Top 10 News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 29 Jun 2023 09:03 IST

1. డొల్లమాటల జగన్‌!

మధ్యతరగతి కుటుంబాలకు అరచేతిలో సొంతింటిని చూపించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. వారి కలలను కల్లలు చేసేశారు. అదిగో.. ఇదిగో.. అంటూ హడావుడి చేసి ఉసూరుమనిపించి.. ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి కళ్లు గప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలోని ప్లాట్‌ ధరలో పది శాతాన్ని దరఖాస్తుదారుల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సర్కారు వారికి స్థలాలను ఎప్పుడు అప్పగిస్తుందో చెప్పలేని స్థితిలో ఉంది. ఆరు లేఅవుట్లలో విశాలమైన తారు, సిమెంట్‌ రోడ్లు కాదుకదా.. కనీస సదుపాయలూ కనబడడం లేదు. తొలుత పనులు ప్రారంభించిన ఏలూరు లేఅవుట్‌ ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా తయారైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

2. సీఎం హామీకి.. మంత్రి గండి..!

పెదలంక డ్రెయిన్‌పై రెగ్యులేటర్‌ నిర్మాణం వేలాది మంది రైతుల కల. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో టెండర్లు పిలిచారు. ఓ మంత్రి చక్రం తిప్పి పోటీ లేకుండానే టెండర్‌ దక్కేలా చేశారు. ఆరు నెలలు గడిచినా గుత్తేదారు ఒప్పందాలు చేసుకోలేదు. పైగా టెండర్లు రద్దు చేయించి.. అంచనాలు పెంచి మరోసారి టెండరు పిలిచేందుకు మంత్రితో మంత్రాంగం నడుపుతున్నారు. అంచనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్దం చేశారు. మరోవైపు ఈ మినీ బ్యారేజీ నిర్మాణం చేయకపోవడంతో ఎంతో మంది రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇంకో వైపు ఉప్పు నీటితో సాగు చేస్తున్న రొయ్యల వ్యాపారులు దీని నిర్మాణానికి వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నారు. ఈ రెగ్యులేటర్‌ నిర్మాణానికి పిలిచిన టెండర్ల తర్వాత పిలిచిన లజ్జబండ టెండర్లను అదే గుత్తేదారు దక్కించుకున్నారు. దీనికి మంత్రి అండదండలు ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

3. రైతుపై బూటకం.. అంతా జగన్నాటకం

మాది రైతుల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి జగన్‌ నుంచి మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు తరచూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. భూసార పరీక్షల నుంచి ఇతర అన్ని అంశాల్లోనూ అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. భూసార పరీక్షలతో పాటు సూక్ష్మ పోషకాల ఉచిత పంపిణీకి కూడా.. జగన్‌ సర్కారు మంగళం పాడింది. నేలల్లో పోషకాల లోపాన్ని నివారించి నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేలా రైతులకు తోడ్పడేందుకు ఏడాదికి రూ.80 కోట్లు కూడా ఇవ్వలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

4. ఆరు మీటర్లున్నాయట.. అమ్మఒడి రాదట 

ప్రభుత్వం ఏదో ఓ మెలిక పెట్టి పేదలకు సంక్షేమ పథకాలు దూరం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేసిన అమ్మఒడి పథకం పొందేందుకు అన్నివిధాలా అర్హతలున్నా.. తమకు మంజూరు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మఒడి కోసం ఆశగా ఎదురు చూసినా చాలా మందికి నిరాశే ఎదురైంది. మద్దికెర మండలం అగ్రహారానికి చెందిన మన్యం లక్ష్మీదేవికి పాత ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఒకే ఒక మీటరు ఉంది. కానీ ఆరు ఉన్నాయంటూ ఆమె కుమార్తె వైష్ణవికి అమ్మఒడి పథకం అందకుండా చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

5. మంత్రి అనుచరుడి మాయాజాలం

వివాదాస్పద భూములు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వాలిపోతున్నారు.. సెటిల్‌మెంట్లు చేస్తూ సొమ్ములు చేసుకోవడమే కాకుండా రూ.కోట్ల విలువైన స్థలాలను తమ గుప్పిటలోకి తెచ్చుకుంటున్నారు. దీనికి తమ నేతల పేర్లను వాడుకుంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అనకాపల్లిలోని జీవీఎంసీకి చెందిన విలువైన స్థలాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచరుడు ఒకరు దర్జాగా కబ్జాచేసి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టేస్తున్నాడు. వైఎస్‌ఆర్‌ యువజన విభాగం నేతగా పేరొందిన ఈ నాయకుడు కొనుగోలు చేసిన స్థలం 65 గజాలే. అయితే రికార్డుల్లో మార్పులు చేసి 800 గజాల స్థలంగా చూపించి భవన నిర్మాణానికి అనుమతులు తెప్పించుకున్నాడు. సదరు నాయకుడు జీవీఎంసీకి చెందిన మరో స్థలంపైనా కన్నేసి దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

6. బాధ్యులు ఎవరో తేల్చండి

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌ వే రక్షణలో భాగంగా నిర్మించిన గైడ్‌బండ్‌ కుంగడానికి బాధ్యులెవరో తేల్చాలని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. జరిగిన వైఫల్యాలపై సీరియస్‌ అయ్యింది. ఈ విషయంలో నిజనిర్ధారణ కమిటీ తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా నివేదిక సిద్ధం చేసే పనిలోనే ఉన్నారని, కొంత సమయం పడుతుందని జల్‌శక్తి శాఖలోని కీలకవర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం రాత్రి వరకూ ఈ నివేదిక ఉన్నతాధికారులకు చేరలేదు. కొన్ని పరీక్షల నివేదికలు రావాలని, వాటి ఆధారంగా నివేదిక సమర్పిస్తామని నిపుణుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యా కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

7.  కృత్రిమ మేధ.. ఎందుకింత ప్రాధాన్యం?

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతున్న తరుణమిది. కంప్యూటర్‌ సైన్స్‌లోని ప్రత్యేక విభాగాలపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. వాటిలో ఒకటి- అందరి నోళ్ళలో నానుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ). కంప్యూటర్‌ రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరగడం, నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో పరికరాలు ‘స్మార్ట్‌’గా మారడం వెనుకున్న అదృశ్య హస్తమిదే! ఈ విభాగం ప్రత్యేకతలూ, విశేషాలూ  తెలుసుకుందామా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

8. హైదరాబాద్‌ స్టేషన్లపై ఒత్తిడి తగ్గే అవకాశం

ఐటీ, ఫార్మా రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న హైదరాబాద్‌ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ఈ ముత్యాల నగరం చుట్టూ రైలుమార్గం నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సుమారు రూ.15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ప్రతిపాదిత అవుటర్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హైదరాబాద్‌లో రవాణా అధారిత అభివృద్ధికి చోదక శక్తి లభిస్తుంది. తెలంగాణకు 563.5 కి.మీ. కొత్త మార్గం ఒనగూరుతుంది. ఇప్పటివరకు రైలుమార్గం లేని చిట్యాల వంటి పట్టణాలకు కొత్తగా రైళ్లు అందుబాటులోకి తేవచ్చు. ముఖ్యంగా నగరంలోని రైల్వేస్టేషన్లపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కొత్తగా మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు వెసులుబాటు లభిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

9. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్‌: అనరాక్‌

నివాస గృహాల మార్కెట్ హైదరాబాద్‌లో స్థిరంగా పెరుగుతోందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌లో మొత్తం 13,570 నివాస గృహాలు అమ్ముడుపోయాయని పేర్కొంది. 2022 ఇదే కాలంలో అమ్ముడైన 11,190 ఇళ్లు/ఫ్లాట్లతో పోలిస్తే ఈ సంఖ్య 21% అధికం.  హైదరాబాద్‌లో చదరపు అడగు సగటు ధర 10 శాతం పెరిగి, రూ.4,980కి చేరింది. హైదరాబాద్‌ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్‌-జూన్‌లో 36% అధికమై 1.15 లక్షల యూనిట్లకు చేరాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

10. పాలకులారా.. పట్టించుకోండి

మలికిపురం మండలంలో కేశనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, గూడపల్లి, గుబ్బలపాలెం, జి.పల్లిపాలెం సముద్ర తీర గ్రామాల్లో ప్రజలకు కొబ్బరి, సరుగుడు పంటలే ఆధారం. ఇప్పుడు అక్కడ కొబ్బరి చెట్లు అంతరించిపోయే ప్రమాదం వచ్చింది. ఈ గ్రామాల్లోని శంకరగుప్తం మేజరు డ్రెయిన్‌ వెంట ఇరువైపులా ఉన్న వేల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. రెండేళ్ల నుంచి ఆటు, పోట్ల సమయంలో డ్రెయినులోని నీరు గట్టుపైకి చేరి తోటల్లోకి ప్రవేశించి అక్కడ ముంపుగా ఉండిపోతోంది. ఇదంతా ఉప్పు నీరవ్వడం నిల్వ ఉన్న నీటి వల్ల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని