ఇరాన్, ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళనగా ఉంది.’’ అని డెన్నిస్ పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్ల దాడి.. భారత్‌ ఏమందంటే..!

ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) డ్రోన్‌లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. దీంతో అక్కడున్న మన దేశ పౌరులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు జారీ చేసింది. టెల్‌అవీవ్‌-టెహ్రాన్‌ మధ్య శత్రుత్వం పెరగడంపై ఆందోళన చెందుతున్నట్లు న్యూదిల్లీలో విదేశాంగ శాఖ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అందుకే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయ్‌: అమర్త్య సేన్‌

ఐకమత్యం లేకపోవడం వల్లే భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్‌ (Amartya Sen) అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ (Congress) పార్టీకి అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. తప్పుడు హామీల పత్రం.. భాజపా మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ విమర్శలు

భాజపా లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను (BJP Manifesto) తప్పుడు హామీల పత్రంగా కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపారేసింది. గతంలో ఇచ్చిన హామీలనే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆరోపించింది. తాజాగా ‘సంకల్ప పత్ర’లో పేర్కొన్న గ్యారెంటీలన్నీ మోదీ తప్పుడు హామీలకు వారెంటీలని కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని