logo

మంత్రి అనుచరుడి మాయాజాలం

వివాదాస్పద భూములు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వాలిపోతున్నారు.. సెటిల్‌మెంట్లు చేస్తూ సొమ్ములు చేసుకోవడమే కాకుండా రూ.కోట్ల విలువైన స్థలాలను తమ గుప్పిటలోకి తెచ్చుకుంటున్నారు.

Published : 29 Jun 2023 04:52 IST

జీవీఎంసీ స్థలంలో రహదారి తొలగింపు
రూ.కోట్ల విలువైన జాగా స్వాహా యత్నం

పురపాలక సంఘం క్వార్టర్లలోని ఇళ్లు

వివాదాస్పద భూములు ఎక్కడుంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వాలిపోతున్నారు.. సెటిల్‌మెంట్లు చేస్తూ సొమ్ములు చేసుకోవడమే కాకుండా రూ.కోట్ల విలువైన స్థలాలను తమ గుప్పిటలోకి తెచ్చుకుంటున్నారు. దీనికి తమ నేతల పేర్లను వాడుకుంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. అనకాపల్లిలోని జీవీఎంసీకి చెందిన విలువైన స్థలాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచరుడు ఒకరు దర్జాగా కబ్జాచేసి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టేస్తున్నాడు. వైఎస్‌ఆర్‌ యువజన విభాగం నేతగా పేరొందిన ఈ నాయకుడు కొనుగోలు చేసిన స్థలం 65 గజాలే. అయితే రికార్డుల్లో మార్పులు చేసి 800 గజాల స్థలంగా చూపించి భవన నిర్మాణానికి అనుమతులు తెప్పించుకున్నాడు. సదరు నాయకుడు జీవీఎంసీకి చెందిన మరో స్థలంపైనా కన్నేసి దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నాడు.

ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి: అనకాపల్లి గుండాల కూడలి వద్ద పురపాలక సంఘం స్థలంలో అయిదు దశాబ్దాల క్రితమే కమిషనర్‌, సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మించారు. సిబ్బంది కోసం 65 గజాల స్థలం విస్తీర్ణంతో కూడిన ఎల్‌ఐజీ టైప్‌ ఇళ్లు కట్టారు. ఈ ఎల్‌ఐజీ ఇళ్లలోని ఒక ఇంటిలో నివాసం ఉండే పారిశుద్ధ్య విభాగం అధికారి పదవీ విరమణ తర్వాత ఖాళీ చేయలేదు. ఆ ఇల్లు తనకే చెందుతుందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పురపాలక సంఘం అధికారులు పట్టించుకోలేదు. దీంతో న్యాయస్థానం ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇది మూడు దశాబ్ధల కిత్రం జరిగింది. ఆ ఉద్యోగి చనిపోయిన తర్వాత అతని భార్య నుంచి ఇంటి స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలోనే అప్పట్లో తెదేపాలో ఉన్న ఈ వైకాపా యువజన విభాగం నాయకుడు మరో ఇద్దరితో కలిపి కొనుగోలు చేశారు. ఆ సమయంలో రికార్డుల్లో ట్యాంపరింగ్‌ చేసి 65 గజాలను 800 గజాలుగా మార్చేసి జీవీఎంసీ స్థలం మొత్తాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని సమాచారం. వైకాపా సర్కారు వచ్చిన తర్వాత ముగ్గురి పేరునున్న ఈ స్థలం మొత్తాన్ని అధికార పార్టీ యువజన నాయకుడి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణానికి జీవీఎంసీ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారు. ఎల్‌ఐజీ ఇంటిని 65 గజాల స్థలంలో నిర్మిస్తారు. మరి 600 గజాల స్థలంలో నిర్మాణాలకు జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చేశారు. మంత్రికి శిష్యుడు కావడంతో అధికారులు అనుమతులిచ్చేటప్పుడు ముందూ వెనుకా చూడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారిని ఆనుకొని ఉన్న ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 కోట్లు ఉంటుంది. ఈ బాగోతం తెలుసుకున్న సీపీఎంల్‌, సీపీఎం, సీపీఐ నాయకులు జోనల్‌ కమిషనర్‌ ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ స్థలాన్ని స్వాదీనం చేసుకుని అందులో పౌర గ్రంథాలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

80 అడుగుల రహదారి

మాస్టర్‌ ప్లాన్‌ మార్చి..

గత మాస్టర్‌ ప్లాన్‌లో బెల్లం మార్కెట్‌ యార్డును ఆనుకొని రింగ్‌ రోడ్డు నుంచి సబ్బవరం రోడ్డు వరకు 80 అడుగుల రహదారి ఉండేది. ఈ ప్రాంతంలో వుడా అనుమతితో రెండు లేవుట్లు వేశారు. నిబంధనల ప్రకారం 80 అడుగుల రహదారిని ఏర్పాటు చేశారు. ఆమేరకు రహదారి స్థలాన్ని ప్రభుత్వానికి రాసి ఇచ్చారు. ఈ రెండు లేవుట్లలో రహదారి కోసం విడిచిపెట్టిన స్థలం దాదాపు 35 సెంట్లు ఉంది. దీనివిలువ రూ.14 కోట్ల వరకు ఉంటుంది. ఈ స్థలంపై కన్నేసిన యువజన విభాగం నాయకుడు ఇటీవల కొత్తగా తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో 80 అడుగుల రోడ్డును తొలగించే విధంగా మంత్రితో చెప్పించి విజయం సాధించారు. ఈ ప్రాంతంలోని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మహిళ సహాయంతో రోడ్డు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఖాళీ స్థలం పన్ను వేయాల్సిందిగా జీవీఎంసీకి లేవుట్‌ వేసిన యజమానులలో ఒకరిచే దరఖాస్తు చేయించారు. విషయం తెలుసుకున్న కొందరు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దస్త్రాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. కొద్ది రోజులు పోయిన తర్వాత మంత్రితో చెప్పించి అనుమతులు పొందొచ్చని ఆ యువనేత ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. స్థలాల కబ్జా విషయమై జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటరమణ వద్ద ప్రస్తావించగా గుండాల కూడలిలోని భవనానికి 2018లోనే అనుమతులు ఇచ్చారని తెలిపారు. ఇటీవల రెన్యూవల్‌ మాత్రమే చేసినట్లు చెప్పారు. వుడా అనుమతి పొందిన లేఅవుట్‌లోని పాత రహదారి స్థలంలో ఖాళీ స్థలానికి పన్ను వేయాల్సిందిగా దరఖాస్తు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఆ స్థలం ప్రభుత్వానికి రాసి ఇచ్చినందున ఇతరులకు అనుమతులు ఇచ్చేది లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు