logo

మన వారైౖతే చాలు!

ఉమ్మడి జిల్లాలో జలవనరుల శాఖలో బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కీలక పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా జలవనరుల శాఖ ఎస్‌ఈగా ఇంజినీరును నియమించలేదు.

Published : 27 Jun 2023 05:42 IST

ఇష్టారీతిన ఎఫ్‌ఏసీలుగా నియామకం
అధికార పార్టీ నేతల సిఫార్సే కీలకం
ప్రధాన శాఖల్లో అధికారుల బది‘లీలలు’
ఈనాడు, అమరావతి

 

అది డీఈఈ పోస్టు. అక్కడ కీలక పనులు జరుగుతున్నాయి. అడ్డగోలు ఎంబీలకు ఆ ఇంజినీరు తల ఊపడం లేదు. అంతే.. ఆయనను వేరే సెక్షన్‌కు బదిలీ చేశారు. డీఈ స్థాయి పోస్టులో ఒక ఏఈఈని ఇన్‌ఛార్జిగా నియమించి.. ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) ఇచ్చేలా ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. నేడో రేపో ఉత్తర్వులు రానున్నాయి. ఇదీ.. జల వనరుల శాఖలో ఒక సబ్‌ డివిజన్‌లో తీరు. ఇదే కాదు.. తమకు అనుకూలంగా మాట వినడం లేదని.. సర్కిల్‌ అధికారిపైనే వేటు వేశారు. ఒక్క జలవనరుల శాఖలోనే కాదు.. ఇతర శాఖల్లోనూ కీలక పోస్టుల్లో ఎఫ్‌ఏసీ పేరుతో ఇన్‌ఛార్జిలను నియమించారు. కొన్ని పోస్టుల్లో కింది స్థాయి క్యాడర్‌ ఉద్యోగులకే ఇన్‌ఛార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే అన్నిరకాల దస్త్రాలపై  ఆయన నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.

పోస్టులు ఖాళీగా ఉంచడంలో సమర్థమైన అధికారులు లేరని కాదు.. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదనే కారణంతోనే అడ్డగోలుగా నియామకాలు చేసినట్లు తెలిసింది. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు చేశారు. పదవీ విరమణకు మూడు నెలల ముందు ఓ జిల్లా అధికారిణిని బదిలీ చేయగా.. అధికార పార్టీ నేతలతో (ప్రజాప్రతినిధులతో) తనకెందుకు ఘర్షణ అని ఆమె మౌనంగా ఉన్నారు. వడ్డించేది మనవారైతే.. అన్నట్లు ఎన్నికల ఏడాది కావడంతో కీలక పోస్టుల్లో తమ అనుచరులను నియమిస్తుండగా... కొన్ని పోస్టులు ఎన్నికల ‘ఫండ్‌’ ప్రాధాన్యంగా నియామకాలు జరిగినట్లు తెలిసింది. దీనిపై అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో జలవనరుల శాఖలో బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కీలక పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా జలవనరుల శాఖ ఎస్‌ఈగా ఇంజినీరును నియమించలేదు. ఈఈకి ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. గతంలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న తిరుమలరావును నియమించారు. ఆయన ఏడాది కూడా పనిచేయలేదు. తిరిగి పంపించారు. గత ఏడాది ప్యాకేజీ పనులను ఆయన వ్యతిరేకించారు. ఈ ఏడాది పనులకు ఆయన ఆమోదం తెలపలేదు. అంతే ఆయనపై బదిలీ వేటు వేశారు. కృష్ణా తూర్పు డివిజను ఈఈగా ప్రసాద్‌ను నియమించి ఆయనకు ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.


* కృష్ణా సెంట్రల్‌ డివిజను ఈఈగా పీవీఆర్‌ కృష్ణారావుకు ఎఫ్‌ఏసీ అప్పగించారు. ఆయన అసలు పోస్టు ప్రధాన కార్యాలయం సబ్‌డివిజను డీఈఈ. ఒక అంచె పైస్థాయిలో ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగించారు. సెంట్రల్‌ డివిజనులో నిర్వహణ పనులు కీలకంగా ఉన్నాయి.

* గుడివాడ డ్రెయినేజీ డివిజను ఈఈగా విజయలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ... నియమించారు. ఆమె అసలు పోస్టు కాడా (కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌) డీఈఈ. పులిగడ్డ సబ్‌డివిజన్‌ ఈఈగా ఆర్‌.రవికిరణ్‌ను నియమించారు. ఎఫ్‌ఏసీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన అసలు పోస్టు డ్రెయినేజీ విభాగం ఈఎన్‌సీ కార్యాలయం.

* చల్లపల్లి డ్రెయినేజీ స్పెషల్‌ సబ్‌ డివిజను డీఈఈ ఇమ్మానియేల్‌ను క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి బదిలీ చేశారు. ఈపోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. పులిగడ్డ ఇరిగేషన్‌ సెక్షన్‌లో ఒక ఏఈకి దీని ఎఫ్‌ఏసీని అప్పగించేలా నిర్ణయించారు.
* అకౌంట్స్‌ విభాగాల్లోనూ సిబ్బందిని అలాగే ఎఫ్‌ఏసీలు అప్పగించారు.


వేతనం అక్కడ.. విధులు ఇక్కడ!

* పలుశాఖల జిల్లా అధికారులకు ఎఫ్‌ఏసీలు చర్చనీయాంశమైంది. గృహ నిర్మాణ శాఖలో ఇదే తీరు. ఇక్కడ మెరక పనులు, ఇతర బిల్లులు రూ.కోట్లలో చేయిస్తున్నారు. దీనికి అనుకూలంగా బదిలీలు, నియామకాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా గృహనిర్మాణ అధికారిణి శ్రీదేవిని పదవీ విరమణకు మూడు నెలల ముందు బదిలీ చేశారు. ఈనెల 30తో ఆమె పదవీ విరమణ చేస్తున్నారు. ఆమె స్థానంలో రజినీ కుమారిని నియమించారు. ఆమె అసలు స్థానం అనంతపురం జిల్లా. వేతనం అక్కడ తీసుకుంటున్నారు. విధులు ఎన్టీఆర్‌ జిల్లాలో చేస్తున్నారు. డిప్యుటేషన్‌పై ఉన్నారు.

* కృష్ణా జిల్లా గృహనిర్మాణ అధికారి(పీడీ) రామచంద్రన్‌ ఉన్నారు. కానీ ఆయన విధులు ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. అక్కడ పోస్టు డ్వామా పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం బాగోలేదని వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసిన పీడీ రామచంద్రన్‌ను ప్రధాన కార్యాలయానికి పంపడం విశేషం.

* దేవదాయశాఖ కృష్ణా జిల్లా అధికారిణిగా ఎన్టీఆర్‌ జిల్లా అధికారిణి శాంతి వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాలకు ఆమె అధికారిణిగా ఉన్నారు. ఇతర అధికారులు ఉన్నా వారికి పోస్టు ఇవ్వలేదు.

* దేవదాయశాఖలో పలు గ్రూపు దేవాలయాలు.. ఆయా ఈవోల కిందకు వస్తాయి. కానీ కృష్ణా జిల్లా ఈవోలకు ఎన్టీఆర్‌ జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లా ఈవోలకు కృష్ణాజిల్లా గ్రూపు దేవాలయాలను అప్పగించడం విశేషం.

* రెవెన్యూ, జిల్లా పరిషత్తు శాఖల్లో తహసీల్దార్లను, ఎంపీడీవోలను తమకు అనుకూలమైన వారినే ప్రజాప్రతినిధులు కావాలని నియమించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని