logo

సీఎం హామీకి.. మంత్రి గండి..!

‘సముద్రం నుంచి ఉప్పునీరు రాకుండా ఎక్కడికక్కడ రెగ్యులేటర్లను నిర్మాణం చేసి గేట్లు పెట్టిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెదలంక డ్రెయిన్‌పై మినీ బ్యారేజీ నిర్మాణం చేయిస్తామని రైతు సోదరులకు హామీ ఇస్తున్నాను’

Updated : 29 Jun 2023 05:35 IST

నిర్మాణం ప్రారంభించని గుత్త సంస్థకు అండ
అంచనాల పెంపునకు రంగం సిద్ధం
పెదలంక మినీ బ్యారేజీ పరిస్థితి
ఈనాడు, అమరావతి

రెగ్యులేటర్‌ నిర్మాణం ఇక్కడే

‘సముద్రం నుంచి ఉప్పునీరు రాకుండా ఎక్కడికక్కడ రెగ్యులేటర్లను నిర్మాణం చేసి గేట్లు పెట్టిస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెదలంక డ్రెయిన్‌పై మినీ బ్యారేజీ నిర్మాణం చేయిస్తామని రైతు సోదరులకు హామీ ఇస్తున్నాను’

ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సందర్భంగా పెడనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది!

అక్కడ రెగ్యులేటర్‌ నిర్మాణం వేలాది మంది రైతుల కల. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో టెండర్లు పిలిచారు. ఓ మంత్రి చక్రం తిప్పి పోటీ లేకుండానే టెండర్‌ దక్కేలా చేశారు. ఆరు నెలలు గడిచినా గుత్తేదారు ఒప్పందాలు చేసుకోలేదు. పైగా టెండర్లు రద్దు చేయించి.. అంచనాలు పెంచి మరోసారి టెండరు పిలిచేందుకు మంత్రితో మంత్రాంగం నడుపుతున్నారు. అంచనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్దం చేశారు. మరోవైపు ఈ మినీ బ్యారేజీ నిర్మాణం చేయకపోవడంతో ఎంతో మంది రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇంకో వైపు ఉప్పు నీటితో సాగు చేస్తున్న రొయ్యల వ్యాపారులు దీని నిర్మాణానికి వ్యతిరేకంగా మద్దతు ఇస్తున్నారు. ఈ రెగ్యులేటర్‌ నిర్మాణానికి పిలిచిన టెండర్ల తర్వాత పిలిచిన లజ్జబండ టెండర్లను అదే గుత్తేదారు దక్కించుకున్నారు. దీనికి మంత్రి అండదండలు ఉన్నాయి. దీని ఒప్పందాలు చేసుకుని నిబంధనలకు వ్యతిరేకంగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

తీర ప్రాంత మండలాల్లో ఉప్పునీటి ప్రభావం రైతులపై తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. డ్రైయిన్లు, వాగులు, వంకలు, నదుల నుంచి సముద్రపు నీరు ఎగబాకుతుంది. దీంతో రైతుల పొలాలు ఉప్పు నీటితో నిండిపోతున్నాయి. తాగేందుకు నీరు లభించని పరిస్థితి. బోర్లు ఉప్పునీటి మయంగా మారుతున్నాయి. దీన్ని నివారించేందుకు ఎక్కడికక్కడ రెగ్యులేటర్ల (మినీబ్యారేజీలు) నిర్మాణం చేసి సముద్రపు ఉప్పు నీరు రాకుండా నియంత్రించాలని జలవనరుల శాఖ నిపుణులు ప్రతిపాదించారు. గత ప్రభుత్వ హయాంలో పెదలంక డ్రెయిన్‌పై సముద్రపు నీరు రాకుండా రెగ్యులేటర్‌ నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. నాలుగేళ్లుగా టెండర్లను పిలవలేదు. జనవరిలో దీని టెండర్లను పిలిచారు. ఇద్దరు గుత్తేదారులు పోటీపడ్డారు. ఎన్‌ఏఎస్‌ బాబు కనస్ట్రక్షన్స్‌, ఒడిశాకు చెందిన ఓ గుత్తేదారు పోటీ పడ్డారు. అంచనాల ధరలకే ఎన్‌ఏఎస్‌కు టెండర్‌ దక్కింది. ఒడిశా గుత్తేదారుది డమ్మీ టెండర్‌గా ఇంజినీర్లు భావించారు. దీనికి ఓ మంత్రి కారణమనేది బహిరంగ రహస్యం. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ హరిజనవాడ వద్ద పెదలంకపై ఈ రెగ్యులేటర్‌ నిర్మాణం చేయాల్సి ఉంది. సముద్రానికి సుమారు 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సమ్రుద మట్టానికి 3.5 మీటర్ల వద్ద దీని నిర్మాణం ప్రారంభం అవుతుంది. దీని వల్ల కృత్తివెన్ను, ఇతర మండలాల్లో వేలాది మంది రైతులకు ఉపయోగం ఉంటుంది. ఈ ప్రాంతంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొబ్బరి సాగు, వరి సాగు ఉంది. చేపలకు మంచినీరు కావాలి. ఒక్క వనామీ రొయ్యల సాగుకు మాత్రం ఉప్పు నీటిని వినియోగిస్తారు. వరికి మంచి నీరు కావాల్సిందే. పెదలంక డ్రెయిను చేవూరు నుంచి ఉప్పుటేరుతో కలిసి దేవపూడి మీదుగా ప్రవహిస్తుంది. తీరప్రాంత మండలం కృత్తివెన్ను, బంటుమిల్లిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాదాపు 10వేల హెక్టార్లలో చేపల చెరువులు ఉన్నాయి. సుమారు 1500 హెక్టార్లలో రొయ్యల చెరువులు ఉన్నాయి. వరి 10వేల ఎకరాలు, కొబ్బరి వేలాది ఎకరాలు ఉన్నాయి. వరి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో చాలా మంది తప్పనిసరిగా రొయ్యల చెరువులుగా మార్చుతున్నారు.

అంచనాలు పెంచేందుకే..?

ఈ రెగ్యులేటర్‌ అంచనాలను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే గుత్త సంస్థ లజ్జబండ డ్రెడ్జింగ్‌ పనులను ఏప్రిల్‌లో దక్కించుకుంది. దీని లెవల్స్‌ తీయకుండానే పనులు ప్రారంభించారు. లెవల్స్‌ తీసిన తర్వాతే పనులు ప్రారంభించాలని ఈఈ, ఎస్‌ఈ పట్టుబట్టడంతో వారిపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో ఇన్‌ఛార్జులను నియమించారు. లజ్జబండ డ్రెడ్జింగ్‌ నీటిలో జరుగుతోంది. దీంతో మిగులు శాతం ఎక్కువ. రెగ్యులేటర్‌ నిర్మాణం దానికి విరుద్ధం. అందుకే దీన్ని రద్దు చేయించి మరో రూ.5 కోట్లకు పైగా అంచనాలు పెంచాలని మంత్రి నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. ఒప్పందానికి గుత్తేదారు రాకపోవడం వెనుక ఇదే కారణమని ఇంజినీర్లు అంటున్నారు.


జాప్యం వల్ల నష్టం!

ఉప్పు నీరు పొలాల్లోకి రావడం వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఆరు నెలలు ఉప్పునీరే ఉంటోంది. మిగిలిన ఆరు నెలలు మంచి నీరు అందినా చేపల పెరుగుదల ఉండడం లేదు. రెగ్యులేటర్‌ నిర్మాణం జాప్యం లేకుండా చూస్తే రైతులకు ప్రయోజనం  ఉంటుంది.

రామాంజనేయులు, రైతు, కొమ్మలపూడి


వనామీ సాగుకే...

పెదలంక డ్రెయిన్‌ ఉప్పుటేరు వల్ల ఉప్పు నీరు ఎక్కువగా వస్తోంది. దీని వల్ల రొయ్యలు వనామీ సాగు చేసే రైతులకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. రెగ్యులేటరీ నిర్మాణం ద్వారా సముద్రపు నీటిని నియంత్రించాలి.

కె.సత్యనారాయణ, రైతు, పెన్నందిబ్బ


ప్రాజెక్టు పేరు: పెదలంక డ్రైన్‌ రెగ్యులేటర్‌ (మినీ బ్యారేజీ)

టెండర్‌ వ్యయం: రూ.43.50కోట్లు

ప్రస్తుత పరిస్థితి..: పనులు ప్రారంభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు