logo

అధికార ఫ్లెక్సీలపై అంతులేని ప్రేమ

‘మా నాయకుడి పుట్టిన రోజని ఫ్లెక్సీలు పెట్టాం.. పూటకూడా గడవకుండా తీసేశారు. మా ఫ్లెక్సీలు ఒక్కరోజు కూడా ఉంచరా..? వైకాపా వాళ్ల ఫ్లెక్సీల జోలికైతే వెళ్లరా..? అధికార పార్టీకో రూలు.. ప్రతిపక్ష పార్టీలకో రూలా..? ఇది కరెక్టు కాదు.. కాకినాడను ప్రశాంతంగా ఉండనివ్వరా’’..? అంటూ తెదేపా నాయకులు కాకినాడ నగర పాలక సంస్థ సిబ్బందిపై ధ్వజమెత్తారు.

Published : 27 Jun 2023 07:03 IST

ప్రతిపక్షాలు ఏర్పాటు చేస్తే ఆగమేఘాలపై తొలగింపు
ఈనాడు, కాకినాడ

తెదేపా మాజీ ఎమ్మెల్యే పుట్టిన రోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి వాహనంలో వేశారిలా..

వాటి జోలికి వెళ్లరా..?

‘మా నాయకుడి పుట్టిన రోజని ఫ్లెక్సీలు పెట్టాం.. పూటకూడా గడవకుండా తీసేశారు. మా ఫ్లెక్సీలు ఒక్కరోజు కూడా ఉంచరా..? వైకాపా వాళ్ల ఫ్లెక్సీల జోలికైతే వెళ్లరా..? అధికార పార్టీకో రూలు.. ప్రతిపక్ష పార్టీలకో రూలా..? ఇది కరెక్టు కాదు.. కాకినాడను ప్రశాంతంగా ఉండనివ్వరా’’..? అంటూ తెదేపా నాయకులు కాకినాడ నగర పాలక సంస్థ సిబ్బందిపై ధ్వజమెత్తారు. కాకినాడ నగర తెదేపా మాజీ ఎమ్మెల్యే కొండబాబు పుట్టినరోజున నగరంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆరోజు మధ్యాహ్నం నుంచే తొలగించడంపై తెదేపా నాయకులు నిరసన తెలిపారు. ఏకంగా ధర్నాకు దిగారు.

అనుమతిపొందినా అదే తీరు!

తితిదే పాలకవర్గ సభ్యుడు, పుదుచ్ఛేరి ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఆయన అభిమానులు ఈనెల 6న కాకినాడ నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. నగర పాలక సంస్థ నుంచి అనుమతి పొంది.. నిర్ణీత రుసుము చెల్లించి ఏర్పాటుచేసినా.. అధికార పక్ష నాయకుడి ఒత్తిళ్లకు తలొగ్గిన యంత్రాంగం వీటిని ఆగమేఘాలపై తొలగించింది. ఈ చర్యలపై గుర్రుగా ఉన్న మల్లాడి ఆధ్వర్యంలోని బీసీ సంఘాల ప్రతినిధులు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదుచేశారు. ఈ ‘పంచాయితీ’ ముఖ్యమంత్రి వరకు వెళ్లింది.

రాత్రి ఏర్పాటు.. తెల్లారికి మాయం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గతంలో నిర్వహించిన ప్రజాపోరాట యాత్రలో భాగంగా పార్టీ శ్రేణులు నగరంలో ముందురోజు రాత్రి నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధినేత ఆగమన వేళ.. తెల్లారే
సరికి ఫ్లెక్సీలు చాలాచోట్ల మాయమయ్యాయి. దీంతో ఆగ్రహించిన జనసేన నాయకులు పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆనందభారతి ప్రాంతంలో ఆందోళనకు దిగారు. వెనక్కి తగ్గిన సిబ్బంది... తొలగించిన ఫ్లెక్సీలు తిరిగి ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడలోని పగడాలపేటలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించేయడం.. నగరంలో ఏర్పాటుచేసిన కటౌట్లు రాత్రికి రాత్రే తొలగించడం వివాదాస్పదమయ్యింది.

కాకినాడ నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. ఆకర్షణీయ నగరమైన ఇక్కడ ప్రచార పర్వం గతితప్పుతోంది. వాణిజ్య సంస్థలు హోర్డింగుల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొందుతూ నిబంధనల ప్రకారం రుసుము చెల్లిస్తున్నా.. రాజకీయ పక్షాలకు లెక్కలేకుండా పోతోంది. క్షేత్రస్థాయిలో ప్రచారాల హోరు చూస్తే కార్పొరేషన్‌కు రూ.కోట్లలో ఆదాయం సమకూరాలి. కానీ వాణిజ్య సంస్థల హోర్డింగుల ద్వారా ఏటా రూ.70 లక్షలు మాత్రమే ఆదాయం సమకూరుతోంది. రాజకీయ పక్షాల నాయకులు  కనీస అనుమతుల్లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని.. చెల్లింపులు జరపడం లేదని పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఒకరు చెప్పారు.

అధికార వైకాపా నాయకుల ఫ్లెక్సీలు, కటౌట్లు.. నెలల తరబడి అలాగే ఉంటాయి. వాటిపై ఈగ వాలనివ్వరు.. అదే ప్రతిపక్షాల నాయకులు ఏర్పాటుచేస్తే  మాయమైపోతాయి. నగరపాలక యంత్రాంగం ఆగమేఘాలపై వాహనంతో వచ్చి తొలగిస్తుంది. కాకినాడలో కొన్నేళ్లుగా సాగుతున్న తంతు ఇది. ఫ్లెక్సీలు తొలగించిన ప్రతిసారీ వ్యవహారం వివాదాస్పదమవుతున్నా.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆ పంథా వీడడంలేదు. అధికారపక్ష కార్యక్రమాలకు అనుమతుల విషయంలో చూసీచూడనట్లు వదిలేస్తూ.. అనుమతులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న ఇతర పార్టీలపై మాత్రం ప్రతాపం చూపిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

* కాకినాడలో ఫ్లెక్సీల ఏర్పాటును రాజకీయ ఒత్తిళ్ల నడుమ చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. నగరమంతా మా ఫ్లెక్సీలే ఉండాలి.. మిగిలినవి మచ్చుకైనా కనిపించకూడదన్న అధికార పక్ష విపరీత ధోరణి అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇతర పార్టీల కార్యక్రమాలు ఏవి జరిగినా కార్యక్రమం పూర్తికాకుండా.. లేదంటే ఆరోజు రాత్రికే తొలగిస్తున్నారు. వైకాపా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నం. ప్రధాన కూడళ్లలో నిలువెత్తు కటౌట్లు దర్శనమిస్తున్నా.. డివైడర్ల మధ్యలో, దారి పొడవున నెలల తరబడి చోటా, బడా నాయకుల పుట్టినరోజు శుభాకాంక్షలు, స్వాగతాల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నా వాటి జోలికి మాత్రం వెళ్లడంలేదు.

* రాజమహేంద్రవరంలోనూ ఇటీవల తెదేపా మహానాడు వేడుకల్లోనూ ఫ్లెక్సీల రగడ వివాదాస్పదం అయ్యింది. తెదేపా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, హోర్డింగుల మధ్యలో వైకాపా ఎంపీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తెదేపా ఫ్లెక్సీలు కొన్ని చోట్ల  రాత్రికి రాత్రే ధ్వంసమవ్వడం విమర్శలకు తావిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని