Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 27 Jun 2023 09:00 IST

1. కోడితో పనిలేని చికెన్‌.. అమ్మకాలకు అనుమతి

జంతు హింస అని బాధపడకుండా.. ఇక పౌరులు హాయిగా  చికెన్‌ను లొట్టలేసుకుంటూ తినేయ్యొచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్‌లో తయారు చేసిన చికెన్‌ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌.. రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మొదట రెస్టారెంట్లలో ఈ అమ్మకాలు మొదలు పెట్టి.. ఆ తర్వాత సూపర్‌ మార్కెట్లలోనూ ఈ చికెన్‌ను అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TSRTC: 30 కి.మీ. పరిధిలో ఆర్టీసీ ప్రత్యేక టికెట్‌

పల్లెల నుంచి దగ్గరలోని పట్టణాలకు రాకపోకలు సాగించేవారిపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించింది. 30 కి.మీ. వరకు ప్రయాణాలు చేసేవారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టికెట్‌ తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అధికారులతో ఈ విషయంపై చర్చించారు. రానుపోను ప్రయాణం చేస్తే అయ్యే టికెట్‌ మొత్తం ఛార్జీ కంటే కొంత మొత్తాన్ని తగ్గించి ప్రత్యేక టికెట్‌ ఖరారు చేయాలనుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ముంపు తప్పేలా.. పై ఎత్తు

వర్షం అంటే చాలు.. లోతట్టు ప్రాంతాల వాసులు వణికిపోతున్నారు. 2020 అక్టోబరులో నగరాన్ని ముంచెత్తిన వరద బీభత్సం ఇంకా మర్చిపోలేదు. వరదలు వచ్చినప్పుడల్లా రెండు నుంచి ఐదు అడుగుల మేర నీరు నిలవడం.. కష్టపడి కొనుగోలు చేసిన విలువైన వస్తువులు పాడవ్వడం.. రోజులపాటు జాగారం వంటి భయానక పరిస్థితులను మర్చిపోలేక పోతున్నారు. ఈ క్రమంలో ఇంటిని కూల్చి కొత్తగా నిర్మించే స్తోమత లేకపోవడంతో నాలుగైదు అడుగులు పైకి లేపే ‘జాకీ హౌస్‌ లిఫ్టింగ్‌’ వైపు మొగ్గు చూపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మన వారైతే చాలు!

ఉమ్మడి జిల్లాలో జలవనరుల శాఖలో బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కీలక పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా జలవనరుల శాఖ ఎస్‌ఈగా ఇంజినీరును నియమించలేదు. ఈఈకి ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. గతంలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న తిరుమలరావును నియమించారు. ఆయన ఏడాది కూడా పనిచేయలేదు. తిరిగి పంపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిద్దుబాటు.. సమాయత్తం

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బరిలో దిగేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహులు నామినేషన్లకు ముందే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ప్రజల నాడి తెలుసుకుంటున్నారు. ఆశావహుల వరుస పర్యటనలతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మాకూ కావాలి.. ఓ గన్‌!!

ప్రశాంతతకు మారు పేరుగా నిలిచే విశాఖలో ఇటీవలి పరిణామాలు కలవరపెడుతున్నాయి. దీంతో ‘గన్‌’ లైసెన్స్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. కొన్నాళ్లుగా హత్యలు, కిడ్నాప్‌లు, దాడులతో భయానక పరిస్థితి నెలకొంది. విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తామని వైకాపా ప్రభుత్వం ప్రకటించిన తరువాత భూకబ్జాలు, ఆక్రమణలు, బెదిరింపులు-వేధింపులు పెరగడంతో నేరాల తీరు కూడా మారిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నమ్మకాన్ని పంచి..సంఖ్యను పెంచి..!

చిత్తశుద్ధితో పనిచేస్తే.. అనుకున్నది సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఆ ఉపాధ్యాయులు. తాము పనిచేసే గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకాన్ని పెంచి, మూతపడే పరిస్థితులు ఉన్న పాఠశాలలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకరు బదిలీపై పాఠశాలకు వచ్చేనాటికి విద్యార్థుల సంఖ్య శూన్యంగా ఉండగా, మరో చోట ఆ సంఖ్య నామమాత్రంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అధికార ఫ్లెక్సీలపై అంతులేని ప్రేమ

‘మా నాయకుడి పుట్టిన రోజని ఫ్లెక్సీలు పెట్టాం.. పూటకూడా గడవకుండా తీసేశారు. మా ఫ్లెక్సీలు ఒక్కరోజు కూడా ఉంచరా..? వైకాపా వాళ్ల ఫ్లెక్సీల జోలికైతే వెళ్లరా..? అధికార పార్టీకో రూలు.. ప్రతిపక్ష పార్టీలకో రూలా..? ఇది కరెక్టు కాదు.. కాకినాడను ప్రశాంతంగా ఉండనివ్వరా’’..? అంటూ తెదేపా నాయకులు కాకినాడ నగర పాలక సంస్థ సిబ్బందిపై ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హైస్కూల్‌ ప్లస్‌లో ప్రవేశాలు ఢమాల్‌

హైస్కూల్‌ ప్లస్‌లో ప్రారంభించిన ఇంటర్మీడియట్‌కు ఈ ఏడాదీ విద్యార్థుల నుంచి స్పందన కరవైంది. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం 253 హైస్కూళ్లలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభిస్తే ప్రథమ సంవత్సరంలో కేవలం 3,319 మంది మాత్రమే చేరారు. ఈ లెక్కన ఒక్కో దాంట్లో సరాసరిన 13.12 శాతం మంది చొప్పున చేరారు. ద్వితీయ సంవత్సరంలో 2,901 మంది ఉన్నారు. రెండు సంవత్సరాల్లో కలిపి విద్యార్థుల సంఖ్య 6,220కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. క్వారీలపై వికృత స్వారీ

చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్‌కు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది కార్మికులకు ఇక్కడి గనులు ఉపాధి చూపుతుంటాయి. ప్రభుత్వ ఖజానాకు ఆదాయంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్నీ సమకూర్చి పెడుతుంటాయి. ఇంతటి కీలకమైన క్వారీలకు ఇప్పుడు రాజకీయ గ్రహణం పట్టుకుంది. అటు ప్రభుత్వం, ఇటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు క్వారీలపై పెత్తనం చెలాయిస్తూ ఇష్టారీతిన స్వారీ సాగిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని