logo

ముంపు తప్పేలా.. పై ఎత్తు

వర్షం అంటే చాలు.. లోతట్టు ప్రాంతాల వాసులు వణికిపోతున్నారు. 2020 అక్టోబరులో నగరాన్ని ముంచెత్తిన వరద బీభత్సం ఇంకా మర్చిపోలేదు.

Updated : 27 Jun 2023 10:55 IST
హౌస్‌ లిఫ్టింగ్‌ను ఆశ్రయిస్తున్న నగరవాసులు
ఈనాడు, హైదరాబాద్‌
అల్వాల్‌ ఆర్‌కేపురంలో హౌస్‌ లిఫ్టింగ్‌

వర్షం అంటే చాలు.. లోతట్టు ప్రాంతాల వాసులు వణికిపోతున్నారు. 2020 అక్టోబరులో నగరాన్ని ముంచెత్తిన వరద బీభత్సం ఇంకా మర్చిపోలేదు. వరదలు వచ్చినప్పుడల్లా రెండు నుంచి ఐదు అడుగుల మేర నీరు నిలవడం.. కష్టపడి కొనుగోలు చేసిన విలువైన వస్తువులు పాడవ్వడం.. రోజులపాటు జాగారం వంటి భయానక పరిస్థితులను మర్చిపోలేక పోతున్నారు. ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇంటిని వదిలి ఆశ్రయం కోసం అద్దె నివాసానికి చేరడం.. పరిస్థితి చక్కబడగానే తిరిగిరావడం వంటి ప్రయాసలు తప్పడం లేదు. ఈ క్రమంలో ఇంటిని కూల్చి కొత్తగా నిర్మించే స్తోమత లేకపోవడంతో నాలుగైదు అడుగులు పైకి లేపే ‘జాకీ హౌస్‌ లిఫ్టింగ్‌’ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో హరియాణా తదితర ప్రాంతాల నుంచి బృందాలు ఈ పనులు చేసేవి. ప్రస్తుతం నగరంలోనే నాలుగైదు సంస్థలు ఉన్నాయి. ఇప్పటివరకు 1000కి పైగా ఈ తరహా నిర్మాణాలు చేపట్టామని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ఎక్కడెక్కడంటే.. ఉప్పల్‌ హనుమాన్‌ నగర్‌, కర్మన్‌ఘాట్‌, చింతల్‌, ఎల్బీనగర్‌, సంతోష్‌నగర్‌, నాగోల్‌, మీర్‌పేట్‌, మల్కాజిగిరి,  సుచిత్ర, చంపాపేట్‌, బోయిన్‌పల్లి, అల్వాల్‌ తదితర ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టారు.

ఖర్చు ఎంతంటే..

విదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ‘అండర్‌ పిన్నింగ్‌’ పద్ధతి భాగ్యనగరానికి విస్తరించింది. బీమ్‌లను ఆధారం చేసుకుని డ్రిల్లింగ్‌ చేస్తూ ఆ స్థానంలో జాకీలు అమర్చుతారు. ఇలా ఇంటి కింది భాగంలో వందల సంఖ్యలో జాకీలను ఏర్పాటు చేస్తారు. రోజూ మిల్లీమీటర్ల మేర ఒక అడుగు ఎత్తు పెంచి. ఆ తర్వాత ఖాళీ స్థలంలో నిర్మాణం చేపడుతూ.. మరో అడుగు ఎత్తును పెంచుతారు. ఇలా నెల నుంచి రెండు నెలల వ్యవధిలో అనుకున్న ఎత్తుకు చేర్చుతారు. ఇలా ఒక అడుగు ఎత్తు పెంచాలంటే చదరపు అడుగుకు రూ.180 నుంచి రూ.200, రెండు అడుగుల అయితే చదరపు అడుగుకు రూ.50 నుంచి రూ.60 పెరుగుతాయి. అంతస్తులు పెరిగితే అందుకనుగుణంగా ధరల్లో మార్పులుంటాయి. ఇంటిని ఎత్తే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాలకు ఆస్కారం ఉంది.

సుచిత్రలో..


30 నుంచి 40 రోజుల్లో పూర్తి..

నాగేంద్ర, నిర్మాణదారుడు

న్యూజిలాండ్‌, అమెరికాలో ఈ తరహా పనులు చేపడుతున్న సంస్థలు, ఉత్తర భారతదేశంలో పనులు చేపట్టిన సంస్థలు ఉపయోగిస్తున్న సాంకేతికతను అధ్యయనం చేసిన అనంతరమే పనులు ప్రారంభించాం. ఇంటి ఎత్తును పెంచుతున్న క్రమంలో గోడలు బలహీనంగా ఉంటే కొన్నిసార్లు బీటలు వారే అవకాశం ఉంది. ఈ క్రమంలో వాటిని మరింత దృఢంగా మార్చుతూ పనులు కొనసాగిస్తాం. లేదంటే కొత్త గోడలు నిర్మిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని