CM Jagan: డొల్లమాటల జగన్‌!

మధ్యతరగతి కుటుంబాల కోసం.. లాభాపేక్ష లేకుండా, అందుబాటు ధరల్లో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.  మొదటి దశలో ఆరుచోట్ల అభివృద్ధి చేస్తున్నా... ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం.

Updated : 29 Jun 2023 09:31 IST

కదలిక లేని స్మార్ట్‌ టౌన్‌షిప్‌
డబ్బు వెనక్కి తీసుకుంటున్న దరఖాస్తుదారులు

మధ్యతరగతి కుటుంబాల కోసం.. లాభాపేక్ష లేకుండా, అందుబాటు ధరల్లో లేఅవుట్లు తీసుకొస్తున్నాం.  మొదటి దశలో ఆరుచోట్ల అభివృద్ధి చేస్తున్నా... ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయబోతున్నాం. లేఅవుట్‌లో 50% స్థలాన్ని పార్కులు, స్కూళ్లు, క్రీడా మైదానాలు, బ్యాంకులు, షాపింగ్‌, రిక్రియేషన్‌ సదుపాయాల కోసం కేటాయిస్తాం. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సిమెంట్‌ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, రోడ్లకిరువైపులా మొక్కలు,  వీధి దీపాలు, తాగునీటి సరఫరా, యూజీడీ, వరదనీటి కాలువలు ఉంటాయి.

2022 జనవరి 11న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ వెబ్‌సైట్‌ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలివి.

ఈనాడు - అమరావతి
మధ్యతరగతి కుటుంబాలకు అరచేతిలో సొంతింటిని చూపించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. వారి కలలను కల్లలు చేసేశారు. అదిగో.. ఇదిగో.. అంటూ హడావుడి చేసి ఉసూరుమనిపించి.. ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి కళ్లు గప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలోని ప్లాట్‌ ధరలో పది శాతాన్ని దరఖాస్తుదారుల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సర్కారు వారికి స్థలాలను ఎప్పుడు అప్పగిస్తుందో చెప్పలేని స్థితిలో ఉంది. ఆరు లేఅవుట్లలో విశాలమైన తారు, సిమెంట్‌ రోడ్లు కాదుకదా.. కనీస సదుపాయలూ కనబడడం లేదు. తొలుత పనులు ప్రారంభించిన ఏలూరు లేఅవుట్‌ ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా తయారైంది. జనాన్ని నమ్మించడానికి మాత్రం బాగానే ఖర్చు చేసి.. అందమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. నవులూరు, రాయచోటి, కందుకూరు, కావలి, ధర్మవరం లేఅవుట్లలో ప్లాట్లకు హద్దురాళ్లు మాత్రమే పాతారు. ఇక్కడ కాలువలు, రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంతవరకు ఇతర మౌలిక వసతుల ఊసే లేదు. స్మార్ట్‌ టౌన్‌షిప్‌లపై నమ్మకం కోల్పోయిన దరఖాస్తుదారులు.. అప్పులకు వడ్డీలు చెల్లించలేక సర్కారుకు కట్టిన మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంటున్నారు. ఏలూరులో ఇప్పటికే కొంతమందికి అధికారులు డబ్బులను వెనక్కి ఇచ్చేశారు.


  • మాటలు చెప్పినంత సులువు కాదు.. పనులు చేయడమంటే!
  • గొప్పగా ప్రకటనలు చేయడం... ఆనక చతికిలపడిపోవటం..
  • ఏమైందని ప్రశ్నిస్తే.. దాడులు చేసి నోళ్లు మూయించడం..
  • జగన్‌ సర్కారుకు   అలవాటైన విద్య..మధ్యతరగతి జీవితాలతోనూ ఆటలాడి.. వారిని నట్టేట ఎలా ముంచుతోందో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లే చెబుతున్నాయి.

ప్రజల విముఖత

ప్రభుత్వ ఆధ్వర్యంలో లేఅవుట్లు అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారంటే ప్రజలు పోటీపడడం సహజం. వివాదాలకు ఆస్కారం లేని క్లియర్‌ టైటిల్‌, మౌలిక సదుపాయాలు ఉంటాయని వారికో నమ్మకం. అలాంటిది జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లకు ప్రజల నుంచి ఆశించిన స్పందనే లేదు.

* నవులూరులో 40 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధి చేస్తున్నారు. రెండో దశ పనులు ప్రారంభించాల్సి ఉంది. ప్రజల నుంచి స్పందన లేక ప్రాజెక్టును సగానికి కుదించేశారు.

* ధర్మవరం లేవుట్‌లో 1,272 ప్లాట్లకుగాను 758 దరఖాస్తులే వచ్చాయి.

* రెండో దశలో విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) పరిధిలో ప్రతిపాదించిన ఎనిమిది లేఅవుట్లలో 2,827 ప్లాట్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తే 1,008 మందే ముందుకొచ్చారు.

* విజయనగరం జిల్లా గరివిడిలో 211 ప్లాట్ల లేఅవుట్‌కు మూడే దరఖాస్తులొచ్చాయి.

* వీఎంఆర్డీఏ పరిధిలోని అడ్డూరులోనూ 146 ప్లాట్లకు 11 మంది దరఖాస్తు చేశారు.

* శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో 152 ఎకరాల్లో ఇప్పటికీ ఎలాంటి పనులు చేపట్టలేదు. 1,699 ప్లాట్లను అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక.

* పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 11 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధి చేసి 187 ప్లాట్లు కేటాయించేందుకు భూమి చదును చేశారు. ప్రజల నుంచి కేవలం 20 దరఖాస్తులే వచ్చాయి.


మొదటి ప్రాజెక్టు పరిస్థితి ఇలా...

రాష్ట్రంలో మొదటిసారి ఏలూరు శనివారపుపేటలో జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌ లేఅవుట్‌కు 2022 మే 18న శంకుస్థాపన చేశారు. 383 ప్లాట్లకు 420 మంది దరఖాస్తు చేయగా 68 మందికి కేటాయించారు. రహదారులు, కాలువలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, వరదనీటిపారుదల పనులు ప్రారంభం కాలేదు. దరఖాస్తుదారుల్లో కొందరు ప్లాట్‌ మొత్తం ఒకేసారి చెల్లించారు. ఇంకొందరు రెండు వాయిదాలు జమ చేసినా ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో చాలామంది దరఖాస్తులు వెనక్కి తీసుకుంటున్నారు.


వైఎస్‌ ‘స్వగృహ’ భయం!

వైస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రాజీవ్‌ స్వగృహ ప్రాజెక్టు కోసం డబ్బులు చెల్లించిన మధ్యతరగతివారెందరో ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టు పూర్తికాక.. ఇటు డబ్బులూ వెనక్కి రాక అష్టకష్టాలు పడ్డారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని ఏలూరు లేఅవుట్‌లో డబ్బు కట్టి వెనక్కి తీసుకున్న ఒకరు అభిప్రాయపడ్డారు. ఏడాదైనా సదుపాయాలు కల్పించి రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడాన్ని ఏమనుకోవాలని ఆయన ప్రశ్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని