Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్‌: అనరాక్‌

నివాస గృహాల మార్కెట్ హైదరాబాద్‌లో స్థిరంగా పెరుగుతోందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌లో మొత్తం 13,570 నివాస గృహాలు అమ్ముడుపోయాయని పేర్కొంది.

Updated : 29 Jun 2023 08:53 IST

దిల్లీ: నివాస గృహాల మార్కెట్ హైదరాబాద్‌లో స్థిరంగా పెరుగుతోందని స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్‌ నివేదిక వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌లో మొత్తం 13,570 నివాస గృహాలు అమ్ముడుపోయాయని పేర్కొంది. 2022 ఇదే కాలంలో అమ్ముడైన 11,190 ఇళ్లు/ఫ్లాట్లతో పోలిస్తే ఈ సంఖ్య 21% అధికం.  హైదరాబాద్‌లో చదరపు అడగు సగటు ధర 10 శాతం పెరిగి, రూ.4,980కి చేరింది.

* హైదరాబాద్‌ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్‌-జూన్‌లో 36% అధికమై 1.15 లక్షల యూనిట్లకు చేరాయి. సగటు ధరలోనూ 6-10% వృద్ధి కనిపించింది. 2022 ఏప్రిల్‌-జూన్‌లో మొత్తం 84,940 యూనిట్లను స్థిరాస్తి సంస్థలు విక్రయించాయి. గృహరుణాల వడ్డీ రేట్లు పెరగడం, అంతర్జాతీయంగా సమస్యలు, పెద్ద, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల్లో కోతలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగంలో వృద్ధి కొనసాగుతోందని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. పుణెలో 65%, దిల్లీలో 7%, కోల్‌కతాలో 20%, ముంబయిలో 48%, బెంగళూరులో 31%, చెన్నైలో 44% ఇళ్ల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. ఏడు నగరాల్లో కొత్త నిర్మాణాలు గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో 82,150 కాగా, ఈ ఏడాది 1,02,610కి చేరాయని నివేదిక తెలిపింది. అదే సమయంలో అమ్ముడుపోని యూనిట్లు 2% తగ్గి, 6.14 లక్షలకు పరిమితమయ్యాయని పేర్కొంది.

ఆకాశ హర్మ్యాల నిర్మాణమూ అధికం: దేశంలో 150 మీటర్ల కంటే పొడవైన భవనాలలో హైదరాబాద్‌ వాటా 8 శాతమని సీఐఐ-సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మిస్తున్న ఈ ఆకాశ హర్మ్యాల్లో 89% నివాసాలకు వినియోగిస్తుండగా, 6 శాతమే కార్యాలయ అవసరాలకు వాడుతున్నారు. మరో 4 శాతం ఎత్తైన భవనాలను మిశ్రమ అవసరాలకు వినియోగిస్తుండగా, 1 శాతాన్ని హోటళ్లకు వాడుతున్నారు.

* దేశంలోని ఈ తరహా భవనాల్లో 77% ముంబయిలోనే ఉన్నాయి. అక్కడ 100 ఇప్పటికే ఉండగా, మరో 90 భవనాలు నిర్మితమవుతున్నాయి. ఈ అంశంలో అంతర్జాతీయంగా 17వ స్థానం, ఆసియా దేశాల్లో 14వ స్థానం ముంబయికి లభించింది.

స్థిరాస్తి రంగంలోకి 293 కోట్ల డాలర్లు: జేఎల్‌ఎల్‌

అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ స్థిరాస్తి రంగంలోకి పెట్టుబడులు పెరిగాయని జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది. 2022 జనవరి-జూన్‌ మధ్య 288 కోట్ల డాలర్ల పెట్టుబడులు, ఈ ఏడాది ఇదే కాలంలో 293 కోట్ల డాలర్ల సంస్థాగత పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చినట్లు తెలిపింది. పెట్టుబడులు ఇదే స్థాయిలో కొనసాగితే.. ఏడాది చివరి నాటికి ఈ మొత్తం 500 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఆఫీస్‌ స్థలాలకు 192.7 కోట్ల డాలర్లు పెట్టుబడులు వచ్చాయని, 51.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు నివాస గృహాల మార్కెట్‌కు వచ్చినట్లు తెలిపింది. గోదాముల స్థలాల కోసం పెట్టుబడులు 20.3 కోట్ల డాలర్ల నుంచి 36.6 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొంది. హోటళ్ల రంగంలోకి 13.4 కోట్ల డాలర్లు, డేటా సెంటర్ల రంగంలోకి 49.9 కోట్ల డాలర్లు వచ్చాయని తెలిపింది. ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతం నుంచి 74% పెట్టుబడులు రాగా, మిగిలిన మొత్తం అమెరికా నుంచి వచ్చిందని జేఎల్‌ఎల్‌ తెలిపింది. దేశీయ పెట్టుబడులూ 44% పెరిగాయని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు