Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Mar 2024 13:10 IST

1. సీఎం నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలేవీ?: లోకేశ్

తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్‌ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. ఆయన ఇంటి సమీపంలో తాగునీటి సమస్య ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్టుమెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. పూర్తి కథనం

2. అలా చేసుంటే కేజ్రీవాల్‌ అరెస్టయ్యేవారు కాదేమో: హిమంత బిశ్వశర్మ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేయడం వల్లే మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టయ్యారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) అన్నారు. తద్వారా అరెస్టును తానే కోరితెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా సానుభూతి పొందడం కోసమే అలా చేసి ఉంటారని ఆరోపించారు.పూర్తి కథనం

3. విజయవాడ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. వేకువజామున 4 గంటల ప్రాంతంలో అక్కడి పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మద్యం తాగిన యాచకులు, బ్లేడ్‌ బ్యాచ్‌ బస్టాండ్‌లోని బెంచీలను ఆక్రమించుకుని నిద్రించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది చర్యలు చేపట్టారు.పూర్తి కథనం

4. జైలు నుంచే తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌..! 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పాలన సాగిస్తారా..? లేదా..? అనే అంశంపై గందరగోళం నెలకొన్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) వర్గాలు వెల్లడించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీ నుంచే ఆయన నేడు తొలిసారి దిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పూర్తి కథనం

5. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్‌

ప్రైవేటు వ్యక్తుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శనివారం భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్‌ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు.పూర్తి కథనం

6. మెసేజింగ్‌ యాప్‌ నుంచే మాస్కోదాడి కుట్ర అమలు.. నిందితుల ఇంటరాగేషన్‌లో వెల్లడి..!

రష్యా (Russia) రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాలులో దాడి (Moscow attack) చేసిన ముష్కరులను కేవలం మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ నుంచే నడిపించినట్లు గుర్తించారు.  నిందితులను బంధించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. తమకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చిన వారెవరో తెలియదని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను జాతీయ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.పూర్తి కథనం

7. ఆండ్రి రస్సెల్‌ బెస్ట్‌.. కానీ, గంభీర్‌ రావడమే కోల్‌కతాకు ప్లస్‌: సునీల్ గావస్కర్

ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా బోణీ కొట్టింది. ఉత్కంఠపోరులో హైదరాబాద్‌పై విజయం సాధించింది. బ్యాటింగ్‌లో ఆండ్రి రస్సెల్ దూకుడైన ఆటతీరు ప్రదర్శించాడు. కేవలం 25 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీశాడు. కోల్‌కతా విజయంలో రస్సెల్‌ కీలక పాత్ర పోషించినప్పటికీ.. మెంటార్‌గా గంభీర్‌ తిరిగి రావడమే ఆ జట్టుకు బలంగా మారిందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. పూర్తి కథనం

8. ఔటైన బ్యాటర్‌కు ఫ్లైయింగ్‌ కిస్‌.. కోల్‌కతా స్టార్‌కు భారీ జరిమానా

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించడానికి కారణం యువ బౌలర్‌ హర్షిత్ రాణా. చివరి ఓవర్‌లో హైదరాబాద్‌కు 13 పరుగులు అవసరమైన క్రమంలో కేవలం 8 రన్స్‌ మాత్రమే ఇచ్చి తన జట్టును గెలిపించాడు. కీలకమైన క్లాసెన్‌తోపాటు షహబాజ్‌ వికెట్లను తీశాడు. అంతకుముందు ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ (32)ను కూడా రాణా ఔట్ చేశాడు.పూర్తి కథనం

9. చంద్రబాబు సీఎం అయ్యాక ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇతర పార్టీల నేతలపై సోషల్‌ మీడియా ద్వారా వైకాపా వేధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వివేకా కుమార్తె సునీతపై సోషల్‌మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.పూర్తి కథనం

10. జొమాటో ఆ నిర్ణయం వెనుక 20 గంటల జూమ్‌ కాల్‌!

కేవలం శాకాహారుల కోసం మాత్రమే జొమాటో (Zomato) ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన ఈ ఫుడ్‌ డెలివరీ కంపెనీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డెలివరీ బాయ్స్‌ కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ యూనిఫాం కాకుండా అందరికీ ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని