TSRTC: 30 కి.మీ. పరిధిలో ఆర్టీసీ ప్రత్యేక టికెట్‌

పల్లెల నుంచి దగ్గరలోని పట్టణాలకు రాకపోకలు సాగించేవారిపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించింది. 30 కి.మీ. వరకు ప్రయాణాలు చేసేవారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టికెట్‌ తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

Updated : 27 Jun 2023 05:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: పల్లెల నుంచి దగ్గరలోని పట్టణాలకు రాకపోకలు సాగించేవారిపై టీఎస్‌ఆర్టీసీ దృష్టి సారించింది. 30 కి.మీ. వరకు ప్రయాణాలు చేసేవారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక టికెట్‌ తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ అధికారులతో ఈ విషయంపై చర్చించారు. రానుపోను ప్రయాణం చేస్తే అయ్యే టికెట్‌ మొత్తం ఛార్జీ కంటే కొంత మొత్తాన్ని తగ్గించి ప్రత్యేక టికెట్‌ ఖరారు చేయాలనుకుంటున్నారు. రాయితీ టికెట్‌ ప్రవేశపెట్టడం వల్ల వెళ్లేటప్పుడు లేదంటే తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు ఎక్కరని... ప్రైవేటు వాహనాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా ఆదాయం పెరుగుతుందని ఆర్టీసీ భావిస్తోంది.

టీ-9 టికెట్‌పై సమీక్ష

ఈనెల 18 నుంచి ఆర్టీసీ టీ-9 టికెట్‌ ప్రవేశపెట్టింది. రూ.100 చెల్లిస్తే 60 కి.మీ. పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. మహిళలు, వృద్ధులకు ఈ రాయితీ టికెట్లు ఇస్తున్నారు. అయితే 50, 60 కి.మీ. దూరం ప్రయాణం చేసేవారికి మాత్రమే ఇది కొంత ఉపయోగకరంగా ఉంది. చాలామంది 20, 30 కి.మీ. దూరం ప్రయాణం చేసేవారున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం 30 కి.మీ. పరిధిలో మరో ప్రత్యేక టికెట్‌ తీసుకువచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది.

సూర్యాపేటలో ఆగనున్న ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్‌-విజయవాడల మధ్య ప్రవేశపెట్టిన ఈ-గరుడ ఎలక్ట్రిక్‌ బస్సులు ఇక సూర్యాపేట బస్టాండ్‌లోనూ ఆగనున్నాయి. ప్రస్తుతం సూర్యాపేటలోని ఓ ప్రైవేటు స్టేషన్‌లో ఛార్జింగ్‌ చేస్తున్నారు. సూర్యాపేట బస్టాండ్‌లో ఆర్టీసీ ఏర్పాటుచేస్తున్న ఛార్జింగ్‌ స్టేషన్‌ పనులు దాదాపు పూర్తయ్యేదశలో ఉన్నాయి. జులై తొలివారంలో ఇది అందుబాటులోకి వస్తుందని.. హైదరాబాద్‌-విజయవాడ ఈ-గరుడ బస్సుల్లో సూర్యాపేటలోనూ ఎక్కి, దిగేలా ప్రయాణికులకు అవకాశం కల్పించనున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.


ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్‌ ఛార్జీల తగ్గింపు

స్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ ఛార్జీల్ని ఆర్టీసీ సవరించింది. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో 350 కి.మీ.లోపు ప్రయాణానికి రూ.20.. ఆపై దూరానికి రూ.30గా నిర్ణయించింది. సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.30గా ఖరారు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రోజూ సగటున 15 వేల మంది తమ టికెట్లు ముందస్తుగా రిజర్వు చేసుకుంటున్నారు. కొద్దివారాలుగా ఆదాయం పెరుగుతూ నష్టాలు తగ్గుతుండèంతో రిజర్వేషన్‌ ఛార్జీలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని