రైతుపై బూటకం.. అంతా జగన్నాటకం

వ్యవసాయంపై అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వం మాది... రైతులపై మమకారం, బాధ్యతతో పథకాలను అమలు చేస్తున్నాం.

Updated : 29 Jun 2023 05:15 IST

ఉచితంగా సూక్ష్మ పోషకాల పంపిణీకి స్వస్తి
అన్నదాతల అభ్యున్నతికి భారీగా నిధులు వెచ్చిస్తున్నామంటూ ఆర్భాట ప్రకటనలు
తెదేపా ప్రభుత్వంలో 100% రాయితీపై అందజేత

వ్యవసాయంపై అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వం మాది... రైతులపై మమకారం, బాధ్యతతో పథకాలను అమలు చేస్తున్నాం...

ఈ ఏడాది జూన్‌ 1న కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్‌..
మాది రైతుల అభ్యున్నతికి పాటుపడే ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి జగన్‌ నుంచి మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు తరచూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. భూసార పరీక్షల నుంచి ఇతర అన్ని అంశాల్లోనూ అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. భూసార పరీక్షలతో పాటు సూక్ష్మ పోషకాల ఉచిత పంపిణీకి కూడా.. జగన్‌ సర్కారు మంగళం పాడింది. నేలల్లో పోషకాల లోపాన్ని నివారించి నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేలా రైతులకు తోడ్పడేందుకు ఏడాదికి రూ.80 కోట్లు కూడా ఇవ్వలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. వివిధ పద్దుల కింద ( రైతుల నుంచి ధాన్యాన్ని కొన్నందుకు ఇచ్చే సొమ్మునూ కలిపేసి) వెచ్చించిన సొమ్మును కలిపేసి తాము అధికారంలోకి వచ్చాక రూ.1.61 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. రైతుల అవసరాలేమిటి..? వారికి ఎలాంటి సాయం సమకూర్చాలన్న విషయాన్ని మాత్రం జగన్‌ సర్కారు గుర్తించడం లేదు.


  • భూసార పరీక్షల ద్వారా నేలల్లో పోషకాల లోపం తెలుస్తుంది. అందుకు అనుగుణంగా మొక్కలకు సూక్ష్మ పోషకాలను అందిస్తే నాణ్యమైన పంట దిగుబడులు లభిస్తాయి. పంట ఉత్పత్తి కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో అధిక శాతం నేలల్లో పోషకాల లోపం ఉందని గతంలో నిర్వహించిన భూసార పరీక్షల్లో వెల్లడైంది. 35-40% నేలల్లో జింకు, 24% నేలల్లో ఇనుము, 5% భూముల్లో మాంగనీసు, 5% నేలల్లో కాపర్‌, 20% పొలాల్లో బొరాన్‌, 18-22% నేలల్లో సల్ఫర్‌ లోపం ఉందని భూసార పరీక్షల్లో గుర్తించారు.
  • జిప్సం పంపిణీ ద్వారా వేరుసెనగ ఉత్పత్తి ఎకరాకు 2.20 క్వింటాళ్ల నుంచి 3.46 క్వింటాళ్ల వరకు అధికంగా వచ్చిందని.. వరి, కంది, పొద్దుతిరుగుడులోనూ దిగుబడులు పెరిగాయని ప్రాథమిక అంచనాల్లో గుర్తించినట్లు 2015-16లో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన కె.ధనుంజయరెడ్డి కేంద్రానికి ఇచ్చిన నివేదికలే వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ధనుంజయరెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. ఈ హోదాలో ఆయన నాలుగేళ్లుగా ఉన్నా ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపేలా చర్యలు చేపట్టలేదు.
  • సూక్ష్మ పోషకాల వినియోగం ద్వారా పంట దిగుబడి 8% నుంచి 15% పెరిగిందని 2018-19లో  పంట కోత ప్రయోగాల ద్వారా వెల్లడైంది.

తెదేపా హయాంలో 100% రాయితీపై రైతులకు సూక్ష్మ పోషకాలను అందజేశారు. రాష్ట్రంలోని నేలల్లో పోషక లోపాల నివారణకు.. 2014-15 నుంచి మూడేళ్ల పాటు 50% రాయితీపై సూక్ష్మ పోషకాలను పంపిణీ చేశారు. 2017-18 నుంచి ఉచితంగా అందించాలని నిర్ణయించిన అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ మేరకు రాయితీని 100% చేసింది. భూసార పరీక్ష కార్డుల ఆధారంగా వీటిని ఉచితంగా అందించారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. అధిక దిగుబడులు లభించాయని నివేదికలు వెల్లడించాయి. సగటున ఒక్కో రైతుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ప్రయోజనం కలిగింది. చౌడు నేలల పునరుద్ధరణకు రైతులకు హెక్టారుకు రూ.10 వేల నుంచి రూ.17 వేల వరకు ఖర్చు కాగా భూసార పరీక్ష కార్డుల ఆధారంగా ఈ మొత్తాన్ని తెదేపా ప్రభుత్వం ఉచితంగా అందించింది. మొత్తంగా అయిదేళ్లలో సూక్ష్మ పోషకాల పంపిణీకి సుమారు రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేశారు.


రాయితీ కోత.. పంపిణీ నిలిపివేత

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక 2019-20లో సూక్ష్మ పోషకాల రాయితీని సగానికి తగ్గించారు. అప్పటి వరకు 100% రాయితీపై ఉచితంగా ఇచ్చే సూక్ష్మ పోషకాలను 50% రాయితీపై ఇవ్వాలని నిర్ణయించింది. 2018-19లో మిగిలిన నిల్వలను మాత్రమే అందించారు. మొత్తం 21 వేల టన్నుల పంపిణీకి రూ.8 కోట్ల రాయితీ మాత్రమే ఇచ్చారు. మరుసటి ఏడాది నుంచి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.

ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని