Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Mar 2024 09:01 IST

1. అసెంబ్లీ బరిలో.. ఆరుగురు మాజీ సీఎంల కుమారులు

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల వారసులు పోటీ చేయడం సహజమే. ముఖ్యమంత్రి, మాజీ సీఎంల కుమారులూ ఒకరిద్దరు రంగంలో ఉంటారు. ఈ దఫా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏకంగా ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో నిలుస్తుండడం విశేషం. మరో ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. పూర్తి కథనం 

2. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీలలోనూ కట్‌ ఆఫ్‌ వాల్‌-  సీకెంట్‌ పైల్‌్్సకు సంబంధించిన డిజైన్‌ అమలులో తేడా ఉన్నట్లు నేషనల్‌ డ్యాం సేఫ్టీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డలో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్‌ ఆఫ్‌ వాల్‌- సీకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్‌వాల్స్‌ లేవనే విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.పూర్తి కథనం 

3. 2004 చరిత్ర పునరావృతం: జైరాం రమేశ్‌

రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న భాజపా వాదనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తోసిపుచ్చారు. ‘టైగర్‌ మే అభీ బహుత్‌ జాన్‌ హై’ (పులిలో ఇంకా చాలా దమ్ముంది) అని పేర్కొన్న ఆయన.. విపక్ష కూటమి 2004 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తుందన్నారు. ఆ ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‌’ అంటూ బరిలోకి దిగిన భాజపా అధికారం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు.పూర్తి కథనం 

4. కోణార్క్‌కు వందేభారత్‌ కష్టాలు

సికింద్రాబాద్‌ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం ఇతర రైళ్లను ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి నిలిపి వేస్తున్నారు. శుక్రవారం చింతపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్లు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019)ను గంట పాటు నిలిపి వేశారు. ఇలా ప్రతి రోజూ జరుగుతుండడంతో మహబూబాబాద్‌, ఖమ్మం రోజువారీగా వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.పూర్తి కథనం 

5. మూడంచెల వ్యూహం..14 సీట్లే లక్ష్యం

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌.. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్‌ బూత్‌ స్థాయుల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతోపాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు.పూర్తి కథనం 

6. ఈ పాపాలెవరివి జగనన్నా!

మాదకద్రవ్యాల రహితం సంగతి అటుంచితే జిల్లా వ్యాప్తంగా గంజాయి వేళ్లు బలంగా నాటుకుంటున్నాయి. పల్లె పల్లెకూ పాకుతూ ఇంకా లోతులకు చొచ్చుకుపోతోంది. ప్రజల ప్రాణాలను తోడేసే గంజాయి భూతం జిల్లాను పట్టి పీడిస్తోంది. మత్తు వలయంలో చిక్కుకున్న యువత తమ భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటోంది. వీటితో పాటు తాజాగా విశాఖలో డ్రగ్స్‌ మూలాలు నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిని చూపుతున్నాయి.పూర్తి కథనం 

7. టెట్‌ రుసుములు భారీగా పెంపు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా  పెంచింది. గతంలో ఒక పేపర్‌ రాస్తే రూ.200 రుసుము ఉండగా... దాన్ని రూ.వెయ్యికి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుము ఉండగా.. దాన్ని రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్‌కు సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది.పూర్తి కథనం 

8. కొల్లేరును శాసిస్తున్న క్యాట్‌ఫిష్‌

అరుదైన నల్లజాతి చేపలకు నిలయమైన  కొల్లేరులో క్యాట్‌ఫిష్‌ సంతతి అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంది. నిషేధిత ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌, రాక్షస జాతి చేపల ఉద్ధృతితో అరుదైన జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఎంతో గడ్డు పరిస్థితులను సైతం తమకు అనుగుణంగా మార్చుకొంటూ మనుగడను సాధించే క్యాట్‌ఫిష్‌, రాక్షస జాతి(సైల్పిన్‌ క్యాట్‌ఫిష్‌) చేపలు నానాటికీ పెరుగుతున్నాయి.పూర్తి కథనం 

9. కారుకు మహా కుదుపు.. కాంగ్రెస్‌లో చేరనున్న మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి?

రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్‌ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని మేయర్‌ పదవికి భరోసా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.పూర్తి కథనం 

10. గన్నవరంలో వైకాపా నేతల అరాచకం

రాష్ట్రంలో వైకాపా నేతలు బరితెగించి దాడులకు తెగబడుతున్నారు. కోడ్‌ ఉల్లంఘనలపై సీ-విజిల్‌ యాప్‌లో చిత్రాలను అప్‌లోడ్‌ చేసి సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేయాలంటూ ఎన్నికల సంఘం ప్రచారం చేస్తోంది. కానీ తెదేపా అభ్యర్థులు సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదులు చేస్తుంటే, వారిపై వైకాపా వర్గీయులు దాడులకు దిగుతున్నారు.పూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని