logo

నమ్మకాన్ని పంచి..సంఖ్యను పెంచి..!

చిత్తశుద్ధితో పనిచేస్తే.. అనుకున్నది సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఆ ఉపాధ్యాయులు. తాము పనిచేసే గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకాన్ని పెంచి, మూతపడే పరిస్థితులు ఉన్న పాఠశాలలను కాపాడుకుంటూ వస్తున్నారు.

Updated : 27 Jun 2023 04:27 IST
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుంటున్న ఉపాధ్యాయులు
చిట్యాల, న్యూస్‌టుడే: చిత్తశుద్ధితో పనిచేస్తే.. అనుకున్నది సాధించొచ్చని నిరూపిస్తున్నారు ఆ ఉపాధ్యాయులు. తాము పనిచేసే గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల నమ్మకాన్ని పెంచి, మూతపడే పరిస్థితులు ఉన్న పాఠశాలలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఒకరు బదిలీపై పాఠశాలకు వచ్చేనాటికి విద్యార్థుల సంఖ్య శూన్యంగా ఉండగా, మరో చోట ఆ సంఖ్య నామమాత్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, దాతల సహకారాన్ని తీసుకుని, విద్యార్థుల తల్లిదండ్రులకు తమ బోధనపై నమ్మకాన్ని కలిగించి.. క్రమంగా ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వ పాఠశాల వైపు రప్పించుకోవడంలో సఫలం అయ్యారు చిట్యాల మండలం బోయగుబ్బ, గుర్రంపోడు మండలం కోయగూరోనిబావి, కాల్వపల్లి మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేశబోయిన గోపాల్‌, పి.శ్రావణికుమారి.

ఆంగ్లమాధ్యమంతో...
 
విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన కేశబోయిన గోపాల్‌
గుర్రంపోడు మండలం కోయగూరోనిబావి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కేశబోయిన గోపాల్‌ 2012 నుంచి 2015 వరకు రీసోర్స్‌ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015-16లో పూర్తి సమయం ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు మిగిలారు. రేషనలైజేషన్‌ మూలంగా ఒక టీచర్‌పోస్టును అధికారులు తొలగించగా గోపాల్‌ ఒక్కరే మిగిలారు. 2017-18కి వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య ఆరుకు పడిపోయింది. పరిస్థితిని గమనించి అప్రమత్తమైన గోపాల్‌ ఎస్‌ఎంసీ బాధ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలిశారు. ఆంగ్లమాధ్యమం ప్రారంభిస్తే పిల్లలను పంపిస్తామని పలువురు తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో ధైర్యం పెరిగింది. ఇదే విషయాన్ని తమ అధికారులకు వివరించి ఆంగ్లమాధ్యమానికి అనుమతి పొందారు. కరోనా సమయంలో చొరవచూపి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. తరగతి గోడలపై విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండేలా పాఠ్యాంశాల చిత్రాలను పెయింటింగ్‌ వేయించారు. కరోనా అనంతరం తరచూ తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను వివరిస్తూ వచ్చారు. గత రెండు విద్యాసంవత్సరాల్లో తొమ్మిది మంది చిన్నారులు గురుకుల పాఠశాలలకు ఎంపిక కావడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది.

ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి...
సహ ఉపాధ్యాయుడు, సర్పంచి సహకారంతో విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొంటూ క్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్నారు గుర్రంపోడు మండలం కాల్వపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.శ్రావణికుమారి. 2018లో ఆమె పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 12 మంది విద్యార్థులు ఉన్నారు.రెగ్యులర్‌గా విధులకు హాజరవుతూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రతి నెలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తూ, విద్యార్థుల ప్రగతి నివేదికను వారికి వివరిస్తూ వచ్చారు. కరోనా తర్వాతి సంవత్సరం నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

సున్నా నుంచి 37కు పెరిగిన సంఖ్య
 
విద్యార్థులకు పాఠం బోధిస్తున్న కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి
చిట్యాల మండలం బోయగుబ్బ ప్రాథమిక పాఠశాలకు 2018లో బదిలీపై వచ్చారు కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య సున్న. మూసివేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. అప్పటి వరకు కాంప్లెక్సు పాఠశాలలో పనిచేసి విరమణ చేసిన ఉపాధ్యాయులు, విద్యావాలంటీర్ల సహకారాన్ని తీసుకుని ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించాల్సిందిగా అభ్యర్థించారు. ఇదే మండలంలోని పిట్టంపల్లి, పెద్దకాపర్తి పాఠశాలల్లో పనిచేసినప్పుడు  శ్రీనివాసరెడ్డి అందించిన సేవలు కూడా సానుకూల ప్రభావాన్ని చూపించగా.. 12 మంది విద్యార్థులను పాఠశాలకు రప్పించగలిగారు. పాఠశాలకు కి.మీ దూరంలోని మొగిలిదొరి గ్రామం నుంచి ఆరుగురు విద్యార్థులను తన సొంతఖర్చులతో ఆటోలో పాఠశాలకు రప్పించారు శ్రీనివాసరెడ్డి. సర్పంచి, ప్రైవేటు పరిశ్రమ సహకారంతో గత రెండేళ్లుగా ఒక విద్యావాలంటీరును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏటా ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు విద్యార్థులు క్రమం తప్పకుండా ఎంపిక కావడం కూడా తల్లిదండ్రుల్లో పాఠశాల, బోధనపట్ల నమ్మకం పెరిగింది. ప్రస్తుతం 37 మంది విద్యార్థులు ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని