logo

పాలకులారా.. పట్టించుకోండి

మలికిపురం మండలంలో కేశనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, గూడపల్లి, గుబ్బలపాలెం, జి.పల్లిపాలెం సముద్ర తీర గ్రామాల్లో ప్రజలకు కొబ్బరి, సరుగుడు పంటలే ఆధారం.

Published : 29 Jun 2023 04:33 IST

కేశనపల్లిలో ఉప్పు నీరు వల్ల చనిపోయిన కొబ్బరి చెట్లు

న్యూస్‌టుడే, మలికిపురం: మలికిపురం మండలంలో కేశనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమోరి, గూడపల్లి, గుబ్బలపాలెం, జి.పల్లిపాలెం సముద్ర తీర గ్రామాల్లో ప్రజలకు కొబ్బరి, సరుగుడు పంటలే ఆధారం. ఇప్పుడు అక్కడ కొబ్బరి చెట్లు అంతరించిపోయే ప్రమాదం వచ్చింది. ఈ గ్రామాల్లోని శంకరగుప్తం మేజరు డ్రెయిన్‌ వెంట ఇరువైపులా ఉన్న వేల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. రెండేళ్ల నుంచి ఆటు, పోట్ల సమయంలో డ్రెయినులోని నీరు గట్టుపైకి చేరి తోటల్లోకి ప్రవేశించి అక్కడ ముంపుగా ఉండిపోతోంది. ఇదంతా ఉప్పు నీరవ్వడం నిల్వ ఉన్న నీటి వల్ల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెట్ల స్థానంలో మళ్లీ పాతిన కొబ్బరి మొక్కలు కూడా దెబ్బతింటున్నాయి. ఉప్పు నీటి ప్రభావంతో ఈ ప్రాంతమంతా మాడి మసై పోతోందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సరుగుడు చెట్లు కూడా చచ్చిపోతున్నాయి. తీరంలో కొబ్బరి, సరుగుడు పంటపైనే ఆధార పడిన ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని వాపోతున్నారు.


ఎందుకిలా జరుగుతోంది..

నాలుగైదు సంవత్సరాల క్రితం శంకరగుప్తం మేజరు డ్రెయినుకు కేశనపల్లి నుంచి కరవాక వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగు పనులతో మెరకలు తొలగించి, వెడల్పు చేసి మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి డ్రెయినులోని నీరు గట్టుపైకి చేరి తోటల్లోకి ప్రవేశిస్తున్నట్టు రైతుల వాదనగా ఉంది. డ్రెయినులో ప్రవహించే నీటిని తీసుకుని శంకరగుప్తం డ్రెయిను వైనతేయ నదిలో కలుస్తుంది. పోటు సమయంలో నదిలోని ఉప్పు నీరు(నది సాగర సంగమ ప్రాంతమవ్వడంతో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది) ఎక్కువగా డ్రెయినులోకి వెనక్కి ప్రవహించి గట్లు మునిగిపోయి ఆ నీరు కొబ్బరి తోటల్లోకి వస్తోందని రైతులు చెబుతున్నారు.

* గతంలో శంకరగుప్తం డ్రెయినులో పూడికలు తొలగిస్తూ డ్రెడ్జింగు పనులు చేసి లోతు చేశారు. కానీ డ్రెయిను నదిలో కలిసే చోట మాత్రం పూడికలు తొలగించలేదు. ఫలితంగానీరు నదిలోకి పారడం లేదని, నదిలోని నీరే డ్రెయినులోకి వస్తోందని రైతులు చెబుతున్నారు. రూ.కోట్లు పెట్టి డ్రెడ్జింగ్‌ పనులు చేసినా ఉపయోగం లేదు సరికదా నష్టం జరుగుతోందంటున్నారు. డ్రెయినులోని మురుగు నీరు చింతలమోరి-కేశవదాసుపాలెం వద్ద  స్ట్రెయిట్‌కట్‌లోకి వెళ్లేలా నిర్మితమైన స్లూయిస్‌ పూర్తిగా శిథిలమైంది. అక్కడి స్ట్రెయిట్‌కట్‌ కూడా పూడిపోయి పని చేయని పరిస్థితుల్లో డ్రెయినులోని నీరు వైనతేయలోకి చేరుతోంది. చింతలమోరి వద్ద స్లూయిస్‌ స్థానే నూతన స్లూయిస్‌ను నిర్మించి స్ట్రెయిట్‌కట్‌ను కూడా సరి చేస్తే ప్రయోజనం ఉంటుందని ఇక్కడి రైతులు అంటున్నారు.


రూ.2 కోట్లన్నారు.. ఏవీ..

రైతులు మొర పెట్టుకోవడంతో గత ఏడాది నవంబరు నెలలో జిల్లా కలెక్టరు ఈ ప్రాంతంలో పర్యటించి రైతుల నుంచి వివరాలు సేకరించారు. పరిస్థితిని సమీక్షించి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం తీరంలో ఉప్పు నీటి సమస్య పరిష్కరించడానికి శంకరగుప్తం మేజరు డ్రెయినుకు ఇరువైపులా గట్టు ఎత్తు పెంచి పటిష్టం చేయడానికి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు వస్తాయి.. గట్టు ఎత్తు పెంచి పటిష్టం చేస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు గట్టును పటిష్టం చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టలేదు.


తీర ప్రాంతం బీడు భూములుగా..

కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో కూనవరం స్ట్రెయిట్కట్‌, డ్రెయిన్‌ సమస్య వల్ల ఇక్కడ కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి ఖరీఫ్‌ సాగుకు అంతరాయం ఏర్పడుతోంది. కొబ్బరి తోటలు చచ్చిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో కూడా కలెక్టరు పర్యటించారు. స్ట్రెయిట్‌కట్‌ డ్రెయిను మరమ్మతులు, స్లూయిస్‌ల నిర్మాణాలకు సుమారు రూ.5.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి.

* సఖినేటిపల్లి మండలం అంతర్వేది, అంతర్వేదిదేవస్థానం, పల్లిపాలెం, గొంది, కేశవదాసుపాలెం గ్రామాల్లో ఉప్పు నీటి ప్రభావంతో వేల ఎకరాలు బీడు భూములుగా మారిపోయిన పరిస్థితి ఉంది. సముద్రం కెరటాలతో గ్రామాల్లోకి ఉప్పు నీరు వస్తోందని ఇక్కడి ప్రజలు, రైతులు ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి తీర ప్రాంతం బీళ్లుగా మారిపోయే దుస్థితి దాపురించింది. పరిష్కార మార్గాలు అన్వేషించకపోతే భవిష్యత్తు అంధకారమే..!


నిధుల మంజూరు ఉత్తర్వులు రావాల్సి ఉంది
- ఆర్‌.నాగార్జున, డీఈఈ, జలవనరుల శాఖ (డ్రెయిన్స్‌ విభాగం)

శంకరగుప్తం మేజరు డ్రెయిను గట్టు పటిష్టతకు సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.2 కోట్లు కేటాయించారు.. వీటికి ఉన్నతాధికారుల నుంచి మంజూరు ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉత్తర్వులు వచ్చిన వెంటనే మరమ్మతులకు కార్యాచరణ చేపడతాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని