logo

దిద్దుబాటు.. సమాయత్తం

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బరిలో దిగేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహులు నామినేషన్లకు ముందే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ప్రజల నాడి తెలుసుకుంటున్నారు.

Updated : 27 Jun 2023 06:42 IST
అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి ఆశావహులు
ఈనాడు, కామారెడ్డి: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బరిలో దిగేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహులు నామినేషన్లకు ముందే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ప్రజల నాడి తెలుసుకుంటున్నారు. ఆశావహుల వరుస పర్యటనలతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.

మచ్చిక చేసుకునేందుకు...

తమకే తిరిగి టికెట్లు దక్కుతాయనే నమ్మకంతో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేలు వారిని ఇళ్లకు పిలిచీ మరీ పదవులు కట్టబెడుతున్నారు. నిరాశలో ఉన్న సామాజికవర్గాలను మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. పార్టీలోనే ఉంటూ ప్రతిపక్షాలకు సహకరిస్తున్నాడనే అనుమానం ఉన్న వారిని పార్టీ, అధికార పదవుల నుంచి తప్పించేస్తున్నారు. కుల సమీకరణాలు బేరీజు వేసుకుంటూ పదవులు పంచేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను సొంత వాహనాల్లో రాజధానికి తీసుకెళ్లడంతో పాటు దగ్గరుండి మరీ పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు మంజూరు చేయిస్తూ ఆయా పనుల కాంట్రాక్టులు అనుయాయులకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

సేవా కార్యక్రమాలతో ప్రతిపక్షాలు

ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహులు సేవ, ఆర్థిక సహాయ కార్యక్రమాలతో ప్రజల ముందుకు వస్తున్నారు. తమకు టికెట్‌ వస్తే సహకారం అందించాలని నేతల నుంచి హామీ తీసుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతిపక్షానికి చెందిన ఇద్దరు నేతలు పోటాపోటీగా వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు అంబులెన్స్‌లు, ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో కార్యకర్తలు, నేతలు సేదతీరేందుకు ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసి ఉచిత భోజనాలు సమకూరుస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మరో పార్టీ నేత దేవాలయాలు, సామాజికవర్గాల వారీగా కమ్యూనిటీ భవనాలు, రహదారుల నిర్మాణాలను సొంత నిధులతో చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. జుక్కల్‌ నియోజకవర్గంలో సైతం ప్రతిపక్ష నాయకులతో పాటు అధికార పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని